బషీర్ బాగ్ చౌరస్తా జ్ఞాపకాలు

“హైదరాబాద్ రాజ్యానికి 1887 నుంచి 1894 దాకా ఏడు సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేసిన, యాబై ఐదేళ్లు మాత్రమే జీవించినప్పటికీ కనీసం ముప్పై ఏళ్లు హైదరాబాద్ రాజ్య చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఆస్మాన్ జా ను బషీరుద్దౌలా అని కూడా పిలిచేవారు. ఆయనకు హిజ్ ఎక్సలెన్సీ, అమీర్ ఎ పాయెగా, ఆజమ్ ఉల్ ఉమ్రా, అమీర్ ఎ అక్బర్, సర్ అని ఎన్నో బిరుదులుండేవి. ఆయన పూర్తి పేరు ముహమ్మద్ మజరుద్దీన్ ఖాన్ బహాదుర్ రిఫాత్ జంగ్. ఆయన ఒక పాయెగా ప్రభువు. అంటే ఆనాటి రాచరిక భూస్వామ్య నిచ్చెన మెట్ల వ్యవస్థలో రాజు తర్వాత రెండో స్థానం. ప్రభు వంశీకుడుగా మాత్రమే కాక, తన ప్రతిభ ద్వారా ఉన్నత స్థానాలకు ఎదిగాడని చరిత్ర చెపుతుంది…”

బషీర్ బాగ్ చౌరస్తాను శ్రీరామ్ చౌక్ అని పిలవాలని ఎవరో ఒకరు పిలుపు ఇచ్చారని వార్త చూడగానే నవ్వు వచ్చింది. అయితే ఇది కేవలం హాస్యాస్పదమైన విషయం కాదు. చరిత్ర మీద జరుగుతున్న దుర్మార్గమైన దాడిలో, కుట్రలో భాగమైన ఒక ఎత్తుగడ. మూడు నాలుగు రోజుల్లో ఆ విషయం తీవ్రమైన చర్చలోకి వచ్చి, సామాజిక మాధ్యమాలలో దుమారం రేపింది.

తర్వాత రెండు మూడు రోజుల్లోనే పోలీసులు ఆ శ్రీరాముడి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి, ఉద్రిక్తతను తగ్గించారు గాని, విష సర్పం ఇప్పటికి బుట్టలోకి పోయిందానే అనుకోవాలి తప్ప అంతమైందని అనుకోవడానికి వీలు లేదు. రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం, శాసనసభ ఎన్నికల కోసం తెలంగాణ సమాజాన్ని మత విభజనతో చీలదీసి మంటలు పెట్టదలచుకున్నవారి కోరికకు అంతు లేదు. మత సామరస్యాన్ని చెడగొడితేనే, ఒకరి మీదికి ఒకరిని రెచ్చగొడితేనే, రక్తపాతం సృష్టిస్తేనే తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయని అనుకునే శక్తులు ఇంకా పొంచి కూచున్నాయి. ఆ హిందుత్వ శక్తుల పన్నాగాలు ఇక్కడితో ఆగిపోవు.

అందువల్ల ఈ సమస్యను లోతుగా చర్చించవలసి ఉంది. సంబంధిత విషయాలన్నీ ఇప్పటివరకూ తెలియనివారికి తెలియజెప్పవలసి ఉంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరు వాడుకుని కొందరు రాజకీయ కుట్రదారులు ఏ దుస్సాహసానికి ఒడిగడుతున్నారో, ఏ హంతక ఉన్మాద చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారో అమాయక రామభక్తులకు కూడా చెప్పవలసి ఉంది. పిడికెడు మంది హిందూ మతోన్మాదులు చేస్తున్న ఈ దుర్మార్గ చర్యకు ప్రతిస్పందనగా అమాయక ముస్లిం ప్రజలలో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి పిడికెడు మంది ముస్లిం మతోన్మాదులు కూడా కాచుకుని కూచున్నారని హెచ్చరించవలసి ఉంది. అటు పిడికెడు మంది, ఇటు పిడికెడు మంది మతోన్మాదుల చర్యలకు నగర జీవితం అతలాకుతలం అవుతుందనీ, అనేక అమాయక ప్రాణాలు బలి అయిపోతాయనీ, ఆస్తి బుగ్గి అయిపోతుందనీ చెప్పవలసి ఉంది. ఇంతా చేసి, రెండు పక్కలా మంటలు ఎగసన దోసిన మతోన్మాదులు చివరికి క్షేమంగా, స్నేహంగా, వ్యాపారాలలో భాగస్వాములుగా ఉంటారనీ ప్రజలకు తెలియజెప్పవలసి ఉంది.

“1948 సైనిక చర్య తర్వాత, 1949 ఫిబ్రవరిలో జాగీర్ల రద్దు తర్వాత, బషీరుద్దౌలా వారసుల ఆదాయం తరిగిపోయి, భవనాల మరమ్మతులు కూడా లేక శిథిలం కావడం మొదలయింది. బషీరుద్దౌలా మనుమలు జహీర్ యార్ జంగ్, ఇతరులు మిగిలిపోయిన భవనాల్లో ఉంటూ వాటిని బాగు చేయించుకునే స్తోమత కూడా లేని స్థితిలో, 1963-64 నుంచి భవనం చుట్టూ ఉన్న విశాలమైన భూమిని అమ్ముకోవడం ప్రారంభించారు. సుప్రసిద్ధ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు బడే గులాం అలీ ఖాన్ తన చివరి రోజుల్లో జహీర్ యార్ జంగ్ అతిథిగా ఈ భవనంలోనే ఉంటూ 1968 ఏప్రిల్ లో మరణించారు. 1970 నాటికి భవనంలో మిగిలిన చివరి భాగం కూడా నేలమట్టమై, ఆ భూమి కూడా రియల్ ఎస్టేట్ అయిపోయింది..” 

దసరా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 19న బషీర్ బాగ్ చౌరస్తాలో కనక దుర్గ ఆలయం పక్కన ఒక భారీ శ్రీరాముడి విగ్రహం తీసుకొచ్చి పెట్టి, దాని ముందు నిలబడి విశ్వ హిందూ జాతీయ అధికార ప్రతినిధి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డా. రావినూతల శశిధర్ అన్న మాటలు ప్రస్తుత వివాదానికి మూలం. హైదరాబాదును తగులబెట్టడానికి అంటించిన నిప్పు. ఇప్పటి నుంచి ఈ చౌరస్తాను శ్రీరామ్ చౌక్ అని పిలవాలని, ఇక నుంచి బషీర్ బాగ్ అనే పేరు కాలగర్భంలో కలిసిపోవాలని ఆయన అన్నాడు. ఇక మెదడూ ఆలోచనా చరిత్ర అవగాహనా లేని, నోరు మాత్రమే ఉన్న చాల మంది హిందుత్వవాదులు, రాజకీయ నాయకులు తమ నోళ్లకు పని చెప్పారు.

బషీర్ ఎవడు, బషీర్ పేరు ఎందుకు, మా దేవుడి పేరు పెట్టుకుంటాం, శ్రీరామ్ చౌక్ అని పిలుస్తాం అని అరుపులూ పెడబొబ్బలూ ప్రారంభించారు. ఇది నిజానికి రాముడి మీద భక్తి కూడా కాదు, బషీర్ అనే ముస్లిం పేరు మీద గుడ్డి వ్యతిరేకత. ఇది నాలుగు వోట్లు సంపాదిస్తుందని నాయకుల పన్నాగమైతే, భక్తి ఉన్మాదంతో అమాయకంగా శివాలూగేవాళ్లు కొందరు. వాళ్లు ఊహించినట్టుగానే ముస్లిం రాజకీయ, మతవర్గ ప్రముఖుల నుంచి ఖండనలు కూడా ప్రారంభమయ్యాయి. సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా సాగిన ఈ ఘర్షణను ప్రభుత్వం త్వరగానే గుర్తించి అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసిందని అంగీకరించాలి. చరిత్రను చెరిపేయదలచుకున్న ఈ అజ్ఞాన మతోన్మాదుల కోసం కాకపోయినా, నిజంగానే ఆ బషీర్ బాగ్ అనే పేరు ఎందుకు వచ్చిందో, అది ఎట్లా హైదరాబాద్ చరిత్రలో అవిభాజ్యమైన భాగమో, చరిత్ర తెలియని అమాయకుల కోసం గుర్తు చేసుకోవాలి.

హైదరాబాద్ రాజ్యానికి 1887 నుంచి 1894 దాకా ఏడు సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేసిన, యాబై ఐదేళ్లు మాత్రమే జీవించినప్పటికీ కనీసం ముప్పై ఏళ్లు హైదరాబాద్ రాజ్య చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఆస్మాన్ జా ను బషీరుద్దౌలా అని కూడా పిలిచేవారు. ఆయనకు హిజ్ ఎక్సలెన్సీ, అమీర్ ఎ పాయెగా, ఆజమ్ ఉల్ ఉమ్రా, అమీర్ ఎ అక్బర్, సర్ అని ఎన్నో బిరుదులుండేవి. ఆయన పూర్తి పేరు ముహమ్మద్ మజరుద్దీన్ ఖాన్ బహాదుర్ రిఫాత్ జంగ్. ఆయన ఒక పాయెగా ప్రభువు. అంటే ఆనాటి రాచరిక భూస్వామ్య నిచ్చెన మెట్ల వ్యవస్థలో రాజు తర్వాత రెండో స్థానం. ప్రభు వంశీకుడుగా మాత్రమే కాక, తన ప్రతిభ ద్వారా ఉన్నత స్థానాలకు ఎదిగాడని చరిత్ర చెపుతుంది.

ఐదో నిజాం అఫ్జలుద్దౌలా తన కూతురిని ఇచ్చి అల్లుడిని చేసుకోవడంతో బషీరుద్దౌలా రాజకుటుంబ సభ్యుడయ్యాడు. 1869లో అఫ్జలుద్దౌలా చనిపోయేటప్పటికి ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ కు మూడు సంవత్సరాలే గనుక యువరాజుకు యుక్తవయసు వచ్చేవరకూ పాలించిన రాజప్రతినిధి మండలిలో బషీరుద్దౌలా సభ్యుడు. 1869లో, తన ముప్పయ్యవ ఏట న్యాయ శాఖ మంత్రిగా ప్రజా జీవితం ప్రారంభించాడు. 1887లో ప్రధాన మంత్రి అయ్యాడు. 1869 నుంచి 1898లో చనిపోయే దాకా ఎన్నో పదవుల్లో ఉన్నప్పటికీ ప్రజా ఖజానా నుంచి ఒక్క పైసా వేతనం తీసుకోకుండా పని చేశాడు.

“ఈ వ్యవహారం బషీర్ బాగ్ కనక దుర్గ ఆలయం అనబడే చోట ప్రారంభమయింది గనుక ఆ ఆలయం గురించి కూడా చెప్పుకోవాలి. 1982-84 మధ్య నిజాం పీజీ కాలేజీలో నేను ఎం ఎ చదువుతున్నప్పుడు బషీర్ బాగ్ చౌరస్తాలో ఆ మూల వరకూ మా కాలేజీ గోడ ఉండేది. మరొక మూల ఎంబసీ కేఫ్ అనే పెద్ద ఇరానీ హోటల్ ఉండేది. ఈ మూలన మా కాలేజీ గేటు లోపల వాచ్ మెన్ కోసం చిన్న గూడు పక్కన అటు ఒక బండ, ఇటు ఒక బండ, పైన ఒక బండ పెట్టిన చిన్న ఎల్లమ్మ ఉండేది. తెలంగాణ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉన్నట్టుగానే. పదేళ్లు తిరిగే సరికి మా కాలేజీ గోడ వెనక్కి పోయింది. ఎల్లమ్మ బండ, చిన్నపాటి గుడి అయింది. మరో పదేళ్లు గడిచేసరికి ఫ్లై ఓవర్ వచ్చి, ఆ గుడి మరింత పెద్దది అయింది. ఇంకో పదేళ్లకు అది ఒక సువిశాలమైన గుడి అయి, అక్కడి దేవత కూడా మారిపోయి కనకదుర్గ అయింది. హైదరాబాద్ లో చాలా మంది దేవతలకు రియల్ ఎస్టేట్ తో సన్నిహిత సంబంధం ఉన్నట్టుగానే ఇప్పుడు అది శ్రీరాముడి రియల్ ఎస్టేట్ కాబోతున్నది..”

ఆయన ప్రధాన మంత్రిత్వంలోనే విద్యారంగంతో సహా ఎన్నో రంగాలలో పాలనా సంస్కరణలు జరిగాయి. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ప్రభుత్వ నిధులతో ఉచిత వైద్య సహాయం అందించే కార్యక్రమం ఆయన పాలనలోనే మొదలయింది. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా క్రమబద్ధీకరించడం కోసం శాశ్వత బోర్డు ఆయన పాలనలోనే మొదలయింది. 1887లో లండన్ లో విక్టోరియా మహారాణి స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు, రాజు మహబూబ్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్య ప్రతినిధిగా పాల్గొనడానికి బషీరుద్దౌలాను పంపాడు. ఇంగ్లండ్ లో కూడా ఆయన ఎంతో మంది మన్ననలు చూరగొన్నాడని సమకాలీన కథనాలు చెపుతున్నాయి. లండన్ నుంచి తిరిగి రాగానే ఆయన ప్రధాన మంత్రి పదవిని స్వీకరించాడు.

బషీరుద్దౌలా నగరంలో 1880లో బషీర్ బాగ్ పాలెస్, 1885లో ఆస్మాన్ గడ్ పాలెస్, 1880-85 మధ్య ఖానా బాగ్, 1892లో మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ వంటి ఎన్నో నిర్మాణాలు చేశాడు. ఆయన 1880లో అప్పటి హైదరాబాద్ నగరానికి సుదూరంగా, హుసేన్ సాగర్ చెరువు కనబడేంత దూరంలో తన సొంత నివాస భవనం నిర్మించుకోవాలనుకున్నాడు. హసన్ బిన్ ముషిన్ అనే అరబ్ జమాదార్ కు చెందిన తోటను కొనుక్కుని తన విశాలమైన రాజప్రాసాదం నిర్మించుకున్నాడు. దాని పేరు బషీర్ బాగ్ పాలెస్ – బషీర్ ఉద్యానవనంలో రాజప్రాసాదం.

ఆ ఉద్యానవనం బహుశా ప్రస్తుత బషీర్ బాగ్ చౌరస్తా నుంచి ప్రస్తుత లిబర్టీ చౌరస్తాదాకా విస్తరించి ఉండేది. ఈ రాజప్రాసాదానికి సికిందరాబాద్ వైపు సింహద్వారం ఉండేదని, లోపల విశాలమైన పూలతోట, మధ్యలో ఒక పెద్ద రాతి ఫౌంటేన్, పాలరాతి వరండాలు, అతిథుల గదులు, ఖరీదైన అలంకరణలతో భోజనాల గదులు, బిలియర్డ్ ఆటకు ఒక ప్రత్యేకమైన గది, అనేక పడక గదులు ఉండేవని సమకాలిక కథనాలున్నాయి. ఆ భవనం పైన రెండో అంతస్తు గదుల్లో నుంచి హుసేన్ సాగర్ అందమైన దృశ్యం కనబడుతుండేదట. లోపల స్త్రీలు కూచోవడానికి ప్రత్యేక ఏర్పాట్లతో హోమ్ థియేటర్, ఈత కొలను, టర్కిష్ స్నానాల గదులు, టెన్నిస్ కోర్టులు, జపనీస్ తేనీటి గదులు వంటి హంగులతో ఆనాటికి నగరంలోని అత్యంత విలాసవంతమైన భవనాల్లో ఒకటని, “ఇటాలియన్ శైలి రాజ ప్రాసాదం” అని బ్రిటిష్ రచయిత జె డి రీస్ రాశాడని ఒమర్ ఖలీదీ తన ‘ఎ గైడ్ టు ఆర్కిటెక్చర్ ఇన్ హైదరాబాద్ దక్కన్, ఇండియా’ లో ఉటంకించాడు. బషీర్ బాగ్ పాలెస్ నిర్మాణానికి 1880లో నాలుగు లక్షల రూపాయలు ఖర్చయిందని ఆధారాలున్నాయి. ఇప్పటి విలువ చెప్పాలంటే అది ఇరవై ఒక్క కోట్ల రూపాయలు! బషీరుద్దౌలా బషీర్ బాగ్ పాలెస్ లోనే 1898లో చనిపోయాడు. పాయెగా సమాధుల్లో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు.

1948 సైనిక చర్య తర్వాత, 1949 ఫిబ్రవరిలో జాగీర్ల రద్దు తర్వాత, బషీరుద్దౌలా వారసుల ఆదాయం తరిగిపోయి, భవనాల మరమ్మతులు కూడా లేక శిథిలం కావడం మొదలయింది. బషీరుద్దౌలా మనుమలు జహీర్ యార్ జంగ్, ఇతరులు మిగిలిపోయిన భవనాల్లో ఉంటూ వాటిని బాగు చేయించుకునే స్తోమత కూడా లేని స్థితిలో, 1963-64 నుంచి భవనం చుట్టూ ఉన్న విశాలమైన భూమిని అమ్ముకోవడం ప్రారంభించారు. సుప్రసిద్ధ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు బడే గులాం అలీ ఖాన్ తన చివరి రోజుల్లో జహీర్ యార్ జంగ్ అతిథిగా ఈ భవనంలోనే ఉంటూ 1968 ఏప్రిల్ లో మరణించారు. 1970 నాటికి భవనంలో మిగిలిన చివరి భాగం కూడా నేలమట్టమై, ఆ భూమి కూడా రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఆ విశాల ప్రాంగణంలో ఒక మూలకు ఉండిన అతిథి గృహం 1930లలో సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిగి, ప్రభుత్వ భవనంగా ఉండి, 1950లలో ఆంధ్ర పత్రిక కార్యాలయంగా, 2006లో లోకాయుక్త కార్యాలయంగా మారింది. ఆ ప్రాంగణంలోని ఒక భవనం గాంధీ మెడికల్ కాలేజీగా మారి, ఆ తర్వాత మన ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రైవేటు వ్యక్తుల పరం అయిపోయింది. బషీరుద్దౌలా మరణించి నూట ఇరవై ఏళ్లు గడిచినా, ఆయన నిర్మించిన మహా భవనం నేలమట్టమైపోయి యాబై ఏళ్లు గడిచినా ఆ ప్రాంతానికి బషీర్ బాగ్ అనే పేరు మారలేదు. అది మన చరిత్ర. మన వారసత్వం.

ఈ వ్యవహారం బషీర్ బాగ్ కనక దుర్గ ఆలయం అనబడే చోట ప్రారంభమయింది గనుక ఆ ఆలయం గురించి కూడా చెప్పుకోవాలి. 1982-84 మధ్య నిజాం పీజీ కాలేజీలో నేను ఎం ఎ చదువుతున్నప్పుడు బషీర్ బాగ్ చౌరస్తాలో ఆ మూల వరకూ మా కాలేజీ గోడ ఉండేది. మరొక మూల ఎంబసీ కేఫ్ అనే పెద్ద ఇరానీ హోటల్ ఉండేది. ఈ మూలన మా కాలేజీ గేటు లోపల వాచ్ మెన్ కోసం చిన్న గూడు పక్కన అటు ఒక బండ, ఇటు ఒక బండ, పైన ఒక బండ పెట్టిన చిన్న ఎల్లమ్మ ఉండేది. తెలంగాణ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉన్నట్టుగానే. పదేళ్లు తిరిగే సరికి మా కాలేజీ గోడ వెనక్కి పోయింది. ఎల్లమ్మ బండ, చిన్నపాటి గుడి అయింది. మరో పదేళ్లు గడిచేసరికి ఫ్లై ఓవర్ వచ్చి, ఆ గుడి మరింత పెద్దది అయింది. ఇంకో పదేళ్లకు అది ఒక సువిశాలమైన గుడి అయి, అక్కడి దేవత కూడా మారిపోయి కనకదుర్గ అయింది. హైదరాబాద్ లో చాలా మంది దేవతలకు రియల్ ఎస్టేట్ తో సన్నిహిత సంబంధం ఉన్నట్టుగానే ఇప్పుడు అది శ్రీరాముడి రియల్ ఎస్టేట్ కాబోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *