రాష్ట్ర ఆత్మగౌరవ గీతానికి చిరస్మరణీయ నివాళి

– ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతి వనం 
– స్మృతి వనం పనులు పరిశీలించిన మంత్రి అడ్లూరి

ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, జూన్ 9: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహాకవి, ప్రజా గాయకుడు, రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్(ఓఆరఆర్) పక్కన ఏర్పాటు చేయనున్న అందెశ్రీ స్మృతి వనం స్థలాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో అందెశ్రీది ప్రత్యేక స్థానం అని పేర్కొన్నారు. తన గీతాలు, రచనల ద్వారా తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అందెశ్రీ సేవలకు గుర్తింపుగా ఈ స్మృతి వనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఘట్‌కేసర్‌లో ప్రభుత్వం ఎకరం 22 గుంటల భూమిని ఇందుకోసం కేటాయించిందని మంత్రి వెల్లడించారు. ఇది ఒక ఉద్యానవనం మాత్రమే కాక తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే స్మారక క్షేత్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. అందెశ్రీ జీవిత విశేషాలు, ఉద్యమంలో ఆయన పాత్ర, సాహిత్య సేవలను భావితరాలకు చేరవేసే విధంగా స్మృతి వనాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను, ఉద్యమ స్పూర్తిని యువతకు పరిచయం చేసే జ్ఞాపక చిహ్నంగా ఈ ప్రాంగణం నిలవాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ స్మృతి వనం అభివృద్ధికి ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం స్మృతి వనాన్ని నిర్వహణ కోసం హెచఎండీఏకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇందులో అందెశ్రీ విగ్రహం, ఆయన జీవిత చరిత్రను ప్రతిబింబించే శిలాఫలకాలు, ఉద్యమ గీతాల ప్రదర్శన గ్యాలరీ, సాహిత్య వేదిక, పచ్చదనంతో కూడిన ప్రత్యేక ఉద్యానవనం, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *