గత శనివారం చెన్నైలో ఒక అపూర్వ సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ పూనిక మీద జరిగిన ఈ సమావేశంలో ఆయనతో పాటు కేరళ, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి, పద్నాలుగు రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. దేశ రాజకీ యాలలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్ట దలచిన కీలకమైన మార్పులను ఖండిరచడానికి ఏర్పాటయిన ఈ సమావేశం ఇవాళ్టి పరిస్థితులలో అత్యవసరమైన ఐక్యతను ప్రదర్శించింది. కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ప్రకటించింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి అధికార పక్షం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామారావు పాల్గొనడం, ఇద్దరూ దాదాపు ఒకే స్వరంతో మాట్లాడడం తెలంగాణ ప్రజల వైపు నుంచి ఆహ్వానించదగిన పరిణామం.
అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడూ, ప్రతి క్షణమూ ఘర్షణే, కీచులాటే ఉండనవసరం లేదని, ప్రజా ప్రయోజనాల గురించి, ప్రాంతీయ స్వతంత్ర ప్రతిపత్తి గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, అప్పుడప్పుడూ అయినా ఇరు పక్షాల మధ్య ఐక్యత సాధ్యమేనని అరుదైన ఎరుకను ఈ సమావేశం, అందులో అధికార ప్రతిపక్షాలు పాల్గొనడం ప్రకటించాయి. ఇద్దరూ కలిసి ఒక సమావేశంలో పాల్గొనడం, ఇద్దరూ ఒకే రకమైన ఆకాంక్షలు ప్రకటించడం అంటే అర్థం వారి మధ్య ఉన్న ఘర్షణలన్నీ వదులుకున్నట్టు ఏమీ కాదు. కానవసరం లేదు. ఇద్దరి మధ్య నిన్నటి వరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నప్పటికీ, అత్యవసరమైన సందర్భం వస్తే ఇద్దరూ ఒకే గళం వినిపించగలరని చూపడం, నిజానికి ఒక రాజకీయ పరిణతి. తొంబై తొమ్మిది విభేదించే అంశాలు ఉన్న దగ్గర కూడా ఒకటి ఏకీభవించే అంశం ఉండవచ్చు. దాని మీద ఐక్యతకు అభ్యంతరం ఉండనక్కర లేదు.
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలూ ఇటువంటి పరిణతిని ఎంతో కొంత ప్రదర్శించి, తమ తమ విభేదాలు పక్కన పెట్టి, ఉద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి. ఘర్షణ పడుతూనే ఐక్యతను ప్రదర్శించాయి. ఏకంగా ఉంటూనే తమ ప్రత్యేకతలను చూపుకున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం ఆ ఐక్యత దాదాపుగా కరువైపోయి, ప్రతి అంశమూ వివాదానికీ, కీచులాటకూ, ఘర్షణకూ దారి తీసింది. తగాదాదే ప్రధాన పాత్ర అయింది.
దేశపు సమాఖ్య స్వభావాన్నీ, బహుళత్వాన్నీ కాలరాచి, నిర్బంధపు ఒకే దేశం ఒకే మతం ఒకే నాయకుడు ఒకే పన్ను ఒకే భాష అనే నిరంకుశ కేంద్రీకరణ వైపు దేశాన్ని తీసుకుపోతున్న సంఫ్‌ు పరివార్ పట్ల తెలంగాణ ప్రకటించిన ఈ ధిక్కారానికి అభినందనలు. ఈ ధిక్కారం, ఈ ఐక్యత బలోపేతం కావాలి. తెలంగాణకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని నిలువరించడంలో కూడా ఈ స్ఫూర్తి కొనసాగాలి.
ఇప్పుడు ఇలా ఏర్పడిన ఐక్యత కూడా ఎక్కువ కాలం ఉంటుందని భ్రమ పడవలసిన అవసరమేమీ లేదు. అసలు ఆ సమావేశంలో ఐక్యంగా పాల్గొంటున్నప్పుడు కూడా ఇద్దరు నాయకుల అనుచరులు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల వీరులు ఒకరిని ఒకరు హేళన చేసుకునే క్రీడలో మునిగి ఉన్నారు. అయినా సరే, ఇద్దరు నాయకులనూ, రెండు రాజకీయ పక్షాలనూ ఎన్నో ఇతర వ్యవహారాలలో ఖండిస్తూనే, విమర్శిస్తూనే, తప్పు పడుతూనే, ఈ ప్రత్యేక సమావేశపు ఐక్యతను మాత్రం అభినందించవలసి ఉంది.
ఎందుకంటే, తెలంగాణకు మాత్రమే కాదు, మొత్తం దక్షిణాదికీ, దేశపు సమాఖ్య స్వభావానికీ, భవిష్యత్తు రాజకీయాలకూ తీవ్రంగా ప్రమాదకరమైన విధానాలనూ, చర్యలనూ చేపట్టి, దేశ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేయనున్న పరిణామాలకు భారతీయ జనతా పార్టీ, సంఫ్‌ు పరివార్ నాంది పలుకుతున్నాయి. వాటిలో ఇప్పటికిప్పుడు చర్చించవలసిన మూడు అంశాలు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన, అన్ని రాష్ట్రాల మీద, ప్రత్యేకించి దక్షిణ రాష్ట్రాల మీద హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాలలో సమాఖ్య స్వభావాన్ని రద్దు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు. కనీసం వీటిలో మొదటి అంశం మీద చెన్నైలో చర్చ ప్రారంభమయింది.
ప్రస్తుత భాజపా ప్రయత్నాలు ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కో, ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితికో, లేదా మరొక పార్టీకో మాత్రమే వ్యతిరేకమైనవి కావు, అవి మొత్తంగా తెలంగాణ ప్రజానీకానికి, దక్షిణ రాష్ట్రాల ప్రజానీకానికి, దేశ రాజ్యాంగ విలువలకు, సమాఖ్య స్వభావానికి వ్యతిరేకమైనవి. అందువల్ల, ఎవరైనా సరే తమ రాజకీయ పార్టీ నిబద్ధతను పక్కన పెట్టి తీవ్రంగా వ్యతిరేకించవలసినవి. అలా వ్యతిరేకించడంలో ఎంతో కొంత ఆయా పార్టీల సొంత లాభం కూడా కొంత ఉండవచ్చు. కాని అంతకు మించిన ప్రజా ప్రయోజనం ఉంది.
అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడూ, ప్రతి క్షణమూ ఘర్షణే, కీచులాటే ఉండనవసరం లేదని, ప్రజా ప్రయోజనాల గురించి, ప్రాంతీయ స్వతంత్ర ప్రతిపత్తి గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, అప్పుడప్పుడూ అయినా ఇరు పక్షాల మధ్య ఐక్యత సాధ్యమేనని అరుదైన ఎరుకను ఈ సమావేశం, అందులో అధికార ప్రతిపక్షాలు పాల్గొనడం ప్రకటించాయి. ఇద్దరూ కలిసి ఒక సమావేశంలో పాల్గొనడం, ఇద్దరూ ఒకే రకమైన ఆకాంక్షలు ప్రకటించడం అంటే అర్థం వారి మధ్య ఉన్న ఘర్షణలన్నీ వదులుకున్నట్టు ఏమీ కాదు. కానవసరం లేదు. ఇద్దరి మధ్య నిన్నటి వరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నప్పటికీ, అత్యవసరమైన సందర్భం వస్తే ఇద్దరూ ఒకే గళం వినిపించగలరని చూపడం, నిజానికి ఒక రాజకీయ పరిణతి. తొంబై తొమ్మిది విభేదించే అంశాలు ఉన్న దగ్గర కూడా ఒకటి ఏకీభవించే అంశం ఉండవచ్చు. దాని మీద ఐక్యతకు అభ్యంతరం ఉండనక్కర లేదు.
మొట్టమొదట పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన తెలంగాణ ప్రజలు పట్టించుకోవలసిన సమస్య ఎట్లా అవుతుందో అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరపాలని, దశాబ్దానికి ఒకసారి జరిగే జనగణన గణాంకాల ప్రకారం జనాభాను బట్టి నియోజకవర్గాన్ని పునర్విభజించి, సరిహద్దులు మార్చాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఆ ప్రక్రియ కోసం పార్లమెంటు చట్టం ద్వారా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. అలా మొదటి సారి 1952లో ఏర్పడిన డీలిమిటేషన్ కమిషన్ 1951 జనగణన ఆధారంగా లోక సభ స్థానాలు 494గా నిర్ణయించింది. 1963లో ఏర్పడిన రెండో డీలిమిటేషన్ కమిషన్ 1961 జనగణనను బట్టి ఆ సంఖ్యను 522కు పెంచింది. 1973లో ఏర్పడిన మూడో డీలిమిటేషన్ కమిషన్ ఆ సంఖ్యను 543కు పెంచింది. ఈలోగా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టింది గనుక, ఎమర్జెన్సీలో ప్రవేశ పెట్టిన 42వ రాజ్యాంగ సవరణ 2001 జనగణన వరకు జనాభా ఆధారిత పునర్విభజన చేయగూడదని నిర్దేశించింది. లేకపోతే యథావిధిగా పునర్విభజన చేస్తూ పోతే, జనాభా నియంత్రణ అమలు చేయని రాష్ట్రాలకు బహుమతిలా ఎక్కువ స్థానాలు, జనాభా నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలకు శిక్షలా తక్కువ స్థానాలు అనే పరిస్థితి వస్తుందని, అలా కేంద్ర ప్రభుత్వ కుటుంబ, జనాభా నియంత్రణ విధానానికి గండి కొట్టినట్టు అవుతుందని అప్పుడు వాదించారు.
సాధారణంగా ఒక పార్లమెంటు నియోజకవర్గ జనాభా అటూ ఇటూగా పది లక్షలు ఉండాలని అంటారు. అందువల్ల 1971 జనగణన ప్రకారం 54.8 కోట్లుగా ఉన్న జనాభాకు 543 స్థానాలు ప్రాతినిధ్యం వహిస్తాయని భావించారు. 2001 జనగణన వరకూ దీన్ని వాయిదా వేస్తే హఠాత్తుగా ఎన్ని కొత్త స్థానాలు కల్పించవలసి వస్తుందో తెలియదు. నిజంగానే 2001 జనగణన నాటికి దక్షిణాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ విధానాలు మెరుగ్గా అమలు జరిగి, జనాభా వృద్ధి గణనీయంగా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఆ విధానాలు సరిగ్గా అమలు జరగలేదు గనుక అక్కడ జనాభా వృద్ధి గణనీయంగా ఎక్కువగా ఉంది. అంటే 2001 జనగణనలో 100 కోట్లుగా తేలిన జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే హఠాత్తుగా దక్షిణాది రాష్ట్రాల సాపేక్షిక ప్రాతినిధ్యం చాలా తగ్గిపోతుంది.
అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపాయి దగ్గర దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు ఈ భయ సందేహాలను వ్యక్తం చేయగా, వాజపాయి ప్రభుత్వం 2002 లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా, నియోజకవర్గ పునర్విభజనను మరొక 25 సంవత్సరాల పాటు వాయిదా వేసింది. అలా 2026 నాటికి పునర్విభజన మీద విధించిన ఆటంకాలు తొలగిపోతాయి. 2026 తర్వాత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
కాని కోవిడ్ వల్ల 2021 జనగణన జరగలేదు. కనుక 2011 జనగణనను ఆధారం చేసుకోవాలా, లేక ఐదు సంవత్సరాలు వేచి చూసి 2031 జనగణను ఆధారం చేసుకోవాలా ఇంకా సందేహాలున్నాయి. కొన్ని పరిశోధక సంస్థలు 2011 జనగణన ఆధారంగా మొత్తం లోకసభ స్థానాల సంఖ్య 846 కావచ్చునని, అందులో ఉత్తరప్రదేశ్ – బీహార్ రెండు రాష్ట్రాలే 222 స్థానాలు ఆక్రమిస్తాయనీ, దక్షిణాది ఐదు రాష్ట్రాలకు కలిసి 165 స్థానాలు మాత్రమే ఉంటాయని, మిగిలిన రాష్ట్రాలకు 461 స్థానాలు ఉంటాయని అంచనా వేశాయి. ఈ లెక్కన పార్టీల ప్రాధాన్యతలు ఎలా ఉన్నప్పటికీ, లోకసభలో దక్షిణాది మాట ఎటువంటి పరిస్థితిలోనూ చెల్లుబాటు కాదు. దక్షిణాది రాష్ట్రాలకు పథకాల పంపిణీ, నిధుల కేటాయింపు, దక్షిణాది భాషలు, దక్షిణాది ప్రజల అస్తిత్వం తీవ్రమైన ప్రమాదంలో పడతాయి.
ప్రస్తుత భాజపా ప్రయత్నాలు ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కో, ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితికో, లేదా మరొక పార్టీకో మాత్రమే వ్యతిరేకమైనవి కావు, అవి మొత్తంగా తెలంగాణ ప్రజానీకానికి, దక్షిణ రాష్ట్రాల ప్రజానీకానికి, దేశ రాజ్యాంగ విలువలకు, సమాఖ్య స్వభావానికి వ్యతిరేకమైనవి. అందువల్ల, ఎవరైనా సరే తమ రాజకీయ పార్టీ నిబద్ధతను పక్కన పెట్టి తీవ్రంగా వ్యతిరేకించవలసినవి. అలా వ్యతిరేకించడంలో ఎంతో కొంత ఆయా పార్టీల సొంత లాభం కూడా కొంత ఉండవచ్చు. కాని అంతకు మించిన ప్రజా ప్రయోజనం ఉంది.
ఈలోగా కొత్త పార్లమెంటు భవనం నిర్మించిన భారతీయ జనతా పార్టీ అందులో 888 స్థానాలు ఏర్పాటు చేసి మరొక వివాదానికి కారణమయింది. నిజానికి జనాభా ఇప్పటికే 140 కోట్లు దాటి ఉండగా, వోటర్ల సంఖ్యే 2024 ఎన్నికల నాటికి వందకోట్లు చేరగా, లోకసభ స్థానాల సంఖ్యను అధికార పార్టీ 888 గా స్థిరపరిచిందంటే, పైన చెప్పిన పరిశోధక సంస్థల అంచనాలు నిజమేననే భయాలు వ్యాపించాయి. అంటే ఉత్తరప్రదేశ్ – బీహార్ రెండు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు ఏకమైతే, దక్షిణాది ఐదు రాష్ట్రాల సభ్యులు ఎప్పుడైనా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ భయాలకు ఆజ్యం పోస్తున్నట్టుగా హోం మంత్రి అమిత్ షా తమిళనాడులో మాట్లాడుతూ ‘‘మీ స్థానాలు తగ్గవు’’ అన్నాడు. జనాభా పెరుగుతున్నది గనుక తగ్గే అవకాశం ఎలాగూ ఉండదు. మరి అమిత్ షా మాటలకు ‘‘మీ స్థానాలు పెరగవు’’ అని అర్థం చెప్పుకోవాలా, ‘‘ఇతర రాష్ట్రాల స్థానాలు పెరుగుతాయి’’ అని అర్థం చెప్పుకోవాలా?
అది తమిళనాడు సమస్య మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నిటి సమస్య. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులను ఒక్క వేదిక మీదికి తెచ్చి, ఈ సమస్యను ఉమ్మడిగా ఎదుర్కోవాలని స్టాలిన్ ఆలోచించారు. పునర్విభజన ప్రక్రియను మరొక 25 సంవత్సరాలు వాయిదా వేయాలని, డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టదలచుకుంటే అన్ని రాజకీయ పక్షాల భాగస్వామ్యంతో, సంప్రదింపులతో, అభిప్రాయ సేకరణతో, చర్చతో మాత్రమే జరగాలని సమావేశంలో పాల్గొన్నావారందరూ ముక్తకంఠంతో చెప్పారు.
అక్కడ ‘‘జనాభా దామాషాతో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తమ గళం కోల్పోతాయి. ఉత్తరాదిని గౌరవిస్తాము గాని రాజకీయాల్లో, విద్యలో పెత్తనాన్ని సహించబోము’’ అని రేవంత్ రెడ్డి అనవలసిన మాట అన్నాడు. చెన్నై సమావేశ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి హైదరాబాద్ లో తదుపరి సమావేశం జరుపుతామని కూడా అన్నాడు. ‘‘జనాభా దామాషాతో నియోజకవర్గాల పునర్విభజన జరిపితే నియంతృత్వం వైపు అడుగులు పడినట్టే’’ అని కేటీఆర్ అన్నాడు. దానికి ఆర్థిక కోణం కూడా జోడిస్తూ, దేశాన్ని నడిపిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు భాజాపా నాయకత్వం అన్యాయం చేస్తున్నది అని కూడా అన్నాడు.