- గిరి ఉత్పత్తులకు మ్యూజియం ద్వారా మార్కెటింగ్
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో గిరిజనుల గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మరింత అవకాశం ఏర్పడిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియం బ్రోచర్‌ను మంగళవారం శాసనసభ ఆవరణలో మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ మ్యూజియం గిరిజన సంప్రదాయాలను, వేష భాషలను, జీవన విధానాన్ని, హస్తకళలను, ప్రజా గీతాలను, ఆచార వ్యవహారాలను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మ్యూజియంను ప్రారంభిస్తామని వెల్లడించారు. భద్రాచలం రామాలయం ఒక పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వొచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో భద్రాచలం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇది స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
గిరిజన సంస్కృతి పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, “గిరిజనుల జీవన విధానం, వారి సంప్రదాయాలు క్రమంగా మాయమవుతున్నాయి. మన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించటానికి ఇలాంటి మ్యూజియం ఎంతో అవసరం” అని మంత్రి అన్నారు. గిరిజన కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు, వారి చేతిపనులకు విస్తృత మార్కెట్‌ను అందించేందుకు ఈ మ్యూజియం దోహదపడుతుంది. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇది ఒక కీలకమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు.