శిథిలాల కింద ఆరుగురు దుర్మరణం
శిథిలాలను తొలగించే పనిలో అధికార యంత్రాంగం
భద్రాచలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్తి చెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్ వద్ద నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో లంబాడీ కాలనీకి చెందిన ఒక మేస్త్రీ పడిశాల ఉపేందర్ (40), కామేష్ శిథిలాల కింద మృతి చెందారు. మరో నలుగురు వలస కూలీలు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాలు తొలగిస్తే తప్ప పూర్తి వివరాలు తెలియనున్నాయి. వివరాల్లోకి వెళితే విజయ కనకదుర్గ భవానీ నేషనల్ సేవా ట్రస్ట్ పేరుతో శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి 5 అంతస్తుల భవనాన్నినిర్మిస్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీనిపై గత రెండేళ్లుగా 5 అంతస్తులు నిర్మాణం కొనసాగుతోంది. 9 అంగుళాల పిల్లర్లు నిర్మించడంతో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. ఈ ఘటనతో చుట్టు ప్రక్కల ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఒక్కసారిగా భారీగా శబ్దం రావడంతో స్థానికులు ఇండ్లలోని బయటకు పరుగులు తీసారు. ఈ సంఘటన స్థలాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. శిథిలాలను తక్షణమే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన కారణాలను కలెక్టర్, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. శిథిలాలను తొలగిస్తే తప్ప ఎంతమంది చిక్కుకుపోయారనేది తెలుస్తుంది. ఒక్కసారిగా 5 అంతస్తులు నేలమట్టం కావడంతో శిథిలాలు తొలగించడం ఆలస్యం జరుగుతుంది. చీకటి పడటంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికి కలెక్టర్ ఆదేశాలతో శిథిలాలను వేగంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి ఫోన్ ద్వారా జిల్లా అధికారును అడిగి తెలుసుకున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని త్వరగా బయటకు తీయాలని ఆదేశాలు జారీ చేశారు. నాసికరంగా నిర్మాణం చేపట్టిన భవనం యజమానులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చే సినట్లు సమాచారం.
అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
5 అంతస్తుల బిల్డింగ్ నాసిరకంగా నిర్మాణం చేపడుతున్నారని పలువురు ఐటిడిఏ పిఓ, కలెక్టర్, గ్రామ పంచాయతీ ఈఓకు ఫిర్యాదు చేశారు. నిర్మాణం చేపడుతున్న బిల్డింగ్ తక్షణమే తనిఖీ చేయాలని, అవసరమైతే కూల్చివేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గ్రామ పంచాయతీ ఈఓకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయినప్పటికి గ్రామ పంచాయతీ ఈఓ ఆ భవనాన్ని పరిశీలించి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేపట్టి సుమారు 30 ఏళ్లు అవుతున్నట్లు తెలిసింది. పాత బిల్డింగ్ పై 5 అంతస్తుల నిర్మాణం చేపడుతూ 9 అంగుళాల పిల్లర్లు నిర్మించటం వలన ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు అనుమానిస్తున్నారు
. 5 అంతస్తుల బిల్డింగ్ నిలువుగా నేలమట్టం కావడం వలన భారీ ప్రమాదం తప్పింది. పక్కన ఉన్న బిల్డింగ్‌లకు ఎటువంటి ప్రమాదం జరుగలేదు. 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికి భద్రాచలం పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జి ప్లస్ టూ వరకే నిర్మాణం చేయాల్సి ఉండగా జిప్లస్ 5 అంతస్తుల నిర్మాణం చేపడుతన్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు.