‘జమిలి’ ఆలోచన వెనుక ఆంతర్యం?

కేంద్ర కేబినెట్‌ ‘జమిలి’  ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ జమిలి ఎన్నికలకు దేశంలో 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకు పోయి జాతీయ అంశాలదే పైచేయి అవుతుందని ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై భిన్నాభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ పక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎవరెంత మొత్తుకున్నా ప్రధాని మోదీ పట్టించుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయం ప్రస్తుతానికి పక్కనపెట్టి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకొచ్చిన బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి 50 శాతం రాష్ట్రాల ఆమోదం తెలపవలసిన అవసరం లేదని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతోపాటు 50 శాతం రాష్ట్రాలు  ఆమోదించవలసి వస్తుంది.

జమిలి ఎన్నికల ఆలోచన వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే 2015నాటి ఓ సర్వే ప్రకారం ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77 శాతం ఓటర్లు రెండిరటా ఒకే పార్టీకి ఓటు వేస్తారని తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బిజెపి నేతలు జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువస్తున్నారని ఒక అంచనా. దేశమంతటా డబుల్‌ ఇంజన్‌ సర్కారుకై తహతహలాడుతున్న బిజెపి ఓటర్ల తాలూకు ఈ ఏకకాలపు ఎన్నికల మనస్తత్వం కలిసొస్తుందని బిజెపి ఆశపడుతోంది. నిజానికి ఏకకాలంలో ఎన్నికలు అనేవి మన దేశానికి కొత్తేవిరీ కావు. 1951-52లో మొదటి జనరల్‌ ఎలక్షన్ల నుంచి లోక్‌సభ , రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండేవి.  అయితే  కాలవ్యవధి పూర్తికాకుండానే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవడం ఎప్పుడ్కెతే మొదల్కెందో, అప్పుడు 1967 తర్వాత నుంచి ఎన్నికల కథ మారిపోయింది. 2020 నవంబర్‌ 26న జరిగిన అఖిల భారత సభాధ్యక్షుల సమావేశంలోనూ ప్రధాని మోదీ  జమిలి ఎన్నికల అమలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.  లోక్‌సభకు, విధాన సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రభుత్వానికి ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుందని, ఎన్నికల ఆంక్షలు పదేపదే  అడ్డుతగలకుండా అభివృద్ధి పథకాలను సజావుగా అమలు చేయడానికి వీలవుతుందని అభిప్రాయం వెలిబుచ్చారు. ఎన్నికల నియమావళి అమలుతో ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయన్నది వాస్తవమే అయినా ఈ సమస్యను పరిష్కరించడానికి జమిలి ఎన్నికలే శరణ్యం అనుకోవడం సమంజసం కాదని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల బట్టి శాసనసభల్లో అధికార పక్షాలు అధికారంలో ఉండే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి.

శాసనసభ్యుల ఫిరాయింపుల వల్ల అవి మెజారిటీ కోల్పోయి, కూలిపోయే అవకాశాలే ఎక్కువగా తటస్థపడుతున్నాయి. ఏ ఒక్కపార్టీ తగిన మెజారిటీతో ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం లేనప్పుడు కొద్ది కాలం రాష్ట్రపతి పాలన విధించినా, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అవు తుంది. అంతేకాదు ఒక్కో రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఒక్కోసారి ముగింపుకి చేరుకుంటుంది. అలాంటప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగేవరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి  కొనసాగించడం ప్రజాస్వామిక ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతు న్నారు. అయితే ఈమేరకు రాజ్యాంగ సవరణలు చేయడానికి మోదీ  ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాజ్యాంగం 83వ ఆర్టికల్‌ రాజ్యసభ పూర్తిగా రద్దు కావడమనేది లేకుండా చూస్తుంది. రాజ్యాంగ 85వ అధికరణ పార్లమెంటను సమావేశ పర్చడం, సమావేశాలను ముగించడానికి సంబంధించినది.

ఏడాదిలో కనీసం రెండు సార్లయినా పార్లమెంట్‌ను సమావేశపర్చాలని ఈ అధికరణ చెబుతోంది. అంటే ప్రతి రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరు మాసాలకు మించరాదు. ఆర్టికల్‌ 172 ఎమర్జెన్సీ  పొడిగింపునకు సంబంధించింది. ఆర్టికల్‌ 175 రాష్ట్ర శాసన సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించడం, వాటికి సందేశాలను పంపించడాన్ని నిర్దేశిస్తురది. 356 అధికరణ రాష్ట్రాల్లో కల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని నివారించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి వీలు కల్పిస్తుంది. అప్పుడు ఈ అన్ని అధికరణాలను తగు రీతిలో సవరిస్తే కానీ జమిలి ఎన్నికలు అమలు చేయడం సాధ్యం కాదు. ప్రపంచంలో జమిలి ఎన్నికల సంప్రదాయం బెల్జియం, స్వీడన్‌, దక్షిణాఫ్రికాలో ఉంది.  ఏదేమైనా ఈ జమిలి ఎన్నికల నిర్వహణ ఎన్నో చిక్కులు, సవాళ్లతో ముడిపడి ఉందన్నది వాస్తవం.

 బొయిదాపు శివ కుమార్‌
(సీనియర్‌ జర్నలిస్ట్‌ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page