– సరిగా విద్యుత్ సరఫరా చేస్తే ఎందుకు ధర్నాలు చేస్తారు?
– కరెంటు సంక్షోభానికి మీ పాలన నిర్లక్ష్యమే కారణం
– ప్రతిపక్షం ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు
– మంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై హరీష్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: విద్యుత్ వినియోగదారులపై ట్రూప్ అప్ చార్జీల పేరిట రూ.5,420 కోట్ల భారం మోపడం గురించి బీఆరఎస్ ప్రశ్నిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడం ప్రజా పాలన అంటారా అని బీఆరఎస్ ఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు ధ్వజమెత్తారు. ప్రజలపై మోపిన భారాన్ని ఉపసంహరించుకొని పండుగ పూట శుభవార్త చెబుతారనుకుంటే భట్టి ఉసూరుమనిపించారన్నారు. రూ.5,420 కోట్ల భారం ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తామని అధికారులతో చెప్పించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమన్నారు. రైతులు రోడ్ల మీదకు వచ్చి కరెంట్ కోసం ధర్నాలు చేస్తుంటే కోతలే లేవు అని చెప్పడం మీకే చెల్లిందని విమర్శించారు. మీరు సక్రమంగా కరెంట్ సరఫరా చేస్తే రైతులు ఎందుకు సబ్ స్టేషన్ల ముందు వస్తారు? ఎందుకు రోడ్లపై ధర్నాలు చేస్తారు? బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడైనా ఇలా రైతులు రోడ్లెక్కారా? మీరు తెస్తానన్న అనాటి రోజులు ఇవేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే సవాళ్లు విసిరన భట్టి తాము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 15.02.2018 నాటి ఎఫ్.నెం.23014/1/2018-సీఎల్‌డీ ప్రకారం, ఎస్సీసీఎల్ గనుల నుండి 14 ఎంటీపీఏ జి-9 గ్రేడ్ బొగ్గును యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు కేటాయిస్తే కేటాయింపు లేదు అని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు అసత్యపు మాటలు మాట్లాడారు అని ప్రశ్నించారు. ఎల్ నినో సాకు చెబుతూ యాదాద్రిలో 3000 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, కేటిపిఎస్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అగిన మాట నిజం కాదా? ఇది మీ పరిపాలన వైఫల్యం కాకుంటే మరేమిటి అని హరీష్‌రావు నిలదీశారు. రాష్ట్రంలో మొత్తంగా 140 మిలియన్ యూనిట్ల కెపాసిటీ ఉంటే 89 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు మీరే చెప్పారు కదా అని అడిగారు. బొగ్గు ఉన్న దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండాలె అని చెబుతున్న మీరు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమలో నీళ్ళు, బొగ్గు లేని చోట థర్మల్ ప్లాంట్ పెట్టింది నిజం కాదా.. ఆనాడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. మన రాష్ట్ర విద్యుత్ అవసరాలు పక్కన పెట్టి సింగరేణి నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను రాజస్తాన్ రాష్ట్రానికి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నది స్వయంగా మీరు కాదా? ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే నిర్ణయం కాక మరేమిటన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా, తక్కువ ధరకు 1600 మెగావాట్ల విద్యుత్‌ను మన రాష్ట్రానికి ఎన్టీపీసీ సరఫరా చేస్తానన్నా దాన్ని తిరస్కరించి ఈరోజు విద్యుత్ కోతలకు కారణం అయ్యింది మీరు కాదా అని నిలదీశారు. 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు లేనివి ఉన్నట్లు చూపి ఇన్‌కం టాక్స్, కోల్ సెస్, డీఎంVఎఫ్‌టి చెల్లించి మోసం చేసింది నిజం కాదా అన్నారు. నిజంగా ఆ 40 ఆ లక్షల టన్నుల బొగ్గు ఉండి ఉంటే, ఈరోజు కరెంట్ కష్టాలు ఎందుకు ఉంటాయి అని అడిగారు. నదుల్లో నీళ్లు ఉన్నా మోటార్లు నడప నీళ్లు లిఫ్ట్ చేయక సాగు నీళ్లు అందించలేదు.. బొగ్గు నిల్వలు పెట్టుకోకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయక రైతులకు కరెంట్ సరఫరా చేయడం లేదు… మీ నిర్లక్ష్యం వల్ల సాగు నీటి కొరత, కరెంట్ కొరత వచ్చింది నిజం కాదా అని ఆయన అడిగారు. సింగరేణి సహా విద్యుత్ సంస్థలను ఐపీవో, కొత్త అప్పుల దిశగా తీసుకెళ్లేందుకు ఎనర్జీ రిఫార్మ్స్ కమిటీనీ ఏర్పాటు చేసి దానికి చైర్మHగా ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణ్యంను నియమించాలనే ప్రతిపాదన నిజమా కాదా అని నిలదీశారు. నెహ్రూ సోషలిజం పేరుతో ప్రభుత్వ రంగ స్థలం కాపాడుతున్నామని డబ్బా కొట్టుకున్న మీరు యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులంతా రోడ్డెక్కి ధర్నాలు చేసింది నిజం కాదా అన్నారు. కరెంట్ కోతలతో రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఈరోజు పత్రికా సమావేశంలో రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రెస్‌మీట్లు పెట్టి మాపై నిందలు వేసినంత మాత్రాన ప్రజల కరెంట్ కష్టాలు తీరవన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కరెంట్ కోతలు లేకుండా చూడాలని, ట్రూ అప్ చార్జీల పేరిట ప్రజలపై వేసిన భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే బీఆరఎస్ ప్రజా పోరాటానికి సిద్ధం అవుతుందని మరోసారి స్పష్టం చేస్తున్నామని హరీష్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





