అస్తవ్యస్తంగా ఎంజీఎం హాస్పిటల్ నిర్వహణ: మాజీ మంత్రి హరీశ్ రావు
వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : వరంగల్ లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్ ఏర్పాటు చేశారని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు కేసీఆర తోపాటు తాను సమీక్షించి 84శాతం పనులు పూర్తి చేశామని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. . కానీ, మిగతా 16శాతం పనులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. సోమవారం ఆయన వరంగల్ లోని అర్ధంతరంగా నిలిచిపోయిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దీన్ని పూర్తి చేస్తే, కేసీఆర్ కు పేరు వస్తుందని ఏవో సాకులు పెట్టి పనులను ఆపే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ ఎంజీఎం నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని . ఎంజీఎం సమస్యలపై పత్రికల్లో ప్రతిరోజూ వార్తలు వొస్తున్నాయని తెలిపారు. 24 అంతస్తుల్లో హాస్పిటల్ ఎందుకని కొత్త వాదన చేస్తున్నారని, వాస్తవానికి మొదటి 14 ఫ్లోర్లలో మాత్రమే ఈ హాస్పిటల్ ఉంటుందని మిగతా 10 ఫ్లోర్లలో ల్యాబ్, లైబ్రరీ, బ్లడ్ బ్యాంకు, డాక్టర్స్, స్టుడెంట్స్ అకామిడేషన్, తదితర సౌకర్యాలుంటాయని తెలిపారు.
జైపూర్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇలాంటి పెద్ద దవాఖాననే కట్టారని, వాళ్లు కడితే ఒప్పు, మేం కడితే తప్పా అని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణలో పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్యం ప్రజలకు అందాలనే కేసీఆర్ దీనిని ప్రారంభిం చారని, హైదరాబాద్ కు నలు దిక్కులా నాలుగు టిమ్స్, నిమ్స్ తో పాటు అంతే పెద్దది మరో హాస్పిటల్ నిర్మించారని చెప్పారు. వాటన్నింటి పనులు దాదాపుగా పూర్తి కావచ్చినా, మిగతా పనులు చేయడం లేదు ఈ ప్రభుత్వం. ఇదే మాదిరిగా ఏడాదిగా వరంగల్ హెల్త్ సిటీ పనులను నిలిపివేశారు. రైతుబంధు, బతుకమ్మ చీరెలు, మత్స్యకారులకు చేపపిల్లలు, దళితబంధు, బీసీ బంధు ఇట్లా అన్నీ బంద్ చేశారని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ ముఖ్యమంత్రి పదవి దాకా వొచ్చాడని చెబుతుంటాడని ఈ తొక్కుడు ఎప్పటికీ నడవదు అని గుర్తుంచుకోవాలని హితువుపలికారు. ఇప్పటికైనా వరంగల్ హెల్త్ సిటీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు.