“మా పాలనలో కరెంట్ కోతలు లేవు, విద్యుత్ రంగాన్ని పటిష్టం చేశాం, ప్రజలపై పైసా భారం వేయం అని వేదికలెక్కి గొప్పలు చెప్పుకునే పాలకులు, ఆ ప్రకటనల వెనుక దాగి ఉన్న వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటును మాత్రం నిశ్శబ్దంగా ప్రజల బాధ్యతగా మార్చడం ఏ రకమైన సామాజిక న్యాయం? రాష్ట్రాన్ని ఏలే పాలకుల పేర్లు మారినా, అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు మారినా, అంతిమంగా నష్టపోయేది, ఆర్థికంగా నడుము విరిగేది మాత్రం సగటు పౌరుడే అనడానికి ఈ ట్రూ-అప్ నిర్ణయం మరొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది..”

సీనియర్ జర్నలిస్ట్ 9848559863
తెలంగాణ సమాజం ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో, నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు నెలాఖరు వచ్చేసరికి తమ కుటుంబ బడ్జెట్ సర్దుబాటు కాక అల్లాడిపోతున్న తరుణంలో, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తీసుకున్న నిర్ణయం వారి నెత్తిన కోలుకోలేని పిడుగులా పడింది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సమర్పించిన అదనపు భారాల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం తెలుపుతూ, వచ్చే నవంబర్ నెల నుంచి ‘ట్రూ-అప్’ ఛార్జీల పేరిట వేల కోట్ల రూపాయలను వసూలు చేయడానికి పచ్చజెండా ఊపడం ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక చర్య. ప్రజాక్షేమాన్ని పూర్తిగా పక్కనబెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థల నిర్వహణ లోపాలను, గతంలో జరిగిన అస్తవ్యస్త నిర్ణయాలను సర్దుబాటు చేసేందుకు సామాన్యుడి జేబులు ఖాలీ చేయాలని చూడటం పాలకుల తీవ్ర బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ.
మా పాలనలో కరెంట్ కోతలు లేవు, విద్యుత్ రంగాన్ని పటిష్టం చేశాం, ప్రజలపై పైసా భారం వేయం అని వేదికలెక్కి గొప్పలు చెప్పుకునే పాలకులు, ఆ ప్రకటనల వెనుక దాగి ఉన్న వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటును మాత్రం నిశ్శబ్దంగా ప్రజల బాధ్యతగా మార్చడం ఏ రకమైన సామాజిక న్యాయం? రాష్ట్రాన్ని ఏలే పాలకుల పేర్లు మారినా, అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు మారినా, అంతిమంగా నష్టపోయేది, ఆర్థికంగా నడుము విరిగేది మాత్రం సగటు పౌరుడే అనడానికి ఈ ట్రూ-అప్ నిర్ణయం మరొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.
అసలు ఏమిటీ ‘ట్రూ-అప్’ ఛార్జీలు?
సాధారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తాము విద్యుత్ కొనుగోలు చేయడానికి, సరఫరా చేయడానికి ఎంత ఖర్చవుతుందో ఒక అంచనా వేసి ఈఆర్సీకి నివేదిస్తాయి. ఆ అంచనాల ఆధారంగానే మనకు నెలవారీ కరెంట్ బిల్లుల రేట్లను ఖరారు చేస్తారు. అయితే, ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక అంతర్జాతీయంగా బొగ్గు, ఇంధన ధరలు పెరగడం వల్లనో, లేదా కొరత సమయంలో బహిరంగ మార్కెట్లో డిస్కంలు అత్యధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్లనో వాస్తవ వ్యయం పెరిగిపోతుంది.
ఇలా ప్రారంభంలో వేసిన ‘అంచనా వ్యయానికి’, సంవత్సరం చివరలో అయిన ‘వాస్తవ ఖర్చుకు’ మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసాన్ని లేదా లోటును భర్తీ చేసుకోవడమే ఈ ‘ట్రూ-అప్’ పద్ధతి. సరళంగా చెప్పాలంటే, గతంలో విద్యుత్ సంస్థలకు జరిగిన నష్టాలను లేదా అదనపు వ్యయాన్ని ఇప్పుడు వినియోగదారుల బిల్లుల్లో ‘ట్రూ-అప్ ఛార్జీలు’ లేదా ఇంధన సర్దుబాటు రుసుము పేరిట వెనక్కి వసూలు చేస్తారు. సంస్థల నిర్లక్ష్యం వల్ల వచ్చిన నష్టాలను సైతం ఈ పేరుతో ప్రజలపై నెట్టడమే ఇక్కడ ప్రధాన సమస్య.
5,420 కోట్ల రూపాయల భారం..ఇది సర్దుబాటా? లేక చట్టబద్ధమైన దోపిడీయా?
విద్యుత్ పంపిణీ సంస్థల లెక్కల ప్రకారం మొత్తం ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలకు పైగా ట్రూ-అప్ వ్యయాలు ఉన్నాయని చూపించారు. అందులో ఉచిత విద్యుత్ పొందుతున్న వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇచ్చి, ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించినప్పటికీ, మిగిలిన ఐదు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల పీడక భారాన్ని గృహ, వాణిజ్య, మరియు చిన్న తరహా పారిశ్రామిక వినియోగదారులపై మోపడం శోచనీయం. నవంబర్ నెలలో యూనిట్‌కు ముప్పై పైసలు, ఆ తర్వాతి డిసెంబర్ నుంచి యూనిట్‌కు యాభై పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తామని అధికారులు చెబుతున్న మాటలు వినడానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు. కానీ, వేసవి కాలంలో లేదా సాధారణ గృహ వినియోగంలో నెలకు వందల యూనిట్లు వాడే సగటు కుటుంబానికి, చిన్న వ్యాపారస్తుడికి ఇది ప్రతినెలా వందల రూపాయల అదనపు భారాన్ని తెచ్చిపెడుతుంది.
మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే, ఈ అదనపు వసూళ్లు ఏదో ఒకటి రెండు నెలలతో ముగిసిపోయేవి కావు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టి జి ఎస్ పి డి సి ఎల్) పరిధిలో ఏకంగా ఇరవై తొమ్మిది నెలల పాటు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఇరవై ఆరు నెలల పాటు ఈ వసూళ్ల పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంటే రాబోయే రెండేళ్లకు పైగా తెలంగాణ పౌరులు ప్రతి నెలా తమ కరెంట్ బిల్లుల రూపంలో ఈ అదనపు దెబ్బను భరించక తప్పదు. ఇది కేవలం కరెంట్ ఛార్జీల పెంపు మాత్రమే కాదు, సామాన్యుడి సగటు నెలవారీ జీవిత బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీసే కుట్ర.
ప్రభుత్వాలు మారినా మారని తీరు..మాటలకూ చేతలకూ పొంతనేది?
ఎన్నికల ప్రచార సమయాల్లో, బహిరంగ సభల్లో వేదికలపై నిలబడి మా ప్రభుత్వం వస్తే ఉచితాలు ఇస్తాం, ఛార్జీలు పెంచం, సామాన్యుడిని ఆదుకుంటాం, సంక్షేమ రాజ్యాన్ని తెస్తాం అని హామీలు గుప్పించడం పాలకులకు అలవాటుగా మారింది. కానీ అధికార పీఠం ఎక్కిన తర్వాత మాత్రం అవే హామీలను నీళ్లలో కలిపేసి, నిర్వహణ వ్యయం పెరిగింది, ఇంధన కొనుగోలు లోటు ఏర్పడింది అంటూ సాంకేతిక కారణాలు, సంక్లిష్టమైన ఆర్థిక లెక్కలు చెబుతూ ప్రజల నెత్తిన భారాలు మోపడం ఏ రకమైన పాలనా విధానం? గతంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేయడం, సంస్థల్లో పేరుకుపోయిన అవినీతి, నిర్వహణ లోపాలు మరియు అపారమైన ప్రసార పంపిణీ నష్టాల ఫలితమే ఈ రోజు పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న వేల కోట్ల లోటు. అధికారులు, పాలకులు చేసిన తప్పులకు, వారి అపసవ్య వ్యూహాలకు శిక్షను సామాన్య ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బుల నుండి ఎందుకు చెల్లించాలి? అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలను బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసం?
పరిశ్రమలు, వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం
ఇప్పటికే అధిక విద్యుత్ ఛార్జీలు, ముడిసరుకుల ధరలు, స్థానిక పన్నులతో సతమతమవుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, చిన్న వ్యాపారస్తులు ఈ అదనపు భారాన్ని తట్టుకోవడం అత్యంత కష్టం. పరిశ్రమలపై విద్యుత్ భారం పెరిగితే అంతిమంగా ఉత్పత్తుల తయారీ వ్యయం పెరుగుతుంది. దానివల్ల మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగి, ఇతర రాష్ట్రాల ఉత్పత్తులతో పోటీపడలేక స్థానిక పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికుల ఉపాధి అవకాశాలపై దెబ్బకొడుతుంది. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుంటే, మరోవైపు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తాయి.
ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలి!
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సామాన్యుడిపై పడుతున్న వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి లేదా ఆ భారాన్ని బడ్జెట్ కేటాయింపుల ద్వారా సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరించాలి. పంపిణీ సంస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమర్థవంతమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. విద్యుత్ దొంగతనాలకు చెక్ పెట్టి పంపిణీ నష్టాలను తగ్గించడం, తక్కువ ఖర్చుతో కూడిన సౌర మరియు పవన విద్యుత్ కొనుగోళ్లను ప్రోత్సహించడం, సంస్థల నిర్వహణలో జరుగుతున్న అనవసర వ్యయాలను, అక్రమాలను అరికట్టి పారదర్శకత తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలి. వోట్లు వేసి గెలిపించిన ప్రజలను నిరంతరం నిలువుదోపిడీ చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు శుభపరిణామం కాదు. నవంబర్ నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఈ ట్రూ-అప్ ఛార్జీల నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలి. లేనిపక్షంలో, ఈ కరెంట్ ఛార్జీల సెగ ప్రభుత్వ భవిష్యత్తుకే తీవ్ర విఘాతం కలిగిస్తుందనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి.





