డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30 : హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన విశ్వావసు నామ ఉగాది వేడుకల (Ugadi Celebrations) కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. విశ్వావసు నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలతో పాడి పంటలతో విలసిల్లాలని, పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతిభద్రతలతో మంచి పాలన అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మంచి సంకల్పంతో ముందుకు పోతున్నందున రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని అన్నారు.
పరిపాలనతో పాటు ప్రజలందరూ మధురానుభూతులతో తీపి చేదు కారం వగరు ఉప్పు పులుపు లాంటి రుచులతో ఉగాది పచ్చడిని ఎలా సేవిస్తామో అలాంటి షడ్రుచులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలు ఆనందమయంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. రాష్ట్ర ప్రజలందరికీ అన్ని రకాల వసతులు కల్పించాలని, అన్ని వర్గాల ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా యువత, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. వారు అభివృద్ధికి చెందాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెట్టడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్న మిగత రాష్ట్రాలతో పాటు, ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతో అనేక రకాలైన కార్యక్రమాలను తీసుకున్నాం. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం, హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్, కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేయాలని సంకల్పించాం. రాష్ట్రంలో ప్రజల భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయడానికి ముందుకు పోతోంది అని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, అద్భుతమైన ఆనందాలతో, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా విశ్వావసునామ ఉగాది సంవత్సరం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని భట్టి విక్రమార్క వెల్లడించారు.





