– సీఎం రేవంత్, మంత్రి సీతక్క మండిపాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యత్వానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. ‘వోట్ చోరీ’, ‘ఎసఐఆర’.. ఇప్పుడు బీజేపీ ‘సీట్ చోరీ’కి పాల్పడుతోంది అని ఆరోపించారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవన్నారు. జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారన్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, ప్రజల గొంతులను అణచివేయడమేనని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజుగా పేర్కొన్నారు. దీనిని పౌరులందరూ ఖండించాలన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిందని మంత్రి సీతక్క అన్నారు. రాజ్యసభ ఎన్నికల చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అంటూ ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. గతంలో పలువురు బీజేపీ నాయకులు తమ ఎన్నికల అఫిడవిట్లలో కేసులు, ఇతర వివరాలను దాచిపెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదన్నారు. కానీ మీనాక్షి నటరాజన్ విషయంలో మాత్రం లేని కేసును ఉన్నట్టుగా బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకుని నామినేషన్‌ను తిరస్కరించడం దుర్మార్గమైన చర్య విమర్శించారు. ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం వెనుక బీజేపీ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





