– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
భువనగిరి,ప్రజాతంత్ర,జూన్ 9: ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్ పంపలేకపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్రం నిర్వహించదని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రమే రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని స్పష్టంచేశారు. దేశవ్యాప్త ధాన్యం సేకరణలో దాదాపు 50 శాతం తెలంగాణ నుంచే జరిగినప్పటికీ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలను పక్కనబెట్టి, వాస్తవాలను దాచిపెడుతూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఇదే క్రమంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసి ప్రక్షాళన ప్రాజెక్టులు సీఎం రేవంత్ రెడ్డికి ’ఏటీఎం’లుగా మారాయని రాంచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం ’గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకే తమ అభ్యంతరమని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, అలాగే కాళేశ్వరం అవినీతి అంశంలో కేసీఆర్‌ను కాపాడేందుకే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




