‘ప్రజాపాలన’, ‘విమోచన’ – రెండు పెద్ద అబద్ధాలు

పాత ‘విమోచన దినం’, ‘విలీన దినం’, ‘విద్రోహ దినం’, గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన ‘జాతీయ సమైక్యతా దినం’తో పాటు ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజును ‘ప్రజాపాలనా దినం’గా ప్రకటించింది. అంటే ఒకే ఒక్క రోజుకు ఐదు పేర్లు సిద్ధమయ్యాయన్న మాట. నిజానికి ఈ అయిదు పేర్లలో ఒక్కటి మాత్రమే అరకొరగా సరిపోతుందనీ, మిగిలిన పేర్లు పచ్చి అబద్ధాలనీ, తమ స్వప్రయోజనాల కోసం ఆయా రాజకీయ పక్షాలు తయారు చేసినవనీ కనీసమాత్రంగా చరిత్ర చదివినా అర్థమవుతుంది.

తమ విద్వేష రాజకీయాలతో “విమోచన” అనే అబద్ధాన్ని ఉనికిలోకి తెచ్చిన సంఘ్ పరివార్, ‘విమోచన అనకపోతే రజాకార్లను సమర్థించినట్టే’ అని ప్రతి ఒక్కరినీ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించి కొందరిని లొంగదీసుకుంది. చివరికి 1948 సెప్టెంబర్ 17 తర్వాత భారత సైన్యాలకూ, సైన్యం రక్షిస్తున్న భూస్వాములకూ వ్యతిరేకంగా మూడు సంవత్సరాల పాటు పోరాడిన, మూడు వేల మంది కార్యకర్తలను పోగొట్టుకున్న సిపిఐ, సిపిఎం లు కూడా ఆ మాట మీద నిర్ద్వంద్వమైన వైఖరి తీసుకోలేని స్థితి వచ్చింది.

 

-ఎన్‌ వేణుగోపాల్‌
-ఎన్‌ వేణుగోపాల్‌

గత మూడు దశాబ్దాలుగా తెలంగాణ సమాజానికి ఒక తద్దినం అలవాటయింది. ప్రతి సెప్టెంబర్ 17 కు ముందు అటూ ఇటూ, 1948లో ఆ రోజున జరిగిన పరిణామాలను ఎట్లా గుర్తించాలి అని తీవ్రమైన వాద వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. ఒకరకంగా చూస్తే అవి అనవసరమైన వివాదాలు. నిజానికి అవి డెబ్బై ఆరేళ్ల కింద జరిగిపోయిన పరిణామాలు. సమకాలీన చరిత్ర స్పష్టంగా నమోదు చేసిన పరిణామాలు. తదనంతర పరిశోధనలో ఎన్నో లోతైన విషయాలు బైట పడిన చారిత్రక పరిణామాలు. వాటిని మనం ఇవాళ్టి మన అవసరాల కోసం, మన రాజకీయ వ్యూహాల కోసం ఎట్లా పిలిచినా, పిలవదలచుకున్నా ఆ పరిణామాలలో మార్పేమీ ఉండదు. మన ఇష్టం వచ్చి పేరు పెట్టడం మన సంతృప్తికి తప్ప మరెందుకూ పనికి రాదు.

1998లో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో అప్పటి కేంద్ర హోమ్ మంత్రి ఎల్ కె అద్వానీ తెలంగాణ విమోచన స్వర్ణోత్సవ సభ అంటూ ఒక పచ్చి అబద్ధాన్ని ప్రారంభించినప్పటి నుంచీ ఆ పరిణామాల మీద వాస్తవంగా సమకాలీన చారిత్రక ఆధారాలు ఏమి చెప్పాయో, భిన్న దృక్పథాలు ఆ పరిణామాలను ఎట్లా చూశాయో డజనుకు పైగా వ్యాసాలు రాశాను, అంతకన్నా ఎక్కువ మాట్లాడాను. ఈ సంవత్సరం కూడా ‘అయిననూ మాట్లాడవలె’ అనిపిస్తున్నది.

పాత ‘విమోచన దినం’, ‘విలీన దినం’, ‘విద్రోహ దినం’, గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన ‘జాతీయ సమైక్యతా దినం’తో పాటు ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజును ‘ప్రజాపాలనా దినం’గా ప్రకటించింది. అంటే ఒకే ఒక్క రోజుకు ఐదు పేర్లు సిద్ధమయ్యాయన్న మాట. నిజానికి ఈ అయిదు పేర్లలో ఒక్కటి మాత్రమే అరకొరగా సరిపోతుందనీ, మిగిలిన పేర్లు పచ్చి అబద్ధాలనీ, తమ స్వప్రయోజనాల కోసం ఆయా రాజకీయ పక్షాలు తయారు చేసినవనీ కనీసమాత్రంగా చరిత్ర చదివినా అర్థమవుతుంది.

ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనా దినం అనీ, కేంద్ర ప్రభుత్వం విమోచన దినం అనీ ఉత్సవాలు జరుపుతున్నాయి గనుక, మొదట ఆ రెంటినీ చూద్దాం.
ప్రజాపాలనా దినం అనాలంటే ఆ రోజు ప్రజలే పాలకులుగా మారి ఉండాలి. ప్రజలు పాలకులుగా మారడమంటే మనకు ఇప్పుడు తెలిసి ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు వోట్ల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకుని వారి ద్వారా పాలన జరుపుకోవడం. కాని 1948 సెప్టెంబర్ 17న ఆ పని జరగలేదు. భారత సైన్యం అప్పటికి ఐదు రోజులుగా హైదరాబాద్ రాజ్యం మీద నలుదిక్కుల నుంచీ యుద్ధం చేసింది. సెప్టెంబర్ 16 సాయంత్రానికి హైదరాబాద్ సైన్యాలు తమ ప్రతిఘటన ముగించాయి. భారత సైన్యాలు హైదరాబాద్ శివార్లకు చేరాయి. సెప్టెంబర్ 17 ఉదయం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ లో భారత ప్రభుత్వ ప్రతినిధి, ఏజెంట్ జనరల్ కె ఎం మున్షీని కలిసి తాను లొంగిపోతున్నానని ప్రకటించాడు. అసఫ్ జాహీ వంశ పాలన అంతమై పోయిందనీ, తాను ఒక తాత్కాలిక మంత్రివర్గాన్ని ప్రకటిస్తున్నాననీ, ప్రజలు శాంతి సామరస్యాలతో మెలగాలనీ ఆ సాయంత్రం ఏడు గంటలకు దక్కన్ రేడియోలో ప్రసంగించాడు.

అంతవరకూ మాత్రమే చూస్తే రాజరిక పాలన తొలగిపోయినట్టే కనబడుతుంది. కాని ప్రజాపాలన ప్రారంభం కాలేదు. ఆ మర్నాడు సెప్టెంబర్ 19న, హైదరాబాద్ మీద సైనిక చర్యకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ జయంతనాథ్ చౌధురి పాలన ప్రారంభమయింది. ఆయనను సైనిక గవర్నర్ అని పిలిచారు. ఆ సైనిక పాలన పదమూడు నెలల పాటు, 1949 నవంబర్ 23 వరకు సాగింది. ఆ తర్వాత కూడా ప్రజాపాలన రాలేదు. కేంద్ర ప్రభుత్వం 1949 నవంబర్ 24న కేంద్ర ప్రభుత్వ సంస్థాన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఐసిఎస్ అధికారి ఎం కె వెల్లోడికి విచిత్రంగా “ముఖ్యమంత్రి” అని పేరు పెట్టి హైదరాబాద్ కు పంపింది. దానికి హాస్యాస్పదంగా “పౌర పాలన” అని నామకరణం చేసింది. ఆ పాలన మరొక ముప్పై నెలలు గడిచాక 1952 ఫిబ్రవరిలో హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటిసారి సార్వత్రిక వయోజన వోటింగ్ హక్కుతో ఎన్నికలు జరిగి, ప్రజా ప్రతినిధులు ఎన్నికై, 1952 మార్చ్ 6న బూర్గుల రామకృష్ణా రావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. అక్కడితో కూడా అయిపోలేదు, 1947 సెప్టెంబర్ 19న ఏర్పడిన సైనిక పాలన అయినా, 1949 నవంబర్ 24న ఏర్పడిన పౌరపాలన అయినా, రెండూ కూడా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వాధినేతగానే సాగాయి. చివరికి ఎన్నికైన బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజప్రముఖ్ (ప్రస్తుత గవర్నర్ తో సమానం) గా, ఆయన పాలనగానే సాగింది. ఉస్మాన్ అలీ ఖాన్ 1956 అక్టోబర్ 31 దాకా రాజప్రముఖ్ గా కొనసాగాడు.

మరి ఏ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినం అవుతుంది?

ఇక కేంద్ర ప్రభుత్వం, సంఘ్ పరివార్ అంటున్న విమోచన దినం సంగతి చూద్దాం. అసఫ్ జాహీ రాచరిక భూస్వామ్య పాలన నుంచి ప్రజలు నిజంగానే విముక్తిని కోరుకుని, భూమి, భుక్తి, విముక్తి పోరాటం చేశారు. కాని సెప్టెంబర్ 17న ఆ విముక్తి జరగలేదు. రాజు పాలన మరొక ఎనిమిదేళ్లు జరిగింది. తెలంగాణ రైతాంగం సాగించిన సాయుధ పోరాట క్రమంలో ప్రజా రాజ్యాధికార కమిటీలు ఏర్పరచి తమ పాలన తాము సాగించుకుంటున్న మూడు వేల గ్రామాల మీదికి విరుచుకు పడిన భారత సైన్యం మూడు వేల మంది కమ్యూనిస్టులను, రైతాంగ కార్యకర్తలను, సానుభూతిపరులను కాల్చి చంపింది. ప్రజలు సాధించుకున్న విముక్తిని ధ్వంసం చేసింది. పదిలక్షల ఎకరాల భూమిని ప్రజలు భూస్వామ్యం చెర నుంచి విడిపించి పంచుకోగా, పట్నాలకు పారిపోయిన దొరలను భారత సైన్యం మళ్లీ వెనుకకు గ్రామాలకు తీసుకువచ్చి, ఆ భూమిని తిరిగి ఇప్పించాయి. ప్రధానంగా కన్నడ, మరాఠీ జిల్లాలలో భారత సైన్యాలు ముస్లింలను ఊచకోత కోసి, ముప్పై వేల నుంచి రెండు లక్షల మందిని చంపివేశాయని, అప్పుడే ఆ ప్రాంతాలలో పరిశీలించిన పండిట్ సుందర్ లాల్ కమిటీ నివేదిక ఇవ్వగా, భారత ప్రభుత్వం ఆ నివేదిక బైటికి కూడా రాకుండా తొక్కిపట్టింది. అంటే ప్రజల వైపు నుంచి చూసినా, దొరల వైపు నుంచి చూసినా, రాజు వైపు నుంచి చూసినా, పాలన వైపు నుంచి చూసినా, ఊచకోతల వైపు నుంచి చూసినా విమోచన అన్నది ఇసుమంతైనా లేని పరిణామం సెప్టెంబర్ 17, 1948.

మరి ఈ “విమోచన” అన్న మాట ఎట్లా వాడుకలోకి వచ్చింది?

ప్రజలను హిందూ ముస్లింలుగా విభజించి, ముస్లింల మీద విష విద్వేషాలు చిమ్మదలచుకున్న సంఘ్ పరివార్ హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా చూపుతూ, ముస్లిమ్ పాలన తొలగిపోవడమే విమోచన అని అర్థం చెప్పదలచుకుంది. అది ప్రచారం చెయ్యదలచుకున్న మత విద్వేష రాజకీయాలలో హైదరాబాద్ చరిత్ర ఒక పావుగా మారిపోయింది. కాని హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా చూడడమే ఒక అబద్ధం. రాజు వ్యక్తిగత మత విశ్వాసాలు ఇస్లాం కావచ్చు గాని, ఆయన కింద హిందూ భూస్వాముల మీద, పైన క్రైస్తవ బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆధారపడ్డాడు. చివరి రెండు సంవత్సరాలలో విపరీతంగా అక్రమాలు, అత్యాచారాలు, హింసా బీభత్సం నడిపిన రజాకార్లు కూడా ముస్లిం సైన్యం కాదు, హిందూ దొరల, భూస్వాముల, జాగీర్దార్ల రక్షణ కోసం ఏర్పడిన ప్రైవేటు సైన్యం అది. తమ విద్వేష రాజకీయాలతో “విమోచన” అనే అబద్ధాన్ని ఉనికిలోకి తెచ్చిన సంఘ్ పరివార్, ‘విమోచన అనకపోతే రజాకార్లను సమర్థించినట్టే’ అని ప్రతి ఒక్కరినీ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించి కొందరిని లొంగదీసుకుంది. చివరికి 1948 సెప్టెంబర్ 17 తర్వాత భారత సైన్యాలకూ, సైన్యం రక్షిస్తున్న భూస్వాములకూ వ్యతిరేకంగా మూడు సంవత్సరాల పాటు పోరాడిన, మూడు వేల మంది కార్యకర్తలను పోగొట్టుకున్న సిపిఐ, సిపిఎం లు కూడా ఆ మాట మీద నిర్ద్వంద్వమైన వైఖరి తీసుకోలేని స్థితి వచ్చింది.

ఇంతకూ సమకాలీన ఆధారాలన్నీ ఆ నాటి పరిణామాలను దాడి, దండయాత్ర, దురాక్రమణ, యుద్ధం, హైదరాబాద్ పతనం, సైనిక చర్య, పోలీసు చర్య, కలయిక, విలీనం వంటి మాటలే వాడాయి గాని, విమోచన అనే మాట వాడలేదు. సంస్థాన వ్యవహారాల మంత్రిగా వల్లభ్ భాయి పటేల్ హైదరాబాద్ విషయమై రాసిన ఉత్తరాలలో, రచనలలో, ఉపన్యాసాలలో విమోచన అనే మాట వాడలేదు. పటేల్ దగ్గర కార్యదర్శిగా పని చేసి, 1956లో ‘ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ పుస్తకం రాసిన వి పి మీనన్ కూడా హైదరాబాద్ విలీనం గురించి మూడు అధ్యాయాలు, 70 పేజీలు రాసి విమోచన అనే మాట వాడలేదు. ఇక విలీనం అందామా, 1947 సెప్టెంబర్ 17 పరిణామాల వల్ల హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనం అయిన మాట నిజమే. కాని, విలీనం అనే మాటకు రెండు ప్రాంతాల మధ్య సమానస్థాయితో, ఇష్టపూర్వకంగా జరిగే కలయిక అనే అర్థం ఉంటుంది. అక్రమంగా దండయాత్ర జరిపి హైదరాబాద్ రాజ్యాన్ని తనలో జీర్ణం చేసుకున్న, ఆక్రమించుకుని కలిపేసుకున్న పరిణామాన్ని విలీనం అనడం ఆ మాటకు ఉన్న సంపూర్ణ అర్థానికి సరిపోదు.

విద్రోహం అందామా, అప్పటిదాకా నమ్ముతూ ఉన్న వారికి వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం అనే అర్థం లోనే ఆ మాట వాడాలి. హైదరాబాద్ రాజ్యపు స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించి, 1947 నవంబర్ 29న యథాతథ ఒడంబడిక (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్) కుదుర్చుకుని, ‘మీ వ్యవహారాలలో మేం జోక్యం చేసుకోము, మా వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు’ అని సంతకాలు పెట్టి, ఆ సంతకాల తడి ఆరకుండానే, ఏడాది తిరగకుండానే సైనిక చర్యకు దిగిన భారత ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వానికి విద్రోహం చేసిందని అనవచ్చు. కాని ఇక్కడ సమస్య ప్రజలది. ప్రజలు చేస్తున్న పోరాటాన్ని అణచివేయడానికి, రక్తపుటేర్లలో ముంచడానికి జరిగిన ప్రయత్నం అది. దాన్ని విద్రోహం అనే మాట ద్వారా సూచించే అవకాశం తక్కువ. ఇక జాతీయ సమైక్యత అనే మాట ఏదో ఒక మాట కల్పించే ప్రయత్నమే తప్ప, హైదరాబాద్ సెప్టెంబర్ 1948 పరిణామాలకూ జాతీయ సమైక్యతకూ ఎటువంటి సంబంధమూ లేదు. నిజంగా జాతీయ సమైక్యత సాధించాలంటే, సమాఖ్య రాజ్యం లోని భిన్న ప్రాంతాలను ఒకే పాలనా ప్రాంతంగా సమీకరించాలంటే జరపవలసింది సైనిక దాడి కాదు, దండయాత్ర కాదు. సమైక్యత అనేది హింస, దౌర్జన్యాల ద్వారా సాధించేది కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *