స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్: తెలంగాణ పద్ధతి!

“తెలంగాణలో సర్ ప్రక్రియ జరగక ముందు ఉన్న వోటర్ల జాబితాల ప్రకారం మొత్తం వోటర్ల సంఖ్య 3,38,26,448. సర్ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ముసాయిదా జాబితాలో ఇందులోంచి 73,40,339 పేర్లు తొలగించి, జాబితాను 2.65 కోట్లకు కుదించారు. గైర్హాజర్ – జాడ లేదు (ఆబ్సెంట్), మరొక చోటికి బదిలీ (షిఫ్టెడ్), మరణం (డెడ్), నకిలీ (డూప్లికేట్) – ఎ ఎస్ డి డి అనే ఖాతాలో 53,97,791 పేర్లు తొలగించారు. అలా తొలగించబడినవారు నిజంగానే ఈ నాలుగు కారణాల కిందికి వచ్చే వారేనా, ఏదో ఒక స్థాయిలో వారిని తొలగించాలని నిర్ణయం తీసుకుని అమలు చేశారా అనేది పెద్ద ప్రశ్న. అలాగే నోటీసులు ఇచ్చిన కారణాలు సరైనవేనా, నోటీసులకు జవాబులు ఇస్తే, అడిగిన ధృవీకరణ పత్రాలు ఇస్తే వోటు హక్కు పునరుద్ధరణ జరుగుతున్నదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది..”

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిర్వాకంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వోటర్ల విషయంలో, మొత్తంగా భారత ప్రజాస్వామ్యం విషయంలో సాగిస్తున్న విధ్వంస కాండ, వోటర్ల జాబితాల ఊచకోత తవ్వినకొద్దీ ఎన్నో కంకాళాలు బైటపడుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది నిజంగా ప్రత్యేక ఉధృత సవరణ కార్యక్రమం కాదని, స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ గాని, సంఘ్ స్పాన్సర్డ్ ఇంటెన్షనల్ రిమూవల్ గాని కావచ్చునని రోజురోజూ తేటతెల్లమవుతున్నది.

దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది వోటర్ల పేర్లు తొలగించారని, ఒక్కొక్క రాష్ట్రంలో అరవై లక్షలు, డెబ్బై లక్షలు, తొంబై లక్షల వోటర్లను గల్లంతు చేశారని ఇప్పటివరకూ స్థూలమైన అంకెలూ, వివరాలూ బైటపడ్డాయి. వాటి మీద ప్రతిపక్షాల ఆందోళన, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, ప్రధాన ఎన్నికల కమిషనర్ సహ కమిషనర్ల అభిప్రాయాలను తొక్కిపట్టారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కథనం, ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు అనుమతించిందని ఆడిన అబద్ధం – రోజుకొక రసవత్తర సన్నివేశం బైటపడుతున్నాయి.

అయితే ఈ దేశవ్యాప్త వివరాలలో, గణాంకాలలో ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినవి అంతగా బైటి రావడం లేదు. ముసాయిదా వోటర్ల జాబితాలో 73 లక్షల పేర్లు గల్లంతయ్యాయని, అరవై లక్షల మందికి నోటీసులు అందాయని వార్తలు వచ్చాయి. ఎవరెవరికి ఎట్లా నోటీసులు అందాయో హాస్యాస్పద విషయాలు కొన్ని బైటపడ్డాయి. కాని తవ్వుతూ పోతే, నిశిత పరిశోధన జరిపితే దిగ్భ్రాంతికర వాస్తవాలు బైటపడుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం వోటర్ల తొలగింపు వారి జనాభా నిష్పత్తి కన్నా ఎక్కువగా, నిరంకుశంగా, వారి వాదనలు వినకుండా జరిగిందని, దాని వెనుక దురుద్దేశాలు ఉండవచ్చునని స్పష్టంగా తేలుతున్నది.

“అసలు ఈ లాజికల్ డిస్క్రెపెన్సీ, మ్యాపింగ్ కాకపోవడం అనే మాటలకు అర్థం లేదు. పేరు, తండ్రి పేరు స్పెల్లింగ్ తప్పులు, ఇంటి అడ్రస్ తప్పు, తల్లికీ పిల్లలకూ 14 ఏళ్ల కన్నా తక్కువ వయోభేదం లాంటి ఎన్నో ఈ లాజికల్ డిస్క్రెపెన్సీ కింద పెట్టారు. అవి చూస్తే పేరు తొలగించడానికి తయారు చేసిన కారణాల్లా ఉన్నాయి గాని, వోటు హక్కును కాపాడే కారణాల్లా లేవు. దేశ భాషలలోని పేర్లు ఇంగ్లిష్ స్పెల్లింగ్ లో భిన్నమైన భిన్నమైన పద్ధతిలో రాసే అవకాశం ఉందని, కంప్యూటర్ పట్టుకోలేకపోయినంత మాత్రాన వ్యక్తి తప్పు కాదని కనీస స్పృహ లేకుండా ఇది తయారు చేశారు. అలాగే ఈ దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనీ, కోట్లాది మందికి ఎన్నికల సంఘం అడుగుతున్న ధృవీకరణ పత్రాలు ఉండకపోవచ్చుననీ కనీసమైన స్పృహ ఎన్నికల సంఘానికి లేదు..”

తెలంగాణలో సర్ ప్రక్రియ జరగక ముందు ఉన్న వోటర్ల జాబితాల ప్రకారం మొత్తం వోటర్ల సంఖ్య 3,38,26,448. సర్ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ముసాయిదా జాబితాలో ఇందులోంచి 73,40,339 పేర్లు తొలగించి, జాబితాను 2.65 కోట్లకు కుదించారు. గైర్హాజర్ – జాడ లేదు (ఆబ్సెంట్), మరొక చోటికి బదిలీ (షిఫ్టెడ్), మరణం (డెడ్), నకిలీ (డూప్లికేట్) – ఎ ఎస్ డి డి అనే ఖాతాలో 53,97,791 పేర్లు తొలగించారు. అలా తొలగించబడినవారు నిజంగానే ఈ నాలుగు కారణాల కిందికి వచ్చే వారేనా, ఏదో ఒక స్థాయిలో వారిని తొలగించాలని నిర్ణయం తీసుకుని అమలు చేశారా అనేది పెద్ద ప్రశ్న. అలాగే నోటీసులు ఇచ్చిన కారణాలు సరైనవేనా, నోటీసులకు జవాబులు ఇస్తే, అడిగిన ధృవీకరణ పత్రాలు ఇస్తే వోటు హక్కు పునరుద్ధరణ జరుగుతున్నదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో వోటర్ల జాబితాల సవరణలో ఎన్నికల సంఘం చేసిన అక్రమాల గురించి చాలా పరిశోధన జరగవలసి ఉంది. ఆ పనికి రాజకీయ పార్టీలైనా పూనుకోవాలి, పౌర సమాజమైనా పూనుకోవాలి. కనీసం ప్రచార సాధనాలు ఆ అక్రమాల గురించి పరిశోధించి సంపూర్ణ, వాస్తవ సమాచారం, విశ్లేషణలు ప్రజల ముందుంచాలి. కాని దురదృష్టవశాత్తూ తెలంగాణ నుంచి వెలువడుతున్న తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ పత్రికలు గాని, లెక్కకు మించి ఊదరగొట్టే ఇరవై నాలుగు గంటల వార్తా శ్రవంతులు గాని ఆ కనీసమైన ప్రజా ప్రయోజనకరమైన పనికి పూనుకోలేదు. వాటిలో వోటర్ల జాబితాల అక్రమాల గురించి, సర్ ప్రక్రియ హాస్యాస్పద స్థితి గురించి ఒకటో రెండో వార్తలు రాలేదని కాదు. కాని అవసరమైనంత సమగ్రమైన పరిశోధన జరిపి, మొత్తంగా ఎటువంటి అక్రమాలు జరిగాయో ఉదాహరణలతో వెల్లడించడం మాత్రం జరగలేదు.

అటువంటి అత్యవసరమైన కృషి చేయడానికి ప్రయత్నించినది కోల్కత్తా కు చెందిన స్వతంత్ర సంస్థ సబర్ ఇన్స్టిట్యూట్. ఆ పరిశోధనా సంస్థ అందించిన సమాచారం ఆధారంగా, సొంతంగా కూడా పరిశోధన జరిపి, సమాచారం సేకరించి, విశ్లేషించి సమగ్ర కథనాలు ప్రచురించినది చెన్నై నుంచి వెలువడే ద హిందూ గ్రూప్ పక్షపత్రిక ఫ్రంట్ లైన్. ఆ పత్రిక తాజా సంచికలో చాలా సమాచారంతో వివరమైన మూడు వ్యాసాలతో తెలంగాణలో సర్ ప్రక్రియ గందరగోళాన్ని కళ్లకు కట్టిన, విశ్లేషించిన విలేఖరి ఆయేషా మిన్హాజ్ కు కృతజ్ఞతలు, అభినందనలు. (ఈ వారం ఈ తెలంగాణార్థం శీర్షిక ఆ సమాచారం మీదనే ఆధారపడింది).

సర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో వోటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపుల క్రమం చూస్తే 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన నియోజకవర్గాలలో ప్రత్యేకమైన పద్ధతి కనబడుతున్నది. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన ఏడు నియోజకవర్గాల్లో “జాడ లేరు/గైర్హాజరు” అనే పేరుతో తొలగించిన పేర్లలో 45 శాతం ముస్లిం పేర్లు ఉన్నాయి. వారి జనాభా నిష్పత్తి కన్నా ఇంత ఎక్కువగా వారు ఎలా జాడా లేకుండా పోయారో, గైర్హాజరయ్యారో పరిశోధించవలసి ఉంది. అలాగే చనిపోయారని తొలగించిన పేర్లలో 17 శాతం ముస్లింలవి. సర్ ప్రక్రియ ముందరి వోటర్ల జాబితా నాటి నుంచి, సర్ ప్రక్రియ నాటికి ఇంత పెద్ద ఎత్తున ముస్లింలే మరణించారనడం కూడా ఆశ్చర్యార్థకం, హాస్యాస్పదం, అనుమానాస్పదం. ఇతర పార్టీలు గెలిచిన నియోజకవర్గాలలో ఈ అంకెలు భిన్నంగా ఉన్నాయి.

“అన్నిటినీ మించినది ఫార్మ్ 7 గందరగోళం. పద్ధతి ప్రకారం వోటర్ల జాబితాలో ఉన్న ఏదైనా పేరు పట్ల అభ్యంతరం తెలపడానికి గాని, లేదా ఏదైనా పేరు తొలగించాలని సూచించడానికి గాని ఫార్మ్ 7 వాడాలి. అంటే ఇటువంటి అభ్యర్థనలు హెచ్చు సంఖ్యలో ఉండే అవకాశం లేదు. కాని తెలంగాణలో ఎవరి పేరు తొలగించాలో ముందే అచ్చు వేసి ఉన్న ఫార్మ్ 7 లు చాలా నియోజకవర్గాలలో దొరికాయి. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్ (బి ఎల్ ఏ) ఒక్కరే ముందే పీర్లు అచ్చు వేసిన 30 ఫార్మ్ 7 లు దాఖలు చేశారు. అలాగే గోషామహల్ నియోజకవర్గంలో అటువంటి దరఖాస్తులు 15 దాఖలయ్యాయి. ఇటువంటి ముందే అచ్చువేసి ఉన్న దరఖాస్తులలో ఎవరు అభ్యంతరం తెలుపుతున్నారో వారి పేరు, వారి ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు నంబర్, మొబైల్ నంబర్, సంతకం వారు చేతితో నింపారు. కాని ఎవరి పేరు తొలగించమని కోరుతున్నారో వారి పేరు, ఎన్నికల సంఘం గురింపు కార్డు నంబర్, మొబైల్ నంబర్ ముందే ఎక్కడో ఎవరో అచ్చువేసి పంపారు. అంటే ఒక నియోజకవర్గంలో ఏయే వోటర్ల పేర్లు తొలగించాలో మరెక్కడో నిర్ణయం జరిగిందన్నమాట..”

ఈ ఎ ఎస్ డి డి తొలగింపులు కాకుండా, ముసాయిదా జాబితాలో పేర్లు ఉన్న వారిలో కూడా 92,87,577 మందికి నోటీసులు ఇచ్చారు. వీరిలో 60 లక్షల మందికి నోటీసులు ఇవ్వడానికి కారణం “లాజికల్ డిస్క్రెపెన్సీ” (తార్కిక వ్యత్యాసం)! 32 లక్షల మందికి కారణం 2002 ఎన్నికల జాబితాతో సరిపోలలేదనేది (మ్యాపింగ్ కాలేదు). వారికి ఒక ధృవీకరణ పత్రాల జాబితా ఇచ్చి, అవి తెచ్చి తాము వోటర్లమేనని రుజువు చేసుకొమ్మన్నారు. ఈ నోటీసులు ఇచ్చే ప్రక్రియ గందరగోళంగా జరిగింది.

అసలు ఈ లాజికల్ డిస్క్రెపెన్సీ, మ్యాపింగ్ కాకపోవడం అనే మాటలకు అర్థం లేదు. పేరు, తండ్రి పేరు స్పెల్లింగ్ తప్పులు, ఇంటి అడ్రస్ తప్పు, తల్లికీ పిల్లలకూ 14 ఏళ్ల కన్నా తక్కువ వయోభేదం లాంటి ఎన్నో ఈ లాజికల్ డిస్క్రెపెన్సీ కింద పెట్టారు. అవి చూస్తే పేరు తొలగించడానికి తయారు చేసిన కారణాల్లా ఉన్నాయి గాని, వోటు హక్కును కాపాడే కారణాల్లా లేవు. దేశ భాషలలోని పేర్లు ఇంగ్లిష్ స్పెల్లింగ్ లో భిన్నమైన భిన్నమైన పద్ధతిలో రాసే అవకాశం ఉందని, కంప్యూటర్ పట్టుకోలేకపోయినంత మాత్రాన వ్యక్తి తప్పు కాదని కనీస స్పృహ లేకుండా ఇది తయారు చేశారు. అలాగే ఈ దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనీ, కోట్లాది మందికి ఎన్నికల సంఘం అడుగుతున్న ధృవీకరణ పత్రాలు ఉండకపోవచ్చుననీ కనీసమైన స్పృహ ఎన్నికల సంఘానికి లేదు.

ఈ ఎ ఎస్ డి డి, లాజికల్ డిస్క్రెపెన్సీ, మ్యాపింగ్ పేర్లతో హైదరాబాద్ లోనూ, మొత్తంగా రాష్ట్రంలోనూ ఎడాపెడా పేర్లు కొట్టేశారు. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రంలో జనాభాలో ముస్లింలు 8.8 శాతం ఉండగా, వోటర్ల జాబితా నుంచి తొలగించబడిన పేర్లలో వారు 12.5 శాతంగా ఉన్నారు. సబర్ పరిశోధించిన 532 బూత్ లలో, 512 బూత్ లలో తొలగించిన వారిలో 95 శాతం మందికి ఒకే ఒక్క కారణం – శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు – అని మాత్రమే రాశారు. 13 బూత్ లలో తొలగించిన పేర్లలో ఒక్కరు కూడా డెడ్, డూప్లికేట్ లేరు. అందరికందరూ కేవలం “శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు” అనే కారణం మాత్రమే ఉంది. అంటే ఈ తొలగింపులు వాస్తవ కారణాల మీద, క్షేత్ర పరిశీలనతో జరిగినవి కాదు, ఉద్దేశపూర్వకంగా జరిగినవని అర్థం అవుతుంది. అలాగే తొలగించిన వారిలో స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిలో 71 శాతం వివాహిత స్త్రీలు, 45 ఏళ్లకు పైబడినవారు కావడం అనుమానాస్పదం. హైదరాబాద్ మినహా మిగిలిన 104 నియోజకవర్గాల్లో 2023 వోటర్ల జాబితాలో 2,350 ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఉండగా, ఇపుడు ముసాయిదా జాబితాలో సగానికి సగం 1,152 మంది ట్రాన్స్ జెండర్ల పేర్లు తొలగించారు.

“జాడ లేదు/ గైర్హాజర్” అని తొలగించబడిన ఎనిమిది మంది వోటర్లను ఫ్రంట్ లైన్ విలేఖరి కలుసుకున్నారు. వారు సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇచ్చారని, బి ఎల్ ఓ సంతకం చేసిన్ ఇచ్చిన రశీదు కూడా వారిదగ్గర ఉంది. అలాగే, ‘శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు’ అని తొలగించిన పేర్ల వోటర్లను కూడా ఫ్రంట్ లైన్ విలేఖరి కలుసుకున్నారు. వారి పేర్లు తొలగించవలసిన అవసరమే లేదు. అలాగే ‘2002 సర్ జాబితాతో సరిపోలలేదు, మాప్ కాలేదు’ అనేది కూడా చాలా సందర్భాలలో వాస్తవం కాదని తేలింది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా చెప్పిన ప్రకారం బహదూర్ పురా, చాంద్రాయణ్ గుట్ట, చార్మినార్, యాకుత్ పురా లలో సర్ ప్రక్రియకు ముందు బి ఎల్ వోలు జరిపిన మ్యాపింగ్ ప్రక్రియ నాటికి జాబితాలో ఉన్న ఒక లక్షా యాబై వేల మంది హఠాత్తుగా ముసాయిదా జాబితాలో ఎ ఎస్ డి డి కింద తొలగింపుకు గురయ్యారు!

అన్నిటినీ మించినది ఫార్మ్ 7 గందరగోళం. పద్ధతి ప్రకారం వోటర్ల జాబితాలో ఉన్న ఏదైనా పేరు పట్ల అభ్యంతరం తెలపడానికి గాని, లేదా ఏదైనా పేరు తొలగించాలని సూచించడానికి గాని ఫార్మ్ 7 వాడాలి. అంటే ఇటువంటి అభ్యర్థనలు హెచ్చు సంఖ్యలో ఉండే అవకాశం లేదు. కాని తెలంగాణలో ఎవరి పేరు తొలగించాలో ముందే అచ్చు వేసి ఉన్న ఫార్మ్ 7 లు చాలా నియోజకవర్గాలలో దొరికాయి. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్ (బి ఎల్ ఏ) ఒక్కరే ముందే పీర్లు అచ్చు వేసిన 30 ఫార్మ్ 7 లు దాఖలు చేశారు. అలాగే గోషామహల్ నియోజకవర్గంలో అటువంటి దరఖాస్తులు 15 దాఖలయ్యాయి. ఇటువంటి ముందే అచ్చువేసి ఉన్న దరఖాస్తులలో ఎవరు అభ్యంతరం తెలుపుతున్నారో వారి పేరు, వారి ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు నంబర్, మొబైల్ నంబర్, సంతకం వారు చేతితో నింపారు. కాని ఎవరి పేరు తొలగించమని కోరుతున్నారో వారి పేరు, ఎన్నికల సంఘం గురింపు కార్డు నంబర్, మొబైల్ నంబర్ ముందే ఎక్కడో ఎవరో అచ్చువేసి పంపారు. అంటే ఒక నియోజకవర్గంలో ఏయే వోటర్ల పేర్లు తొలగించాలో మరెక్కడో నిర్ణయం జరిగిందన్నమాట. నిజానికి ఇక్కడ బైటపడినవన్నీ సముద్రంలో కాకి రెట్ట వంటివి, ఉదాహరణ ప్రాయమైనవి. సర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు, పత్రాలు, గణాంకాలు, పద్ధతులు బైటికి వచ్చినకొద్దీ మరెన్ని అక్రమాలు బాటపడతాయో తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *