హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26: తెలంగాణ రాష్ట్రం టీకాలు, జనరిక్ ఔషధాలు, క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా ఎదిగిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడిరచారు. లైఫ్ సైన్సెస్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగుతోందని తెలిపారు. మంగళవారం మాదాపూర్‌లోని ఆవాసా హోటల్ లో ఇండో-బెల్జియన్ లైఫ్ సైన్సెస్ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు, జనరిక్ ఔషధాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతాయని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. కొత్త అవకాశాలు, అనుకూల వాతావరణంతో బెల్జియం లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక వసుతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. యూరోపియన్ యూనియన్‌లో రెండో అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉన్న బెల్జియం, ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణలతో ముందంజలో ఉందని శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. బలమైన భాగస్వామ్యం ద్వారా రెండు దేశాలు పరస్పర ప్రయోజనం పొందగలవన్న విశ్వాసం తనకుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సదస్సు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో నూతన మైలురాళ్లను చేరుకునే ఒక సహకార వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. డాక్టర్ అజిత్ శెట్టి, డాక్టర్ పీటర్ పియోట్ లాంటి ప్రముఖుల ద్వారా బెల్జియంతో ఇప్పటికే అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. బెల్జియంలోని ఫ్లాండర్స్ రాష్ట్రం, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం అమలులో ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సదస్సు ఏర్పర్చిన భూమికతో ఫ్లామిష్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, వాక్సినోపొలిస్, యూనివర్సిటీ ఆఫ్ గెంట్ వంటి సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రాణరక్షక ఆవిష్కరణలను అందరికీ చౌకగా అందించడం వంటి లక్ష్యాలను పాటించే దిశలో రెండు దేశాలు ముందుకు సాగాలని శ్రీధర్ బాబు కోరారు.
రానున్న ఫిబ్రవరి 24-26 ల మధ్య హైదరాబాద్ లో జరగనున్న బయో ఏషియా ప్రపంచ సదస్సులో ఇక్కడికి వచ్చిన ప్రముఖులంతా పాల్గొనాలని ఆహ్వానించారు. ‘‘ఇండో-బెల్జియన్ లైఫ్ సైన్సెస్ కారిడార్‌ను బలపరచడం, ఆరోగ్య భవిష్యత్తును కలిసి ఆవిష్కరించడం’’ అనే అంశంపై సాగిన ఈ సదస్సుకు బెల్జియం రాయబారి డిడియర్ వాండర్హాసెల్ట్, ద్వైపాక్షిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ జీరోన్ కూర్మన్, డాక్టర్ రెడ్డీస్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. ప్రసాద్, బయో ఏషియా అంతర్జాతీయ సలహా మండలి ఛైర్మన్ డా. అజిత్ శెట్టి, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఆచార్యులు డాక్టర్ పీటర్ పియోట్, ఎం.ఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డా. సౌమ్య స్వామినాథన్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ జైన్, పలువురు శాస్త్రవేత్తులు, పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.