“మొత్తం మీద అన్ని కారణాలూ కలిసి సరైన అంకెలు తయారు కాకపోవడానికే ఎక్కువ అవకాశాలుంటాయి. కింది నుంచి ఉద్యోగులు సరైన అంకెలు పంపినా పైన ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారులు ఆ అంకెలను తారుమారు చేస్తారు. తాము చెప్పదలచుకున్న విషయాలకు ఉపయోగపడే అంకెలను మాత్రమే మిగులుస్తారు. ఒకవేళ తాము చెప్పే విషయానికి అంకె అనుకూలంగా లేకపోతే దాన్ని మార్చేస్తారు. ‘దేశం ప్రగతి పథంలో వెలిగిపోతున్నది’ అని చెప్పాలని ముందే సిద్ధపడి, వాస్తవ అంకెలు ఆ అభిప్రాయాన్ని సమర్థించేలా లేకపోతే ఆ అంకెలనే మార్చి చెప్పిన ఉదాహరణలు కోకొల్లలు. అంటే అంకెలు పూర్తిగా నిజాలు కావడం కన్నా అబద్ధాలు కావడానికే, అర్ధసత్యాలు కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. ..”
కేంద్ర ప్రభుత్వ గణాంక, పథకాల అమలు మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఒక వార్షిక పారిశ్రామిక సర్వే నివేదిక ప్రచురిస్తుంది. ఈ నివేదిక కేవలం తయారీ పరిశ్రమలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వాటి గురించి విస్తారమైన సమాచారం ప్రకటిస్తుంది. ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు సంబంధించిన గణాంకాలు ఈ నివేదికలో చోటు చేసుకోనప్పటికీ, ఈ ఆన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ నివేదిక దానికదిగా అనేక విషయాలు అర్థం చేసుకోవడానికీ, విశ్లేషించడానికీ ఉపయోగపడుతుంది. తాజాగా ఆన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ 2024-25 గతవారం నవంబర్ 4న విడుదలయింది. అందులో తెలంగాణ పరిశ్రమ గురించి ఆసక్తికరమైన, ఆలోచించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి.
ఆ గణాంకాలలోకి, విశ్లేషణలోకి వెళ్లే ముందు ప్రభుత్వ గణాంకాల వినియోగం గురించి కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. అసలు ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు మాత్రమే కాదు, ఏ గణాంకమైనా తటస్థమైనది కాదు. మొట్టమొదట ఏ గణాంకాలు సేకరించాలనేది ఒక వ్యక్తిగత, లేదా సమష్టి నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకునేవారి ఇష్టాయిష్టాల మేరకు, వారి దృక్పథం మేరకు, వారి ప్రయోజనాల మేరకు మాత్రమే ఏ అంకెలు సేకరించాలనే నిర్ణయం జరుగుతుంది. కనుక ఒక అంకెను పరిశీలించేటప్పుడు ఈ అంకెను మాత్రమే ఎందుకు సేకరించారు అనే ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాలి. ఒక అంకె సేకరిస్తున్నప్పుడు దాని పక్కనే ఉండి సేకరణ పరిధిలోకి రాని అంకెలు ఏమిటో కూడా ఆలోచించాలి. ఆ తర్వాత ప్రతి అంకెకూ వెనుక మనుషులు, వారి జీవితాలు, వారి శ్రమ, వారి వినియోగం వంటి ఎన్నో అంశాలుంటాయి. వాటన్నిటినీ మరిచిపోయి అంకెలను అంకెలుగా మాత్రమే చూడగూడదు.
ఇవన్నీ దృక్పథానికి సంబంధించిన సమస్యలు కాగా, వాస్తవ గణాంక సేకరణకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. ఈ గణాంకాలు సేకరించడానికి నియమించిన ఉద్యోగులు సక్రమంగా, ఉన్నది ఉన్నట్టుగా, బద్దకం లేకుండా గణాంకాలు సేకరించకపోవచ్చు, నమోదు చేయకపోవచ్చు, ఫలానా వృద్ధి రేటు చూపెట్టాలి అని పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అంకెలు తామే తయారు చేయవచ్చు. నిజంగా క్షేత్ర పరిశోధనకు వెళ్లినా అక్కడ యజమానులు పెట్టుబడులు, ఉద్యోగుల సంఖ్య, ఉద్యోగుల జీతభత్యాలు, పని పరిస్థితులు వంటి అనేక విషయాలలో వాస్తవాలు చెప్పకపోవచ్చు. కార్మికులను, ఉద్యోగులను అడిగినా వారికి వీటిలో కొన్ని వాస్తవికంగా తెలియకపోవచ్చు. మొత్తం మీద అన్ని కారణాలూ కలిసి సరైన అంకెలు తయారు కాకపోవడానికే ఎక్కువ అవకాశాలుంటాయి. కింది నుంచి ఉద్యోగులు సరైన అంకెలు పంపినా పైన ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారులు ఆ అంకెలను తారుమారు చేస్తారు. తాము చెప్పదలచుకున్న విషయాలకు ఉపయోగపడే అంకెలను మాత్రమే మిగులుస్తారు. ఒకవేళ తాము చెప్పే విషయానికి అంకె అనుకూలంగా లేకపోతే దాన్ని మార్చేస్తారు. ‘దేశం ప్రగతి పథంలో వెలిగిపోతున్నది’ అని చెప్పాలని ముందే సిద్ధపడి, వాస్తవ అంకెలు ఆ అభిప్రాయాన్ని సమర్థించేలా లేకపోతే ఆ అంకెలనే మార్చి చెప్పిన ఉదాహరణలు కోకొల్లలు. అంటే అంకెలు పూర్తిగా నిజాలు కావడం కన్నా అబద్ధాలు కావడానికే, అర్ధసత్యాలు కావడానికే ఎక్కువ అవకాశం ఉంది.
“ఈ పరిశ్రమల్లో మొత్తం 9,87,217 మంది పని చేస్తున్నారని, అందులో 8,35,801 మంది కార్మికులని ఒక గణాంకం చెపుతుంది. రాష్ట్ర జనాభాతో, అందులో పని చెయ్యగల వయసులో ఉన్నవారి సంఖ్యతో పోలిస్తే మన తయారీ రంగం ఇంత తక్కువ మందికి మాత్రమే పని కలిపించడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. ఇక్కడే మరొక వ్యవహారం కూడా ఉంది. ఈ గణాంకాల ప్రకారమే 8,35,801 కార్మికులలో ఉద్యోగభద్రత ఉన్న, నేరుగా ఉద్యోగులుగా ఉన్నవారు 3,01,655 మంది మాత్రమే. కాంట్రాక్టర్ల ద్వారా ఉద్యోగంలో ఉన్నవారు 5,34,145 అని ప్రభుత్వమే చెపుతున్నది. అంటే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి భద్రత అంత ఘోరంగా ఉన్నదన్నమాట.”
ఈ పరిమితులన్నీ గమనంలో ఉంచుకుంటూనే, ప్రభుత్వ గణాంకాలు తప్ప ప్రత్యామ్నాయ గణాంకాలు సేకరించడం అసాధ్యం, కష్టసాధ్యం గనుక, దొరుకుతున్న గణాంకాల ఆధారంగా, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ విశ్లేషించాలి. పరిశ్రమల వార్షిక సర్వే పరిశ్రమ అంటే ఇచ్చే నిర్వచనం ప్రకారం విద్యుత్తుతో నడిచే కార్ఖానాలో అయితే ఇరవై కన్నా ఎక్కువ మంది, విద్యుత్తు లేకుండా నడిచే కార్ఖానాలో నలబై కన్నా ఎక్కువ మంది పని చేస్తున్నప్పుడు మాత్రమే దాన్ని పరిశ్రమ – కర్మాగారం (ఫాక్టరీ) అని అంటారు. కనుక ఇప్పుడు 2024-25 ఆన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ తెలంగాణ గురించి ఏమి చెపుతున్నదో తెలుసుకునే మందు ఇది అన్ని కార్ఖానాలను పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం ఈ 20-40 మంది కన్నా ఎక్కువ కార్మికులు, సిబ్బంది ఉన్న పరిశ్రమల విషయం మాత్రమే మాట్లాడుతున్నదని గుర్తించాలి.
ఇక అసలు విషయానికి వస్తే, తెలంగాణలో ప్రభుత్వ నమోదు ప్రకారం 13,937 కర్మాగారాలు ఉండగా, అందులో 11,398 మాత్రమే వాస్తవంగా నడుస్తున్నాయి. అంటే నమోదైన పరిశ్రమల్లో ఇరవై శాతం పని చెయ్యడం లేదన్నమాట. అవి నష్టాలు వచ్చి మూతపడ్డాయా, సబ్సిడీల కోసం, రాయితీల కోసం, భూమి కోసం పరిశ్రమ తెరుస్తున్నామని ప్రక్రియ ప్రారంభించి, రావలసినవి రాగానే పరిశ్రమ ప్రయత్నాలను మూలకు పెట్టారా ఒక్కొక్క కర్మాగారం వివరాలు చూస్తే తప్ప తెలియదు. అయితే, ఇరవై శాతం పరిశ్రమలు నడవడం లేదనేది దానికదిగానే తీవ్రంగా ఆలోచించవలసిన విషయం.
ఈ పరిశ్రమల్లో మొత్తం 9,87,217 మంది పని చేస్తున్నారని, అందులో 8,35,801 మంది కార్మికులని ఒక గణాంకం చెపుతుంది. రాష్ట్ర జనాభాతో, అందులో పని చెయ్యగల వయసులో ఉన్నవారి సంఖ్యతో పోలిస్తే మన తయారీ రంగం ఇంత తక్కువ మందికి మాత్రమే పని కలిపించడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. ఇక్కడే మరొక వ్యవహారం కూడా ఉంది. ఈ గణాంకాల ప్రకారమే 8,35,801 కార్మికులలో ఉద్యోగభద్రత ఉన్న, నేరుగా ఉద్యోగులుగా ఉన్నవారు 3,01,655 మంది మాత్రమే. కాంట్రాక్టర్ల ద్వారా ఉద్యోగంలో ఉన్నవారు 5,34,145 అని ప్రభుత్వమే చెపుతున్నది. అంటే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి భద్రత అంత ఘోరంగా ఉన్నదన్నమాట.
ఈ మొత్తం పరిశ్రమలు సాలీనా కార్మికులకు, ఉద్యోగులకు, పర్యవేక్షక సిబ్బందికి అంతా కలిపి రు. 34243.92 కోట్ల జీతభత్యాలు చెల్లిస్తున్నాయి. ఇందులో 8,35,801 మంది కార్మికులకు చెలిస్తున్న వేతనాలు రు. 17379.74 కోట్లు. అంటే కార్మికుల సగటు జీతం ఒక్కొక్కరికి సాలీనా రెండు లక్షల ఏడు వేలు, అంటే నెలకు రు. 17,250. ఇది సగటు అంకె అంటే ఇంతకంటే తక్కువ ఉన్నవారు, ఎక్కువ ఉన్నవారు కూడా ఉండవచ్చు. ఈ సగటు అంకెతోనే సగటు కుటుంబ జీవితం, పిల్లల చదువు, వైద్యాలు అన్నీ భరించాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11398 కంపెనీలు (లేదా మొత్తం నమోదైన 13937 కంపెనీలు) రుణ సంస్థల నుంచి పొందిన మొత్తం రుణం, ఇంకా చెల్లించవలసిన రుణం రు. 59,131.23 కోట్లు అని ఈ గణాంకాలు చెపుతున్నాయి. అంటే సగటున ప్రతి కంపెనీ దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఇంకా చెల్లించకుండా ఉంది. లేదా ఎగ్గొట్టింది. లేదా ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమం కింద రద్దయిపోతుందని ఎదురుచూస్తూ ఉంది. నిండా ఎనిమిది లక్షల మందికి కూడా ఉపాధి కల్పించలేని ఈ కంపెనీలు ఒక్కొక్కటీ, ప్రజాధనం నుంచి కనీసం నాలుగు కోట్ల రూపాయల భోంచేసి ఉన్నాయి.
“కాలుష్యకారకమైన ఔషధ పరిశ్రమ, ఉన్నత విద్యావంతులకు అవకాశం ఇచ్చే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే జోడు గుర్రాల మీద గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, పన్నెండేళ్లుగా ప్రత్యేక తెలంగాణలోనూ పాలకులు కాస్తూ వచ్చిన పందెం వల్ల తెలంగాణ నష్టపోయింది. తెలంగాణ ప్రజలు నష్టపోయారు. ఒక్క హైదరాబాద్ మినహా రాష్ట్రమంతటా విస్తారమైన పారిశ్రామికాభివృద్ధి లేదు. అందువల్ల ఉద్యోగ కల్పనా లేదు. పారిశ్రామిక ఉద్యోగ కల్పనతో ఒకవైపు గ్రామీణ వ్యవసాయ సంక్షోభం నుంచి విముక్తి, మరొకవైపు ఎక్కువమంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగే అవకాశాలు లేకుండా పోయాయి. ఆ పారిశ్రామికాభివృద్ధి వల్ల, కొనుగోలు శక్తి పెరుగుదల వల్ల రాష్ట్ర ఖజానాకు రాదగిన పన్నుల ఆదాయం రాలేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎదగవలసినంతగా ఎడగలేదు. ముంజేతి కంకణానికి అద్దమేల అంటారు. పారిశ్రామికాభివృద్ధి లేదని మనందరికీ తెలిసిన సంగతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ గణాంక శాఖ అద్దంలో కనబడుతున్నది. .”
ఇక్కడి నుంచి ఇంకొక గణాంకం లోకి వెళితే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వం నమోదు చేసిన గణాంకాల ప్రకారమే ఈ 11,398 కంపెనీలు కలిసి మొత్తంగా రు. 4,57,495 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు సాధించాయి. అందుకోసం మొత్తంగా అవి ఉత్పత్తి కారకాల మీద పెట్టిన ఖర్చు రు. 3,62,203 కోట్లు. అంటే ఒక సంవత్సరంలో ఈ కంపెనీలు అదనంగా చేర్చిన విలువ రు. 95,291 కోట్లు. అందులో యంత్రాల తరుగుదల రు. 12,265 కోట్లు తీసేసినా నికర అదనపు విలువ రు. 83,026 కోట్లు. అందులో సగం కన్నా తక్కువ రు. 34,243 కోట్లు మాత్రమే జీతభత్యాల కింద ఖర్చు పెట్టి, రు. 40,790 కోట్లు లాభం అని ప్రకటిస్తున్నారు. విలువ మానవ శ్రమ నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతుందని చెప్పే లేబర్ థియరీ ఆఫ్ వాల్యూ మార్క్స్ కన్నా ముందు నుంచే ఉంది. ఇక్కడ కూడా అదనంగా చేరిన విలువ అంతా కూడా శ్రమ ఫలితమే. కాని శ్రమకు అందుతున్న వాటా సగం కన్నా తక్కువ!
ఏడు పేజీలలో, ఇరవై ఏడు వరుసలలో, అరవై ఏడు రకాల పరిశ్రమల్లో ఏమి జరుగుతున్నదో గణాంకాలను ఒక్కొక్కటీ విడదీసి పరిశీలించి విశ్లేషిస్తే మరెన్నో ఆశ్చర్యకరమైన సంగతులు బైటపడతాయి. ఈ ఆన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ దేశంలో ఉన్న పరిశ్రమలన్నిటికీ ఒక కోడ్ ఇచ్చింది. గతంలో రెండు అంకెల కోడ్, గత సంవత్సరం దాకా మూడంకెల కోడ్ గా ఉండి ఇప్పుడు నాలుగంకెల కోడ్ అయింది. ఇప్పుడు మనం పరిశీలిస్తున్న 2024-25 ఆన్యువల్ సర్వే మూడంకెల కోడ్ నే వాడింది.
ఆ కోడ్ ల వెనుక వున్న వాస్తవ పారిశ్రామిక రంగాలను చూస్తే వ్యవసాయోత్పత్తుల మీద ఆధారపడిన కార్ఖానాలు మూడు వేల పైన ఉండగా, విభిన్న సరుకుల తయారీ కార్ఖానాలు మూడంకెలు దాటలేదు. ఆయా పారిశ్రామిక రంగాలు సాధిస్తున్న నికర లాభాల లెక్కలలో కేవలం ఔషధ రంగం ఒక్కటే అయిదంకెలకు చేరి రు. 17,894 కోట్ల లాభం ఆర్జించింది. ఆ మొత్తం లాభాలు ఔషధ పరిశ్రమ యజమానులకు మాత్రమే దక్కుతుండగా, ఆ రంగంలో పని చేస్తున్న కార్మికులకు అందుతున్న వేతనాలు రు. 9,514 కోట్లు మాత్రమే. సమాజానికి దక్కుతున్నది కాలుష్యం, పర్యావరణ విధ్వంసం. లాభం రావడం అలా ఉంచి నష్టాల బాటలో ఉన్న పారిశ్రామిక రంగాలు కూడా ఉన్నాయి. వంద కోట్ల నష్టాలతో వస్త్ర పరిశ్రమ, మొత్తం మీద నష్టాలతో పాదరక్షల తయారీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి.
భారీ యంత్ర సామగ్రి, వాహన తయారీ, మౌలిక సాధన సంపత్తి వంటి పరిశ్రమలేవీ తెలంగాణలో చెప్పుకోదగినంతగా లేవనీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మోజుతో రాష్టం అత్యవసరమైన పారిశ్రామికోత్పత్తులను ప్రోత్సహించకుండా ఉండిపోయిందనీ ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. వ్యవసాయాధార పరిశ్రమలు పేరుకు ఎక్కువగానే ఉన్నప్పటికీ, బహుశా రైస్ మిల్లుల వంటివి కూడా ఈ గణాంకం కిందికి చేరి, నిజమైన వ్యవసాయాధారిత పారిశ్రామికోత్పత్తుల తయారీ జరగడం లేదు.
మొత్తం మీద ఈ గణాంకాలు, ఈ నివేదిక తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి లోపాలను గుర్తించడానికి ఒక మొదటి మెట్టు. కాలుష్యకారకమైన ఔషధ పరిశ్రమ, ఉన్నత విద్యావంతులకు అవకాశం ఇచ్చే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే జోడు గుర్రాల మీద గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, పన్నెండేళ్లుగా ప్రత్యేక తెలంగాణలోనూ పాలకులు కాస్తూ వచ్చిన పందెం వల్ల తెలంగాణ నష్టపోయింది. తెలంగాణ ప్రజలు నష్టపోయారు. ఒక్క హైదరాబాద్ మినహా రాష్ట్రమంతటా విస్తారమైన పారిశ్రామికాభివృద్ధి లేదు. అందువల్ల ఉద్యోగ కల్పనా లేదు. పారిశ్రామిక ఉద్యోగ కల్పనతో ఒకవైపు గ్రామీణ వ్యవసాయ సంక్షోభం నుంచి విముక్తి, మరొకవైపు ఎక్కువమంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగే అవకాశాలు లేకుండా పోయాయి. ఆ పారిశ్రామికాభివృద్ధి వల్ల, కొనుగోలు శక్తి పెరుగుదల వల్ల రాష్ట్ర ఖజానాకు రాదగిన పన్నుల ఆదాయం రాలేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎదగవలసినంతగా ఎడగలేదు. ముంజేతి కంకణానికి అద్దమేల అంటారు. పారిశ్రామికాభివృద్ధి లేదని మనందరికీ తెలిసిన సంగతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ గణాంక శాఖ అద్దంలో కనబడుతున్నది.





