రేవంత్ పాలనలో అరుపులు తప్ప ఓదార్పు లేదు..

  • ఏడాదిలో 41శాతం క్రైమ్ రేటు పెరిగింది
  • క్రైస్తవుల‌కు క్రిస్మ‌స్ కానుక‌లు ఇవ్వ‌క‌పోవ‌డం అన్యాయం
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చే గిఫ్టులను కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింద‌ని  మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు. సోమ‌వారం మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీశ్ రావు  మీడియాతో మాట్లాడారు. క్రిస్టమస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ నిలిచార‌ని, క్రైస్తవులు పండుగను సంతోషంగా చేసుకునేలా పండుగ తెల్లవారి బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి, రెండు సెలవు దినాలిచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాల‌కులు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు అన్ని మతాల వారికి అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో ఎవరికీ శాంతి లేదు, భద్రత లేదు.  రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అరుపులు తప్ప, ఓదార్పు లేదు.  ఏమైనా ప్ర‌శ్నిస్తే పేగులు మెడలేసుకుంటా, చీరుతా, సంపుతా, గోటీలాడుకుంటా, లాగుల్లో తొండలు పంపిస్తా.. ఇలాంటి మాట‌లు త‌ప్ప ఎవ‌రినైనా ఓదార్చిండా? అని ప్ర‌శ్నించారు.

సర్వశిక్ష అభియాన్ సిబ్బంది రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. అడిగిన వాళ్లను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్లమీద పగబట్టుడు.. ఇదీ ఈ రాష్ట్రంలో జరుగుతోంది.  అసెంబ్లీలో అడిగిన దానికి సమాధానం లేదు. రేవంత్ అడ్డగోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడ‌తాడు. మాకు మైక్ ఇవ్వండి అని అడిగితే, మైక్ ఇవ్వద్దని స్పీకర్ కు చెబుతాడు.  అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి హద్దులు దాటి ప్రవర్తించాడు. అబద్ధాలు మాట్లాడాడు.  మీ ప్రభుత్వం పాలసీలు ఏవి అని అడిగితే, పోలీసు వాళ్లను ఇంటికి పంపుతారు. చివరికి ఎందాక వొచ్చిందటే.. పోలీసులు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది, రికవరీ రేటు తగ్గింది.   నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది శాంతిభద్రతల మీద రిపోర్టు ఇచ్చారు. కేసీఆర్ పాలన కంటే, రేవంత్ పాలనలో ఏడాదిలో 41శాతం క్రైమ్ రేటు పెరిగింది.   గతంలో బీఆర్ఎస్ పాలనలో ఏడాది 25 వేల కేసులైతే – రేవంత్ పాలనలో ఏడాదిలో 35 వేల కేసుల‌య్యాయి. అంటే 10 వేల కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే పెరిగాయి.

మర్డర్లు, రేపులు, చైన్ స్నాచింగులు, రాబరీలు, దొంగతనాలు, ల్యాండ్ కేసుల
హోం మినిస్టర్‌, ముఖ్యమంత్రి అయిన రేవంత్ పాలనలో 10 వేల కేసులు పెరిగినయంటే అయ‌న అస‌మ‌ర్థ‌త ఏంటో అర్థంచేసుకోవ‌చ్చు. ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్, హోం మినిస్టరుగా ఫెయిల్, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఫెయిల్ అయ్యాడ‌ని విమ‌ర్శించారు.  రాష్ట్రంలో నీ ఏడాది పాలనలో 9 మతకలహాల సంఘటనలు జరిగాయి. రాష్ట్రంలో శాంతీ లేదు, పౌరులకు భద్రత లేదు. • అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి, ఆరు గ్యారెంటీల గురించి చేతులెత్తేశారు.  నమ్మి వోటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి అని ఎద్దేవాచేశారు.

ఏడాదిలో 1 లక్షా 27 వేల కోట్ల అప్పులు
ఏడాది కాలంలో 1 లక్షా 27 వేల కోట్ల అప్పులు చేశార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు మండిప‌డ్డారు. బడా కాంట్రాక్టర్ల దగ్గర పర్పంటేజీలు తీసుకొని బిల్లులిచ్చారన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో 4 లక్షల 17 వేల కోట్లు చేస్తే, మీరు ఒక్క ఏడాదిలోనే 1 లక్షా 27 వేల కోట్ల అప్పు చేశారు.  ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదు.  రైతుబంద్ బంద్ చేశారు. కేసీఆర్ కిట్ బంద్,  న్యూట్రిషన్ కిట్ బంద్, బతుకమ్మ చీరెలు బంద్ చేశారు. రైతులందరికీ ఎకరాకు వానాకాలం రూ. 7500 + యాసంగి 7500 కలిపి 15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ రైతుబంధును ప్రారంభిస్తే, రైతుబంధును బొంద పెట్టారు.  11 విడుతల్లో 72 వేల కోట్ల రైతుంబంధు ఇచ్చి, రైతులపై  కేసీఆర్ తన ప్రేమను చాటుకున్నారు.  దుక్కి దున్నే రైతు దు:ఖం తీర్చింది కేసీఆర్ అయితే, రైతును దు:ఖంలో పెడుతున్నడు రేవంత్ రెడ్డి అని విమ‌ర్శించారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను నిలదీయాలని ఆయ‌న పిలుపునిచ్చారు.  ముక్కోటి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి రేవంత్ రెడ్డి మాట త‌ప్పారు.

రుణమాఫీపై బ్యాంకర్ల మీటింగులో 49 వేల కోట్లు అన్నాడు. బడ్జెట్లో 26 వేల కోట్లు అన్నాడు. చివరకు 17 వేల కోట్లు అని, 12 వేల కోట్లే ఇచ్చారు. మహబూబ్ నగర్ లో 2,750 కోట్లు రుణమాఫీ వేసేసిన అన్నాడు. కానీ ఇంకా వేయలేదు.  పొద్దున పేపర్ చూస్తే, అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వార్త కలిచివేసింది. మెదక్ జిల్లాలో కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  రేవంత్ పాలనలో దాదాపు నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  కాంగ్రెస్ వొచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది.  45 లక్షల టన్నుల సన్న వడ్లు కొంటమని మంత్రి ఉత్తమ్ చెప్పారు. కానీ, కొన్నది మాత్రం 18 లక్షల టన్నులే, వాళ్లలో ఇంకా కొందరు రైతులకు డబ్బులే రాలేదు. ధాన్యం దలారుల పాలైంది, రైతులు మూడు, నాలుగు వందల తక్కువకే ప్రేవేటుకు అమ్ముకున్నారు.  ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రుణమాఫీ, బోనస్, రైతుబంధు రావాలంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయాల‌ని అని మాజీ మంత్రి హ‌రీష్ రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page