మరొకసారి ఆర్భాటం, మరొకసారి అబద్ధం!

“గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 75 ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారు. ఒప్పందం కుదిరిందని ప్రకటించిన రోజున ఆ కంపెనీ, ఆ పెట్టుబడులు వచ్చేసినట్టుగానే ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కాని ఒప్పందం ఉద్దేశ ప్రకటన మాత్రమే. ఆ కంపెనీలు అదే ఉద్దేశాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ కూడా ప్రకటిస్తాయి. ఆయా రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు ఇవ్వజూపే భూమి, విద్యుత్తు, నీరు, పన్ను మినహాయింపులు, రాయితీలను బట్టి, తమ లాభాలనుబట్టి ఎక్కడ పరిశ్రమ స్థాపించాలో చిట్టచివృకి తేల్చుకుంటాయి. అందువల్ల ఒక సమ్మిట్ అయిపోగానే చేసే ప్రకటనను నమ్మడానికి వీలు లేదు…”

ఏడాది కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహా ఆర్భాటంగా వందల కోట్ల రూపాయల ఖర్చుతో నడిపిన గ్లోబల్ సమ్మిట్ అనే గారడీ మీద, తెలంగాణ రైజింగ్ అనే పగటి కల మీద ఈ శీర్షిక కిందనే ‘అవే ప్రగల్భాలు, అవే అబద్ధాలు’ అని వ్యాఖ్యానించాను. కాల చక్రం ఏడాది తిరిగింది. మళ్లీ ఈ ఏడాది డిసెంబర్ 7-9 మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ పేరుతో భారత్ ఫ్యూచర్ సిటీలో మరొక సర్కస్ జరపబోతున్నది. ఈ మూడు రోజుల మేలాకు 550 దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించామనీ, దాదాపు 100 ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు పాల్గొంటాయని, 52 విభాగాలుగా ప్రదర్శన జరుగుతుందనీ, 25 ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు ఉంటాయనీ, భారీ ఏర్పాట్ల గురించి ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటున్నది. గత సంవత్సరం ఒక్క హాలులో జరిగిన ప్రదర్శన ఈసారి ఆరు హాళ్లలో జరుగుతుందంటున్నారు.

ప్రభుత్వం ప్రకటించే ప్రతి ప్రగల్భాన్నీ మారు మాట లేకుండా, పరీక్ష లేకుండా, ధృవీకరణ లేకుండా అది శిలాక్షరమైన వాస్తవం అన్నట్టు చిలకపలుకుల్లా వల్లె వేయడం మన పత్రికలకూ, ఛానళ్లకూ అలవాటయిపోయింది. ఈ భారీ అంకెలు చూసి మురిసిపోవడం, కుడుమంటే పండుగ అన్నట్టుగా అవే నిజాలని భ్రమల్లో బతకడం మధ్యతరగతికి మామూలైపోయింది. ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇటువంటి అబద్ధాలను చూస్తూ, వ్యాఖ్యానిస్తూ, విమర్శిస్తున్న పత్రికా రచయితగా గత సంవత్సరం నా వ్యాసంలో ఒక ప్రశ్న వేశాను. ఇరవై ఏడేళ్ల కింద చంద్రబాబు నాయుడు విజన్ 2020 పేరుతో ప్రారంభించిన ఈ భారీ కలల అమ్మకంలో ప్రకటించిన అంకెలలో పదో వంతు కూడా వాస్తవంగా మారలేదు. ఏదైనా ఒక పత్రిక, ఒక ఛానల్ ప్రభుత్వం ప్రకటించిన అంకెలను యథాతథంగా పునరుక్తి చేయడంతో పాటు, ఏడాది తర్వాతనో, రెండేళ్ల తర్వాతనో, ఐదేళ్ల తర్వాతనో ఆ అంకెల్లో ఎన్ని వాస్తవ రూపం ధరించాయో పరీక్షించి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత పాటిస్తాయా అని అడిగాను.

నాకు తెలిసినంతవరకు ఒక్కసారి కూడా అటువంటి పరీక్ష జరిగినట్టు లేదు. గత సంవత్సరం ఆ ప్రశ్న అడిగాను గనుక, ఇప్పుడు 2025 గ్లోబల్ సమ్మిట్ లో చేసిన ప్రకటనలు ఏడాది తర్వాత ఎక్కడ ఉన్నాయో, ఎన్ని వాస్తవరూపం ధరించాయో పరిశీలిద్దాం. గత సంవత్సరపు అంకెలు ఎంత నిజమయ్యాయో చూడకుండా మళ్లీ ఈ సంవత్సరపు అంకెలను నమ్మడం, యథాతథంగా ప్రచారం చేయడం సరైనది కాదు. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 75 ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారు. ఒప్పందం కుదిరిందని ప్రకటించిన రోజున ఆ కంపెనీ, ఆ పెట్టుబడులు వచ్చేసినట్టుగానే ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కాని ఒప్పందం ఉద్దేశ ప్రకటన మాత్రమే. ఆ కంపెనీలు అదే ఉద్దేశాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ కూడా ప్రకటిస్తాయి. ఆయా రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు ఇవ్వజూపే భూమి, విద్యుత్తు, నీరు, పన్ను మినహాయింపులు, రాయితీలను బట్టి, తమ లాభాలనుబట్టి ఎక్కడ పరిశ్రమ స్థాపించాలో చిట్టచివృకి తేల్చుకుంటాయి. అందువల్ల ఒక సమ్మిట్ అయిపోగానే చేసే ప్రకటనను నమ్మడానికి వీలు లేదు.

“2025 గ్లోబల్ సమ్మిట్ లో కుదిరిన ఒప్పందాల అమలును సమగ్రంగా సమీక్షించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక ప్రత్యేక బృందాన్ని 2026 ఆగస్ట్ 26న నియమించారని పత్రికల్లో ఒక వార్త వచ్చింది. అదే విషయం మళ్లీ మాట్లాడారని సెప్టెంబర్ 23న మరొక వార్త వచ్చింది. కాని ఆ సమీక్షా బృందంలో సభ్యులెవరో, ఆ బృందం ఏమి తేల్చిందో, ఆ బృందం ఇచ్చిన నివేదిక ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ వివరాలు తేలకుండానే, మూడు నెలలు గడిచి, మరొక మేలాకు మళ్లీ ఒకసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజాధనం ఖర్చు చేస్తూ, రాష్ట్ర వనరులను ఇవ్వజూపుతూ జరుగుతున్న ఈ ప్రయత్నాలు పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం లేదు..”

తొమ్మిది నెలల తర్వాత 2026 సెప్టెంబర్ 11న రాష్ట్ర శాసన సభలో స్వయంగా పరిశ్రమల మంత్రి డి శ్రీధర్ బాబు చేసిన ప్రకటన ప్రకారం ఆ 75 ఎంఓయు లలో 17 మాత్రమే అమలు అయ్యే దిశలో ఉన్నాయి. చేసిన వాగ్దానంలో అది 22 శాతం. అది కంపెనీల, ఒప్పందాల సంఖ్యలో మాత్రమే. పెట్టుబడుల పరిమాణంలో కాదు. అప్పుడే మొత్తం కుదిరిన ఒప్పందాలతో రాష్టంలోకి రు. 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రవహిస్తాయని అన్నారు. అంతకు ముందు 2024-25 దావోస్ లో కుదిరిన ఒప్పందాలతో రు. 2.19 లక్షల కోట్లు వస్తాయన్నారు. అందులో ఎంత భాగం వచ్చాయో ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. అలాగే 2025 సమ్మిట్ ప్రకటనలో ఎంత వచ్చాయో కూడా ఎక్కడా లేదు. ఎంఓయులలో 22 శాతం వాస్తవరూపం ధరించే దిశలో ఉన్నాయంటే, పెట్టుబడులలో కూడా 20-22 శాతం నిజమై ఉంటాయని ఎవరైనా అనుకోవచ్చు. కాని, అంతకూడ రాలేదని, ఆ 17లో 14 కంపెనీల పెట్టుబడి కేవలం రు. 30,230 కోట్లు మాత్రమేనని 2026 ఏప్రిల్ లో ఒక పత్రిక రాసింది. అంటే చెప్పినదానిలో పది శాతం కూడా నిజం కాలేదన్నమాట. ఈ పెట్టుబడులు వస్తే, అవి రాష్ట్రంలో పరిశ్రమలో, వ్యాపారాలో ప్రారంభిస్తే ఎంత ఉద్యోగ కల్పన జరుగుతుందో, ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అప్పుడూ కచ్చితంగా ఎవరూ చెప్పలేదు. కనుక ఇప్పుడు అందులో ఎంత భాగం నిజమయిందో ఎవరమూ చెప్పలేం.

2025 గ్లోబల్ సమ్మిట్ లో కుదిరిన ఒప్పందాల అమలును సమగ్రంగా సమీక్షించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక ప్రత్యేక బృందాన్ని 2026 ఆగస్ట్ 26న నియమించారని పత్రికల్లో ఒక వార్త వచ్చింది. అదే విషయం మళ్లీ మాట్లాడారని సెప్టెంబర్ 23న మరొక వార్త వచ్చింది. కాని ఆ సమీక్షా బృందంలో సభ్యులెవరో, ఆ బృందం ఏమి తేల్చిందో, ఆ బృందం ఇచ్చిన నివేదిక ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ వివరాలు తేలకుండానే, మూడు నెలలు గడిచి, మరొక మేలాకు మళ్లీ ఒకసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజాధనం ఖర్చు చేస్తూ, రాష్ట్ర వనరులను ఇవ్వజూపుతూ జరుగుతున్న ఈ ప్రయత్నాలు పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం లేదు.

విడివిడిగా చూస్తే, 2025 డిసెంబర్ ప్రగల్భాలలో బ్రూక్ ఫీల్డ్ ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ రు. 75,000 కోట్లు, ఇన్ఫ్రాకీ డాటా సెంటర్ పార్క్స్ రు. 70,000 కోట్లు, ఎజిఐడిసి, సింగపూర్ రు. 67,500 కోట్లు, జెసికె ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రు. 9,000 కోట్లు, జెన్ టెక్నాలజీస్ రు. 5,000 కోట్లు, బయోలాజికల్ ఇవాన్స్ రు. 4,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. అంటే ఈ ఆరు కంపెనీల ద్వారానే, మొత్తం వస్తాయని ప్రకటించిన పెట్టుబడులలో అత్యధిక శాతం, రు. 2,30,500 కోట్లు వస్తాయని వాగ్దానం చేశారు. ఈ అంకెలైతే ప్రకటించారు గాని అవి ఏడాది లోనా, రెండేళ్లలోనా, ఐదేళ్లలోనా వివరాలు లేవు. ఏడాది గడిచిపోయిన తర్వాత వీటిలో ఒక్కటి కూడా వచ్చిన దాఖలా లేదు. గత సంవత్సరం వాగ్దానాల్లో ఒక ఎథనాల్ కంపెనీ రు. 10,000 కోట్ల పెట్టుబడితో, 35,000 ఉద్యోగాలు కల్పించనున్నదని ఒక ప్రకటన వచ్చింది. పదకొండు నెలలు గడిచిపోయాయి. ఈ ఇథనాల్ ప్రాజెక్టు ఎక్కడ వస్తున్నదో, ఎంత భూమి కేటాయించారో, భూసేకరణ జరిగిందో లేదో, ఆ కంపెనీ పర్యావరణ అనుమతులు సంపాదించిందో లేదో, పెట్టుబడుల సేకరించిందో లేదో, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయోలేదో, నిజంగా ఆ ప్రాజెక్టు వస్తే అది ఎంత కాలుష్యకారకమవుతుందో – ఏ ఒక్క ప్రశ్నకూ జవాబు లేదు.

“2026 సమ్మిట్ ఏర్పాట్లు జరపబోయే ముందు 2025 సమ్మిట్ లో మొత్తం కుదిరిన ఒప్పందాలు ఎన్ని, అందులో వాస్తవరూపం ధరించినవెన్ని, వస్తుందన్న పెట్టుబడి ఎంత, అందులో వచ్చినదెంత, కల్పిస్తామన్న ఉద్యోగాల సంఖ్య ఎంత, నిజంగా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, అమలులోకి వచ్చిన కంపెనీలకు ఎంతెంత భూమి ఎక్కడ కేటాయించారు, ఆ కంపెనీలు ఎంత ఖర్చు పెట్టాయి, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, కంపెనీ నిర్మాణ పనులు, ఉత్పత్తి మొదలయ్యాయా, మొత్తంగా గత సమ్మిట్ నిర్వహణకు ప్రభుత్వం భరించిన ఖర్చు ఎంత, ఆ ఖర్చుకు టెండర్లు, కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే బైటపెడతారా, సమ్మిట్ లో కుదిరిన ఒప్పందాల ఫలితంగా రాష్ట్రంలోకి వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం విద్యుత్తు, నీరు, మౌలిక సౌకర్యాల కల్పనకు ఎంత ఖర్చు పెట్టింది, సాలీనా ఎంత ఖర్చు పెట్టబోతుంది, ఆ కంపెనీలకు ప్రభుత్వం ఏ ప్రోత్సాహకాలు ఇచ్చింది, ఎన్ని పన్ను రాయితీలు ఇచ్చింది, ఈ ప్రోత్సాహకాలతో, రాయితీలతో ప్రభుత్వ రాబడిలో ఎంత తగ్గుతుంది వంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు ప్రజల ముందు పారదర్శకంగా పెట్టడం ప్రభుత్వ బాధ్యత..”

అలాగే గత సంవత్సర ప్రకటనల్లో అతిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ అనే బయోగ్యాస్ కంపెనీ రు. 4,000 కోట్ల పెట్టుబడితో, రాష్ట్రవ్యాప్తంగా 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు స్థాపించి, 9,000 ఉద్యోగాలు కల్పించనున్నదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2026 జనవరిలో మొదటి ప్లాంట్ ప్రారంభం అవుతుందని, 15 నెలల్లో మొత్తం ప్లాంట్లు మొదలవుతాయని అన్నారు. అది ఏమైనా ముందుకు కదిలిందో లేదో, గ్యాస్ కంపెనీ కబురు గ్యాసేనో నిజమో ఎవరికీ తెలియదు.

2026 సమ్మిట్ ఏర్పాట్లు జరపబోయే ముందు 2025 సమ్మిట్ లో మొత్తం కుదిరిన ఒప్పందాలు ఎన్ని, అందులో వాస్తవరూపం ధరించినవెన్ని, వస్తుందన్న పెట్టుబడి ఎంత, అందులో వచ్చినదెంత, కల్పిస్తామన్న ఉద్యోగాల సంఖ్య ఎంత, నిజంగా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, అమలులోకి వచ్చిన కంపెనీలకు ఎంతెంత భూమి ఎక్కడ కేటాయించారు, ఆ కంపెనీలు ఎంత ఖర్చు పెట్టాయి, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, కంపెనీ నిర్మాణ పనులు, ఉత్పత్తి మొదలయ్యాయా, మొత్తంగా గత సమ్మిట్ నిర్వహణకు ప్రభుత్వం భరించిన ఖర్చు ఎంత, ఆ ఖర్చుకు టెండర్లు, కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే బైటపెడతారా, సమ్మిట్ లో కుదిరిన ఒప్పందాల ఫలితంగా రాష్ట్రంలోకి వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం విద్యుత్తు, నీరు, మౌలిక సౌకర్యాల కల్పనకు ఎంత ఖర్చు పెట్టింది, సాలీనా ఎంత ఖర్చు పెట్టబోతుంది, ఆ కంపెనీలకు ప్రభుత్వం ఏ ప్రోత్సాహకాలు ఇచ్చింది, ఎన్ని పన్ను రాయితీలు ఇచ్చింది, ఈ ప్రోత్సాహకాలతో, రాయితీలతో ప్రభుత్వ రాబడిలో ఎంత తగ్గుతుంది వంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు ప్రజల ముందు పారదర్శకంగా పెట్టడం ప్రభుత్వ బాధ్యత.

ఇది కేవలం ప్రభుత్వానికీ, ఆ ప్రైవేట్, కార్పొరేట్, బహుళజాతి కంపెనీలకూ మధ్య వ్యవహారం మాత్రమే కాదు. ఇందులో ప్రజల వనరులు, భూమి, ఖనిజ వనరులు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జరిగే వ్యయం కూడా ఉంటాయి గనుక ఇవన్నీ ప్రజలు తెలుసుకోవలసి ఉంది. ఈ ప్రాజెక్టులకు ఎంత భూమి, ఎక్కడ కేటాయిస్తున్నారు, ఆ కంపెనీల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయా, ఇప్పటికీ ఎంత పెట్టుబడి వచ్చింది, ఆ కంపెనీ ఉత్పత్తి, వ్యాపారం ఎప్పుడు మొదలు పెడుతుంది, ఆ కంపెనీ రాక వల్ల రాష్ట్రంలో ఎంత మందికి ఉద్యోగాలు దొరికాయి, ప్రత్యక్ష ఉద్యోగ కల్పన ఎంత, పరోక్ష ఉద్యోగ కల్పన ఎంత వంటి ప్రశ్నలకు జవాబులు తప్పనిసరిగా అందరూ తెలుసుకోవలసినవే.

వందలాది కంపెనీల, వేలాది మంది ప్రతినిధులతో, ఐదు నక్షత్రాల విలాస సౌకర్యాలతో జరిగే ఈ మహా ప్రదర్శనలకు ఎంత ఖర్చవుతున్నదో ఎక్కడా లెక్క లేదు. గత సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ కు ఎంత ఖర్చయిందో ప్రభుత్వం పారదర్శకంగా ఎక్కడా ప్రకటించలేదు. కనీస పక్షం కొన్ని వందలకోట్లు ఖర్చు అయి ఉంటుంది. ప్రజాధనాన్ని అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినప్పుడు, ఆ వివరాలు ప్రజల ముందు పెట్టడం ప్రభుత్వ బాధ్యత. చాలా ఆర్భాటంగా, చాలా వాగ్దానాలతో ఒక భారీ మేలా జరిపి, ఏడాది తర్వాత ఆ వాగ్దానాల్లో ఏవి అమలయ్యాయో, ఏవి కాలేదో, ఎందుకు కాలేదో ప్రజల ముందు పారదర్శకమైన నివేదిక పెట్టకుండా, మరింత ఆర్భాటంగా, మరిన్ని వాగ్దానాలతో మరొక భారీ మేలా జరపడం ఎందుకు? ఎవరిని మాయ చెయ్యడానికి? పైగా ఎల్ నినో ప్రభావం, వర్షాభావం, ముసురుకుంటున్న కరువు భయానక ఊహాగానాల మధ్య, మింగ మెతుకు లేని స్థితిలో ఈ మీసాలకు సంపెంగ నూనెలు దిద్దుకునే ఆర్భాటాలు ఎందుకు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *