పదవుల పందేం.. ఉగాది ముహూర్తం..

కాంగ్రెస్‌ ‌మంత్రివర్గ విస్తరణ కసరత్తు..
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చలు
ఇరు పార్టీల నేతల్లో టెన్షన్ టెన్షన్..

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
తెలంగాణలో ఉగాది ధమాకాను ప్రజలు చూడబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకాలు జరుగబోతున్నాయి. ఈ రెండింటికీ ఆయా పార్టీల అధిష్ఠానాలు ఉగాది ముహూర్తాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు పదిహేను నెలలు కావస్తుండగా, మంత్రివర్గాన్ని విస్తరించే విషయంలో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వొచ్చింది. ప్రస్తుతం క్యాబినెట్‌లో 11 మంది మంత్రులుండగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. అయితే మంత్రి పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య మాత్రం అంతకు ఎక్కువగానే ఉంది. దీనిపై రాష్ట్ర నాయకత్వం మొదలు పార్టీ హైకమాండ్‌ ‌వరకు గత ఏడాదికాలంగా కసరత్తు చేస్తూనే ఉంది. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేయడంతో పాటు, అన్ని, జిల్లాలకు ప్రాతినిధ్యం లభించే విధంగా, అలాగే గతంలో కొందరు సీనియర్‌ ‌నాయకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో అనేక విడుతలుగా కేంద్ర, రాష్ట్ర నాయకుల మధ్య చర్చలు జరుగుతూ వొచ్చాయి.

అయితే ఈ వడపోత కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి తాజా దిల్లీ పర్యటనతో పూర్తి అయిందనుకుంటున్నారు. రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి . పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ అధిష్ఠానం పిలుపుతో హుటాహుటిన దిల్లీ చేరుకుని, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం కాబోయే మంత్రుల జాబితాను ఫైనల్‌ ‌చేసినట్లు భావిస్తున్నారు. ఉగాదిలోపే వీరి పేర్లను ప్రకటించే అవకాశముందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న వారు నిరాశ పడకుండా వారికి ఇతర పదవులను అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర నాయకుల భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. వారికి కీలక కార్పొరేషన్‌ ‌చేర్మన్‌ ‌పదవులను ఇవ్వాలన్నది అధిష్ఠాన నిర్ణయం. అలాగే పిసిసి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఖాలీగా ఉన్న ఆరు మంత్రి పదవులన్నిటినీ భర్తీ చేస్తారా లేక ఒకటి రెండింటిని పక్కకు పెడతారా అన్న విషయంలో కూడా తర్జనబర్జన జరుగుతున్నది. అధినాయకత్వం తో జరిపిన చర్చల్లో ఇద్దరు బిసీలు, ఒక రెడ్డి, ఒక ఎస్సీకి ఇవ్వాలన్న నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తున్నది.

బీసీ కోటాలో మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ‌పేర్లతోపాటు విజయశాంతి పేర్లు వినవస్తున్నాయి. కాగా అధిష్ఠానం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి ఎస్సీ కోటాలో తనకు మంత్రిపదవి తప్పక వొస్తుందని చెన్నూరు ఎంఎల్యే వివేక్‌ ‌వెంకటస్వామి ఆశిస్తున్నారు. మునుగోడు ఎంఎల్‌ఏ ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ ఇలాంటి హామీయే ఉండడంతో ఆయనకే మంత్రిగా అవకాశం లభిస్తుందనుకుంటున్నారు. అయితే బోధన్‌ ఎంఎల్‌ఏ ‌సుదర్శన్‌రెడ్డి వైపు సిఎం మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఒక మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్న క్రమంలో, కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఇస్తారన్నచర్చ జరుగుతున్నది. ఈ మార్పులో భాగంగా ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్నవారి పనితీరుపై అసంతృప్తి కారణంగా ఒకరిద్దరికి ఉద్వాసన చెప్పే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే కొత్తగా మరో ఒకరిద్దరికి మంత్రి పదవులు లభించే అవకాశంలేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page