సమన్యాయం పై పార్టీల మూడు స్తంభాలాట

వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేదెప్పుడు…?

2024 సంవత్సరం లోక్‌సభ సాధారణ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకులు రాహుల్‌ ‌గాంధీ సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వెనుకబడిన కులాలకు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమన్యాయం జరగడం లేదనే చర్చను లేవనెత్తారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కూడా రాహుల్‌ ‌గాంధీ కామారెడ్డి డిక్లరేషన్‌ ‌చేసిన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడడం అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం అందించడం నినాదంతోనే కాంగ్రెస్‌ ‌పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకత్వం ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆరు నెలల్లో కులగణన నిర్వహించి బీసీ కులాలకు ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయం చేస్తామని ప్రకటించిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలస్యం జరిగినప్పటికీ కుల గణన కార్యక్రమాన్ని నిర్వహించి, మొత్తం జనాభాలో బిసి కులాల జనాభా 46% ఉందని అంచనా వేసింది. ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో బీసీ ప్రజల జనాభా లెక్కలు తప్పులు జరిగాయని బిసి సామాజిక వర్గాలు, బీసీ సంఘాలలో ఆందోళన మొదలైంది.  బీసీ సంఘాలు బీసీ నాయకులతో పాటు బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం, అదే విధంగా బిజెపి కేంద్ర మంత్రులు, నాయకులు అభ్యంతరాలు లేవనెత్తారు.

రాష్ట్రంలో గ్రామపంచాయతీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వలన ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి రావలసిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఆగిపోయిన విషయాన్ని అందరం గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు కుటుంబ అధిపతి నిరంకుశ అధికారం చలాయించిన బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం బీసీలను అణచివేసిన విషయాలు ఇప్పటికీ ప్రజల స్మృతిలోనే ఉన్నాయి. గత 14 ఏళ్ల  నుంచి దేశంలో జనాభా లెక్కలు చేయలేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన కులాలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని జనాభా లెక్కలలో కులగణన కూడా జత చేయాలని బహుజన వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినా బీసీ కులాలకే చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయములో నోరు మెదపడం లేదు. గత పదేళ్ల  అనుభవాలను బట్టి బీసీ కులాల పట్ల జరుగుతున్న వివక్షత సమన్యాయం ఉద్యమం విషయంలో బిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలది ఒకే ధోరణి అని చెప్పడంలో సందేహం ఉండకూడదు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక హాస్యాస్పదమైన, బహుజన వర్గాలను ఆశ్చర్యపరిచే అంశాన్ని ప్రస్తుత సందర్భంలో గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు 10 సంవత్సరాల పాటు బీసీ ప్రజలకు చేయని ద్రోహం అంటూ లేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ ‌మెంట్‌ ఇవ్వలేదు. వారి పుణ్యమా అని లక్షలాది మంది బీసీ యువత ఉన్నత విద్యకు దూరమయ్యారు. బీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఐదు లక్షల మంది బీసీ యువతకు మొండి చేయి చూపించారు. వృత్తులను కోల్పోయి ప్రత్యామ్నాయం లేక ఆర్థిక స్థోమత లేక యువత ఆందోళన చేసినప్పటికీ ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర క్యాబినెట్‌ ‌శాసనసభ శాసనమండలిలో రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ ‌పదవులలో బీసీల పట్ల తీవ్ర కుల వివక్ష చూపించారు. స్థానిక సంస్థల్లో అప్పటికే అమలు ఉన్న 33% రిజర్వేషన్‌ ‌కేవలం 22 శాతానికి కుదించి వేసి బీసీ రాజకీయ నాయకత్వాన్ని అణచివేశారు.

బీసీ ప్రజల గొంతుకై ప్రశ్నించిన ఈటల రాజేందర్‌ ‌ను రాష్ట్ర క్యాబినెట్‌ ‌నుంచి తొలగించి శాసన సభకు రాజనామా చేయించి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ఓడించాలని చేయని యత్నం లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా అధికారం కోల్పోయి అవకాశవాదంతో ముందుకొచ్చి ఇప్పుడే బీసీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కపట ప్రేమ చూపిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 2014- 15లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బిసి ప్రజల జనాభా 52% ఉందని మాజీ మంత్రి బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు సెలవిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిర్వహించిన సర్వే రిపోర్టు ప్రజలకు ముఖ్యంగా వెనుకబడిన కులాల ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడం జరిగింది. రాష్ట్రంలో సామాజిక న్యాయం విషయయాలు ఈ రాజకీయ నాటకం దొంగే దొంగ- దొంగ అని బజారుకెక్కినట్లు ఉంది.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అగ్ర నాయకత్వం కూడా సర్వే సక్రమంగా జరగలేదని సర్వే చేయించడంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, ఓబిసి జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కోవ లక్ష్మణ్‌ ‌తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో వెనుకబడిన కులాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రజలు గత నాలుగైదు దశాబ్దాల నుంచి కోరుతున్నప్పటికీ కేంద్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. అంతేగాక ఉన్నత కులాల జనాభా ఎంత ఉన్నది కూడా తెలియని పరిస్థితుల్లో ఎవరూ అడగకుండానే వారికి ఏకంగా 10% రిజర్వేషన్‌ ‌కల్పించడం వల్ల బహుజన వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిన విషయాన్ని రాష్ట్ర బిజెపి కేంద్ర మంత్రులు గానీ నేతలు గానీ ప్రస్తావించడం లేదు.

అనేక బీసీ కులాలు వృత్తులను ఆదాయం కోల్పోయి కోట్లాది యువత నిరుద్యోగతతో ఆర్థిక అభద్రతా పరిస్థితుల్లో బతుకుతున్నా ప్రత్యేకంగా ఈ కులాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం లేదు. ప్రతీ సంవత్సరం లక్షల కోట్ల రాయితీలు, సబ్సిడీలు కల్పించి ఆదానీ, అంబానీ లాంటి కుబేరులకు మాత్రం అన్ని సహకారాలు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ కట్టే 52% బీసీ ప్రజలకు మాత్రం ప్రత్యేకమైన కార్యక్రమాలు అమలు చేయరు.

అమలుకు నోచుకోని కామారెడ్డి డిక్లరేషన్‌ ‌హామీలు
కాంగ్రెస్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి జరిగినప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్‌ ‌పత్రంలో ఉన్న అనేక అంశాలు అమలుకు నోచుకోవడం లేదు. కేవలం కుల గణనకు మాత్రమే పరిమితమై పోయింది. కులగణన కూడా సుశిక్షితులైన అధ్యాపకుల ఉద్యోగులకు అప్ప చెప్పకపోవడం వలన కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ పొరపాటున సరిదిద్దుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కామారెడ్డి డిక్లరేషన్‌ ‌హామీలన్నీ అమలు చేయడం ప్రారంభించాలి. 42% రిజర్వేషన్‌ ‌తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి రావలసిన వేల కోట్ల రూపాయలతో గ్రామీణ, పట్టణాల అభివృద్ధిని కొనసాగించవలసిన అవసరముంది. శుష్క ప్రియాలు- శూన్య హస్తాలు చూపించే బిఆర్‌ఎస్‌ ‌లాంటి పార్టీల నిజ స్వరూపాన్ని ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. బీసీ ప్రజలకు ముఖ్యంగా యువతకు జరుగుతున్న వివక్షత అన్యాయాన్ని ఇప్పటికైనా అరికట్టడం కొరకు ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ఏకం కావాలి.

కామారెడ్డి డిక్లరేషన్‌ ‌హామీలన్నీ అమలు పరచాలని అడగాలి. ప్రభుత్వానికి బీసీ ప్రజలకు యువతకు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసి అణచివేసిన స్వార్థపూరిత రాజకీయాలను పూరికొల్పే, కపట ప్రేమ చూపించే నాయకులను, పార్టీలను ఎప్పటికప్పుడు పసిగట్టాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కేంద్రం నిర్వహించే జనాభా లెక్కలలో కుల గణన అంశాన్ని జోడించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించాలి. స్వార్థపూరిత రాజకీయ పార్టీల నాయకుల వివాదాలతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్‌ అమలుతో పాటు కామారెడ్డి బీసీ రిజర్వేషన్‌ ‌హామీలన్నీ అమలు చేయడం ప్రారంభించాలి. అప్పుడే కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకులు రాహుల్‌ ‌గాంధీ ఇచ్చిన మాట నిలబడుతుంది. కామారెడ్డి డిక్లరేషన్‌ అమలుతో మాత్రమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారు.
image.png
– ప్రొఫెసర్‌ ‌కూరపాటి వెంకట్‌ ‌నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page