పోక్సో కేసుల కోసమే ప్రత్యేకంగా ఏర్పరచిన న్యాయస్థానం ముందు ఇరవై నాలుగు గంటల లోపల కేసు నమోదు చేసి బాధితుల వాంగ్మూలం నమోదు చేయాలి. బాలిక పేరు, వివరాలు బైట పెట్టకుండా భయం కలిగించని, స్నేహపూర్వక వాతావరణలో దర్యాప్తు జరపాలి. పత్రికలు, ప్రచార సాధనాలు కూడా ఆమె పేరును గోప్యంగా ఉంచాలి. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచాలి. సాధారణంగా పోక్సో కేసులలో బెయిల్ దొరకడం కష్టం. విచారణ కూడా రహస్యంగా, బాలిక గోప్యతకు భంగకరం కాకుండా జరిగిన తర్వాత, నేరం రుజువైతే నేరస్తులకు చట్టం కఠిన కారాగార శిక్షలు ప్రతిపాదించింది.
ఈ వారం తెలంగాణ దిశకు, భవిష్యత్తుకు సంబంధించిన రెండు కీలకమైన సామాజిక, రాజకీయ అంశాలు సంభవించాయి. అవి కేవలం అప్పటికప్పుడు జరిగి, ముగిసిపోయిన ఘటనలు కావు, వాటికి గతమూ, భవిష్యత్తూ సుదీర్ఘ పరిణామాలున్నాయి. ఇదే సమయంలో మరెన్నో ముఖ్యమైన పరిణామాలు కూడా జరుగుతూ ఉండవచ్చును గాని ఈ రెండు పరిణామాలను మాత్రం లోతుగా పరిశీలిస్తే తెలంగాణ భవిష్యత్తు ప్రమాదకరంగా కనబడుతున్నది.
మొదటిది, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్ర ప్రభుత్వంలో హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ మైనర్ బాలికమీద జరిపిన అత్యాచారం వార్త శనివారం బైటపడడం, తర్వాత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు. రెండవది, ఈ మధ్యలో ఆదివారం నాడు మొదట హైటెక్ సిటీలో జరిగిన సభలోనూ, తర్వాత పరేడ్ గ్రౌండ్స్ సభలోనూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఉపన్యాసాలు.
బండి సంజయ్ మాట దురుసుతనం గురించి తెలిసిందే. కొడుకుకు చేతి దురుసుతనం కూడా ఉందని మూడు సంవత్సరాల కింద తాను చదువుతుండిన మహీంద్రా యూనివర్సిటీలో ఒక అబ్బాయిని కొడుతూ, వీడియో కూడా తీయించుకుని, తన వీరత్వాన్ని ప్రచారం చేసుకున్న ఘటనలో బయటపడింది. ఆ వీడియో బైటపడిన తర్వాత సుపుత్రుడి మీద ఎటువంటి విచారణా, క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నమూ జరిగినట్టు లేదు. అంతే కాదు, ఈ లోగా తండ్రి అమిత్ షా కు సహచర మంత్రిగా పదోన్నతి పొందాడు. అప్పటికే పగ్గాలు లేవని తేలిపోయిన కొడుకు ఇప్పుడిక అచ్చోసిన ఆంబోతు అయిపోయాడు. అధికారం అలవాటయింది. ఈ క్రమంలో పరిచయమైన ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో పాటు తిప్పుకుని, బలవంతంగా మద్యం తాగించి, లైంగికంగా వేధించాడని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని, ఆ బాలిక రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిందని బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు శనివారం నాడు గుప్పుమంది. ఆ అమ్మాయే తనను హనీ ట్రాప్ చేసి, ఐదు కోట్ల రూపాయలు అడిగిందని, తాను యాబైవేలు ఇచ్చానని, ఆమెనే తనను వేధించిందని బండి సాయి భగీరథ్ కరీం నగర్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు వార్త కూడా ఆరోజే వచ్చింది.
బాధితురాలి తల్లిదండ్రులు మూడు నెలలుగా ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు ఒకవైపు తాత్సారం చేస్తుండగా, స్వయంగా బండి సంజయ్ ఆమెను ఫిర్యాదు వెనక్కి తీసుకొమ్మని ఒత్తిడి చేయడం, ఆమె మీదనే నిర్మల్ లో తప్పుడు కేసు నమోదు చేయించడం, ఈ సంప్రదింపులలో ఒక మాజీ జర్నలిస్టు, ప్రస్తుత భాజపా నాయకుడు మధ్యవర్తిత్వం వహించడం వంటి వ్యవహారాలు కూడా బైటపడ్డాయి. తమ ఫిర్యాదును నమోదు చేసుకోకపోతే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ సభ (ఆ సభకు ముందు ప్రతిపాదించిన పేరు ‘మహిళా ఆగ్రహ సభ’ సరిగ్గా సరిపోయి ఉండేది. ఈ బెదిరింపు తర్వాతనో ఏమో మొదట పోస్టర్లలో ఉండిన పేరు తర్వాతి పోస్టర్లలో లేదు!) దగ్గర తాను ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించగా చివరికి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అంగీకరించారని, కాని శుక్రవారం వారిని పోలీసు స్టేషన్ లో కొన్ని గంటల పాటు కూచోబెట్టారని, ఇక్కడ వారు వేచి చూస్తుండగానే, కరీంనగర్ పోలీసుల ముందర భగీరథ్ తో ఎదురు ఫిర్యాదు చేయించి, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలుస్తున్నది.
ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారిణి మూడు రోజులుగా నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నదని, పరారీలో ఉన్నాడని ప్రకటించారు. నేరం రుజువైతే అరెస్టు చేస్తామన్నారు. “నేరం రుజువు కావడం” అనేది న్యాయస్థానంలో జరుగుతుందని, అనుమానం మీద, ఫిర్యాదు మీద అరెస్టు జరుగుతుందని, పోలీసుల పని ప్రాథమిక దర్యాప్తు జరిపి సాక్ష్యాధారాలు న్యాయస్థానానికి సమర్పించడం మాత్రమే అని ఐపీఎస్ అధికారులకు ఎవరు నేర్పాలి?
చిన్నారుల మీద లైంగిక దాడులు, వేధింపులు, అత్యాచారాలు, పోర్నోగ్రఫీ నిరోధించడానికి, ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఆమోదించిన నియమావళి ప్రకారం 2012లో భారత ప్రభుత్వం తెచ్చిన కఠినమైన చట్టం ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఆక్ట్ (పోక్సో). ఈ చట్టం ప్రకారం బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బాధితురాలికి తక్షణం వైద్య పరీక్షలు జరిపించాలి. పోక్సో కేసుల కోసమే ప్రత్యేకంగా ఏర్పరచిన న్యాయస్థానం ముందు ఇరవై నాలుగు గంటల లోపల కేసు నమోదు చేసి బాధితుల వాంగ్మూలం నమోదు చేయాలి. బాలిక పేరు, వివరాలు బైట పెట్టకుండా భయం కలిగించని, స్నేహపూర్వక వాతావరణలో దర్యాప్తు జరపాలి. పత్రికలు, ప్రచార సాధనాలు కూడా ఆమె పేరును గోప్యంగా ఉంచాలి. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచాలి. సాధారణంగా పోక్సో కేసులలో బెయిల్ దొరకడం కష్టం. విచారణ కూడా రహస్యంగా, బాలిక గోప్యతకు భంగకరం కాకుండా జరిగిన తర్వాత, నేరం రుజువైతే నేరస్తులకు చట్టం కఠిన కారాగార శిక్షలు ప్రతిపాదించింది.
చట్ట నిర్దేశాలు ఇంత కచ్చితంగా ఉండగా, తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, కేసు పెట్టలేదు, దర్యాప్తు జరపలేదు, నిందితుడి మీద చర్యలు ప్రారంభించలేదు. అనివార్య పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి వచ్చేప్పటికి, బాధితులను గంటల తరబడి పోలీస్ స్టేషన్ లో కూచోబెట్టి, ఈలోగా నిందితుడికి ఉప్పందించి, ఎదురు ఫిర్యాదు తయారు చేయించి, ఆ ఎఫ్ఐఆర్ ముందుగా నమోదు చేసి, తర్వాతనే బాధితుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి అరెస్టుకు ప్రయత్నించలేదు. రెండు రోజుల తర్వాత నిందితుడి తండ్రితో రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి బహిరంగ సభా వేదిక పంచుకున్నారు. నిందితుడి తండ్రి కేసు గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ తన మీద కుట్ర అని, తాను భారతీయ జనతా పార్టీని, సనాతన ధర్మాన్ని వదలనని ప్రకటించాడు.
సంఘ్ పరివారంలో జీవితమంతా గడిపిన నరేంద్ర మోదీ ఆ వ్యాఖ్య చేస్తే ఆశ్చర్యం లేదు. చదువుకునే రోజుల్లో కార్టూనిస్టుగా ఆదాయం కోసం మాత్రమే ఆర్ఎస్ఎస్ పత్రికలో పని చేశానని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకిస్తున్నట్టు కనబడే రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యకు చిరునవ్వులు చిందించడం తెలంగాణ ప్రజలు ఆందోళన పడవలసిన విషయం. అది ‘కలవడానికి అభ్యంతరం లేదు’ అనే సంకేతమా? రెండు రోజుల ముందే బైటపడిన పోక్సో కేసు నిందితుడి తండ్రి పక్కన కూచోవడం ఒక సంకేతమైతే, తర్వాత కొన్ని గంటలకు జరిగిన పార్టీ సభలో నరేంద్ర మోదీ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి పలికిన అవాకులూ చెవాకులకు స్పందించకపోవడం మరొక సంకేతం. తెలంగాణలో అబ్ కీ బార్ భాజపా సర్కార్ అని మోదీ ఎన్నికల సభలోలాగా గొంతు చించుకుని అరవడం ఇంకొక సంకేతం.
ఈలోగా ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలన్నిటినీ బాధితురాలి కథనం రాకుండా, నిందితుడి కథనమే ప్రధానంగా వచ్చేలా మేనేజ్ చేశారు. మూడో రోజు నాటికి సామాజిక మాధ్యమాలలో, పౌరసమాజంలో చర్చ మొదలై, ఒకటో రెండో ప్రతిపక్షాలు కూడా మాట్లాడడం ప్రారంభమయ్యాక ముఖ్యమంత్రి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రకటించారు. అది కేసును పక్కదారి పట్టించే, తాత్సారం చేసే ప్రయత్నమని విమర్శలు వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారిణి మూడు రోజులుగా నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నదని, పరారీలో ఉన్నాడని ప్రకటించారు. నేరం రుజువైతే అరెస్టు చేస్తామన్నారు. “నేరం రుజువు కావడం” అనేది న్యాయస్థానంలో జరుగుతుందని, అనుమానం మీద, ఫిర్యాదు మీద అరెస్టు జరుగుతుందని, పోలీసుల పని ప్రాథమిక దర్యాప్తు జరిపి సాక్ష్యాధారాలు న్యాయస్థానానికి సమర్పించడం మాత్రమే అని ఐపీఎస్ అధికారులకు ఎవరు నేర్పాలి?
‘నిందితుడు పరారీలో ఉన్నాడు, కనబడుట లేదు’ అని పోలీసులే ప్రకటించారు గనుక, వారికి దర్యాప్తులో సహకరించడానికి ‘కనబడుటలేదు’ అని ఎవరో ఫోటో పోస్టర్ తయారుచేసి ఊరంతా అతికిస్తే, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి ఆ పోస్టర్లు చించివేశారు, తొలగించారు. అసలు అంతకు ముందే, బాధితురాలి ఫోన్ హాక్ చేసి, తన పాత సందేశాలన్నీ తొలగించమని నిందితుడు ఒక హాకర్ ను అడిగాడని కూడా వార్తలు వస్తున్నాయి. తొలగింపులు అలవాటేనన్నమాట!
ఇది ఒక పోలీసు స్టేషన్ అధికారులు, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందపు ఐపీఎస్ అధికారి, ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలు, జిఎచ్ఎంసి వంటి వివిధ స్థాయిలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అధికారం, ధూర్తత్వం ఎలా పని చేస్తున్నాయో తెలియకపోవడం సమస్య. ఆమోదం అనబడేది ఉన్నప్పటికీ మైనర్ బాలిక మీద అత్యాచారాన్ని, లైంగిక వేధింపును చట్టం తీవ్రంగా పరిగణిస్తుందని తెలియని సమస్య. స్త్రీ పురుషుల మధ్య మన సమాజంలో ఒక అధికార సంబంధం కొనసాగుతున్నదని తెలియని సమస్య. ఆ సమస్య వల్ల బాధితుల మీద బండలు వేసే దుర్మార్గ వర్తమానం దాపురించింది. అధికార, అర్థ, అంగ బలాలతో నిజాన్ని అణగదొక్కి, అబద్ధాన్నే ఊరేగించే పాడుకాలం వ్యాపిస్తున్నది.
ఇక్కడే రెండో ఘటన గురించి చెప్పుకోవాలి. రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనల కోసం ఎచ్ ఐ సిసి లో జరిగిన సభలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడ ముఖ్యమంత్రి, “మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధాని మన్మోహన్ సింగ్ మీ గుజరాత్ మోడల్ అభివృద్ధికి సహకరించినట్టుగా, మీరు మాకు సహకరిస్తే పదేళ్లలో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం” అన్నారట. నిజానికి గుజరాత్ మోడల్ అభివృద్ధి అనేది ఆశ్రిత కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి మాత్రమేనని, ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ముఖ్యమంత్రి మాటకు జవాబుగా నరేంద్ర మోదీ , “రేవంతా జీ (ఇద్దరి మధ్య ఎంత ప్రేమ, అధికారపూర్వకంగా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు అని కాదు, రేవంతా జీ అట, హిమంతా జీ అని అస్సాం ముఖ్యమంత్రిని చనువుగా పిలిచినట్టు!) ఇక్కడ రాజకీయాలు వద్దని, రాజకీయేతరంగా మాట్లాడాలని అన్నారు. నేను రాజకీయేతరంగానే మాట్లాడుతాను, గతంలో గుజరాత్ కు ఎంత వచ్చిందో అంత ఇమ్మని అడుగుతున్నారు. అలా ఇస్తే ఇప్పుడు మీకు వచ్చేది కూడా సగం అవుతుంది. మీరు ఎక్కడికి చేరాలని అనుకుంటున్నారో అక్కడికి చేరుకోలేరు. అలా చేరుకోవాలంటే నాతో కలవండి” అన్నారు.
ఇది రాజకీయేతరం కాదు, అతి పెద్ద రాజకీయ వ్యాఖ్య. గుజరాత్ కు మన్మోహన్ సింగ్ ఇచ్చినదానికన్న తెలంగాణకు తన ప్రభుత్వం రెట్టింపు ఇస్తున్నదనేది పచ్చి అబద్ధం. దాన్ని మించినది, ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రిని బహిరంగ సభా వేదిక మీద ‘నాతో కలువు’ అనడం అహంకారం, వంచన, కుట్ర నిండిన వ్యాఖ్య. సంఘ్ పరివారంలో జీవితమంతా గడిపిన నరేంద్ర మోదీ ఆ వ్యాఖ్య చేస్తే ఆశ్చర్యం లేదు. చదువుకునే రోజుల్లో కార్టూనిస్టుగా ఆదాయం కోసం మాత్రమే ఆర్ఎస్ఎస్ పత్రికలో పని చేశానని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకిస్తున్నట్టు కనబడే రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యకు చిరునవ్వులు చిందించడం తెలంగాణ ప్రజలు ఆందోళన పడవలసిన విషయం. అది ‘కలవడానికి అభ్యంతరం లేదు’ అనే సంకేతమా? రెండు రోజుల ముందే బైటపడిన పోక్సో కేసు నిందితుడి తండ్రి పక్కన కూచోవడం ఒక సంకేతమైతే, తర్వాత కొన్ని గంటలకు జరిగిన పార్టీ సభలో నరేంద్ర మోదీ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి పలికిన అవాకులూ చెవాకులకు స్పందించకపోవడం మరొక సంకేతం. తెలంగాణలో అబ్ కీ బార్ భాజపా సర్కార్ అని మోదీ ఎన్నికల సభలోలాగా గొంతు చించుకుని అరవడం ఇంకొక సంకేతం.
ఈ సంకేతాలన్నీ ఏమి సూచిస్తున్నాయి? మోదీ కోరినట్టు రేవంత్ రెడ్డి ఆయనతో కలిసి అబ్ కీ బార్ భాజపా సర్కార్ స్థాపించబోతున్నారా? లేక బండి సాయి భగీరథ్ ఎమ్మెల్యేగానో, మంత్రిగానో 2028లో అబ్ కీ భార్ భాజపా సర్కార్ ఏర్పడబోతున్నదా? మహత్తర ప్రజా ఉద్యమాల చరిత్ర గల కోటి రతనాల వీణ తెలంగాణ ఏమి కాబోతున్నది?





