“అబద్ధ కథనాల ద్వారా లేత మనసులలో విషబీజాలు నాటే శాఖలూ సరస్వతీ శిశుమందిర్ లూ నడపడం సంఘ్ పరివార్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆ కళలో నిష్ణాతులు గనుకనే దశాబ్దాల పాటు ఆ కృషి చేసి, దాని ద్వారా అధికారానికి వచ్చి, ఆ తర్వాత చేతికి అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని, దేశవ్యాప్త ఐటీ సెల్స్ స్థాపించారు. ఒక అబద్ధానికి రెండు రూపాయల కూలీ పథకం కింద వేలాది మందికి ఉద్యోగం కల్పించిన చరిత్ర సంఘ్ పరివార్ ది. వాళ్లు “అబద్ధ కథనాలు” అనే ఆరోపణను ఇతరుల మీదికి విసరడమే ఆశ్చర్యం. అందరూ తమలాంటి వారే అనుకుంటారేమో!..”
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం నాడు కొన్ని గంటలు హైదరాబాద్ లో గడిపాడు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన, కాకతీయ హోటల్ లో ప్రముఖులతో విందు అలా ఉంచి, ఆయన పాల్గొన్న అతి ముఖ్యమైన కార్యక్రమాలు – బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’, యాత్ర చివరన జరిగిన సభ. ఈ కార్యక్రమాలు అమిత్ షాకూ, భారతీయ జనతా పార్టీకీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూ స్వాభావికమైన పచ్చి అబద్ధాలతో, తలకిందుల తర్కంతో, తెంపరితనంతో జరిగాయి.
‘ప్రజాస్వామ్యం ఈ దేశానికి పనికి రాదు’ అని స్పష్టంగా రాసిన గోల్వాల్కర్ శిష్యులుగా నరేంద్ర మోదీకీ, అమిత్ షా కూ ప్రజాస్వామ్యం అనే మాటే గిట్టదు. వారికది అధికారంలోకి రావడానికి ఉపయోగించే సాధనం మాత్రమే. ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అక్రమాల మీద సెప్టెంబర్ 23 ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కథనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనల, న్యాయమైన ఆందోళనల నేపథ్యంలో సంఘ్ పరివార్ కు హఠాత్తుగా “ప్రజాస్వామ్యం” గుర్తుకొచ్చింది. జవాబుదారీతనం కావాలనే ఆకాంక్ష “అరాచకం”గా కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చాతో కలిసి ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం, అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో ఉద్యమం చేపట్టింది. ఈ హాస్యాస్పద, తలకిందుల కార్యక్రమాన్ని అక్టోబర్ 25 నుంచి నవంబర్ 30 దాకా జరుపుతారట. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఈ కార్యక్రమం ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. అబద్ధ కథనాలను, రాజకీయ అస్థిరతను, ఎన్నికల కమిషన్ తో సహా రాజ్యాంగ వ్యవస్థలను అప్రతిష్ఠ పాలు చేసే ప్రతిపక్ష ప్రయత్నాలను వ్యతిరేకించడం ఈ కార్యక్రమ లక్ష్యమట!
ఈ లక్ష్యాలు సంఘ్ పరివార్ నోట రావడం హాస్యాలలోకెల్లా హాస్యాస్పదమైన విషయం. ఆ మూడిటికీ వారే పెట్టింది పేరు! అబద్ధ కథనాల ద్వారా లేత మనసులలో విషబీజాలు నాటే శాఖలూ సరస్వతీ శిశుమందిర్ లూ నడపడం సంఘ్ పరివార్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆ కళలో నిష్ణాతులు గనుకనే దశాబ్దాల పాటు ఆ కృషి చేసి, దాని ద్వారా అధికారానికి వచ్చి, ఆ తర్వాత చేతికి అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని, దేశవ్యాప్త ఐటీ సెల్స్ స్థాపించారు. ఒక అబద్ధానికి రెండు రూపాయల కూలీ పథకం కింద వేలాది మందికి ఉద్యోగం కల్పించిన చరిత్ర సంఘ్ పరివార్ ది. వాళ్లు “అబద్ధ కథనాలు” అనే ఆరోపణను ఇతరుల మీదికి విసరడమే ఆశ్చర్యం. అందరూ తమలాంటి వారే అనుకుంటారేమో!
“పాండ్యా హత్య కేసులో నిందితుడైన సోహ్రాబుద్దీన్ షేఖ్ ను, ఆయన భార్య కౌసర్ బీని, వారితో పాటు ఉన్న తులసీరాం ప్రజాపతిని పట్టుకుని, సోహ్రాబుద్దీన్ ను ఎన్ కౌంటర్ లో చంపేశారు. కౌసర్ బీ మృతదేహం రెండు రోజుల తర్వాత అనుమానాస్పదంగా దొరికింది. సాక్ష్యంగా ఉన్న ప్రజాపతిని మరొక ఎన్ కౌంటర్ లో చంపేశారు. ఈ మూడు హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా అమిత్ షా అరెస్టయ్యాడు. గుజరాత్ హైకోర్టు బెయిల్ మీద విడుదల చేయగా, సుప్రీంకోర్టు ఆయన గుజరాత్ లో ఉంటే సాక్షులను బెదిరిస్తాడని రాష్ట్ర బహిష్కరణ చేసింది. ఏడాదిన్నర తర్వాత బహిష్కరణ ఎత్తివేసినా, కేసు విచారణ ముంబాయి సిబిఐ కోర్టుకు బదిలీ చేశారు. విచారణ వాయిదాలకు హాజరు కాకపోతే అరెస్టు చేయిస్తానని హెచ్చరించిన న్యాయమూర్తి అనుమానాస్పదంగా మరణించాడు. మరణించిన న్యాయమూర్తి స్థానంలో వచ్చిన కొత్త న్యాయమూర్తి కేసు నుంచి అమిత్ షా పేరు తొలగించాడు…”
ఇక “రాజకీయ అస్థిరత”! 2014 లో కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఆపరేషన్ లోటస్ పేరుతో కనీసం ఆరు (గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, దిల్లీ) రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన, అనేక ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్న, ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేసిన, ప్రతిపక్ష ముక్త్ భారత్ అని పిలుపు ఇచ్చిన సంఘ్ పరివార్ కు రాజకీయ అస్థిరత అనే అర్హత లేదు.
ఇక ఎన్నికల కమిషన్ తో సహా రాజ్యాంగబద్ధ వ్యవస్థలను అప్రతిష్ఠ పాలు చెయ్యడం అనే ఆరోపణ సంఘ్ పరివార్ చేయడం చూసి ఎవరైనా నవ్విపోతారు. ఇన్ కమ్ టాక్స్ (ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఎ), ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్ట్ వంటి అనేక రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ఠ దెబ్బతినే విధానాలను అమలు చేసినది సంఘ్ పరివార్ ప్రభుత్వం. పన్నెండు సంవత్సరాలలో అనేక మంది అవినీతిపర రాజకీయ నాయకులను భారతీయ జనతా పార్టీలోకి లాగడానికి, ఎందరో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు తమ పరిశ్రమలను, వ్యాపారాలను అదానీకి అప్పగించేలా బెదిరించడానికి ఇడిని, ఐటీని, సిబిఐని వాడినది అమిత్ షా మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఎన్నికల కమిషన్ లో ప్రత్యేకించి సర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలను సరిదిద్దాలనే న్యాయమైన ప్రజాందోళన ప్రారంభమైతే, నిస్సందేహమైన సాక్ష్యాధారాలు ఉంటే, ప్రతిపక్షాలు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను అప్రతిష్ఠ పాలు చేస్తున్నారనడం దొంగే దొంగ దొంగ అనడం కన్న ఘోరం.
అసలు కార్యక్రమమే తలకిందుల వ్యవహారం కాగా, దానికి అమిత్ షా రావడం ఇంకా హాస్యాస్పదం. అమిత్ షా మీద కనీసం ఐదుగురి హత్యారోపణలున్నాయి. వాటిలో ఒకటి సహమంత్రి హరేన్ పాండ్యాది. గుజరాత్ మారణకాండ గురించి కృష్ణయ్యర్ కమిషన్ ముందు తనకు తెలిసిన సత్యాలు చెప్పాడని ఆయనను హత్య చేశారు. హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తి హత్యకు గురయితే, సరైన విచారణ జరగలేదు. కొందరి మీద కేసు నడిపి ప్రత్యేక కోర్టు పన్నెండు మందికి శిక్ష విధిస్తే హైకోర్టు అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అసలు ఆ నిందితులకు సంబంధమే లేదని, అమిత్ షాకు సన్నిహితుడైన ఒక పోలీసు అధికారి హత్య చేయించాడని, దాని మీద విచారణ జరపాలని వచ్చిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు కొట్టివేసిన శిక్షలను ఖరారు చేసింది. హత్య జరిగిన ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా సత్యం బైటపడలేదు.
“అక్రమంగా దేశంలోకి చొరబడి వోటర్లుగా నమోదు చేసుకున్న రోహింగ్యాలనూ, బాంగ్లాదేశీలనూ తొలగించడానికే సర్ ప్రక్రియ అని ఇప్పటికీ గుడ్డిగా నమ్మే అంధ భక్తులూ, వారిని నమ్మించే ఐటీ సెల్ కిరాయి సైనికులూ,బహిరంగ సభల్లో పచ్చి అబద్ధాలు చెప్పే అమిత్ షాలూ ఉన్నారు. కాని ప్రభుత్వాలు అడపదడపా ప్రకటించిన లెక్కల ప్రకారమే: భారత ప్రభుత్వం గుర్తించి వెనక్కి పంపిన బాంగ్లాదేశీలు సంవత్సరానికి ఏడాదికి వెయ్యి కన్నా తక్కువ. దేశం మొత్తం మీద ఉన్నారనే రోహింగ్యాల అంచనా 40,000. అంటే ఆ రెండు సమూహాలూ కలిసినా ఒక లక్ష కూడా ఉన్నారని చెప్పలేం. మనం చెప్పలేం కాదు, ప్రభుత్వమే చెప్పలేదు! కాని హోమ్ మంత్రి మూడు కోట్లు అని పచ్చి అబద్ధం చెపుతున్నాడు. నమ్మే అంధ భక్తులుంటే ఏమైనా చెప్పవచ్చు..”
పాండ్యా హత్య కేసులో నిందితుడైన సోహ్రాబుద్దీన్ షేఖ్ ను, ఆయన భార్య కౌసర్ బీని, వారితో పాటు ఉన్న తులసీరాం ప్రజాపతిని పట్టుకుని, సోహ్రాబుద్దీన్ ను ఎన్ కౌంటర్ లో చంపేశారు. కౌసర్ బీ మృతదేహం రెండు రోజుల తర్వాత అనుమానాస్పదంగా దొరికింది. సాక్ష్యంగా ఉన్న ప్రజాపతిని మరొక ఎన్ కౌంటర్ లో చంపేశారు. ఈ మూడు హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా అమిత్ షా అరెస్టయ్యాడు. గుజరాత్ హైకోర్టు బెయిల్ మీద విడుదల చేయగా, సుప్రీంకోర్టు ఆయన గుజరాత్ లో ఉంటే సాక్షులను బెదిరిస్తాడని రాష్ట్ర బహిష్కరణ చేసింది. ఏడాదిన్నర తర్వాత బహిష్కరణ ఎత్తివేసినా, కేసు విచారణ ముంబాయి సిబిఐ కోర్టుకు బదిలీ చేశారు. విచారణ వాయిదాలకు హాజరు కాకపోతే అరెస్టు చేయిస్తానని హెచ్చరించిన న్యాయమూర్తి అనుమానాస్పదంగా మరణించాడు. మరణించిన న్యాయమూర్తి స్థానంలో వచ్చిన కొత్త న్యాయమూర్తి కేసు నుంచి అమిత్ షా పేరు తొలగించాడు. న్యాయమూర్తి అనుమానాస్పద మరణం మీద విచారణ జరిపించాలని కోరితే సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడు చట్టబద్ధమైన, సక్రమమైన, అవసరమైన న్యాయ విచారణకు లోను కాలేదు. నిర్దోషిగా విడుదల కాలేదు. తన అధికారాన్ని వినియోగించి అసలు విచారణే జరగకుండా చూశాడు. అటువంటి మనిషి నోట ప్రజాస్వామ్య రక్షణ, అరాచకవాద అంతం అనే మాటలు శోభించవు.
సరే, ఆయన ఎటువంటి మనిషి అయినా తెలంగాణ గడ్డ మీద ఆయన అన్నమాటలను జాగ్రత్తగా చూడాలి. అందులో పచ్చి అబద్ధాలు చాలా ఉన్నాయి గాని, కనీసం రెండు మూడు ముఖ్యమైన అబద్ధాలను చూడాలి. తొలగించిన పదమూడు కోట్ల వోట్లలో పది కోట్ల వోట్లు మరణించిన, చిరునామా మార్చిన, రెండు చోట్ల నమోదైన వారివే అన్నాడు. 6.25 కోట్లు వేరే చోట నివాసం ఉంటున్నారని అన్నాడు. వారికి రెండు చోట్ల వోట్లు ఇవ్వాలా అని ప్రశ్నించాడు. దాదాపు మూడు కోట్ల మంది చనిపోయారని, వారి పేర్లు ఉంచాలా అని గర్జించాడు. “మూడు కోట్ల వోట్లు అక్రమ వలసదారులవే” అన్నాడు. మోదీ పాలనలో పావలా కుంభకోణం కూడా లేదన్నాడు. ఈ అబద్ధాలతో కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద, ప్రతిపక్షాల మీద దురుసు వ్యాఖ్యలు చేశాడు.
ఆ వ్యాఖ్యలు అలా ఉంచి, ఆయన చెప్పిన పదమూడు కోట్ల లెక్క తప్పు. డెడ్, డూప్లికేట్ తప్పకుండా తొలగించవలసినవే గాని, ఆబ్సెంట్ అని ఎవరినంటున్నారు, షిఫ్టెడ్ అయితే మరొకచోట వోటు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ తొలగించాలి గదా. ఆ విషయంలో పారదర్శకత ఎందుకు లేదు? అంతకు మించి మూడు కోట్ల ఘుస్పేటియా ఎక్కడి నుంచి వచ్చారు? పన్నెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మూడు కోట్ల మంది సరిహద్దులు దాటి అక్రమంగా వస్తుంటే ఏమి చేస్తున్నది?
ఇంతకీ మూడుకోట్ల బంగ్లాదేశీలనేది పచ్చి అబద్ధం. బాంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా ఉన్నవారిని ఎప్పటికప్పుడు వెనక్కి పంపుతుంటారు. పార్లమెంటులో 2018 మార్చ్ 14న మంత్రి చెప్పిన ప్రకారం 2014-2017 మధ్య పంపించినవారి సంఖ్య 1822. రాజ్యసభలో 2020 ఫిబ్రవరి 5న మంత్రి చెప్పిన ప్రకారం 2017-2019 మూడు సంవత్సరాలలో 795 మంది. హోమ్ మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2023-24 లో పంపిన వారి సంఖ్య 411. స్వయంగా ప్రభుత్వం తరఫున మంత్రులు పార్లమెంటులో చెప్పిన అంకెలు ఇవి. మరొక పక్క 2016లో రాజ్యసభలో మంత్రి దాదాపు రెండు కోట్ల మంది బంగ్లాదేశీలు ఉన్నారన్నాడు. 2016 డిసెంబర్ లో లోకసభలో హోమ్ మంత్రిత్వ శాఖ కచ్చితమైన అంకె చెప్పలేం అంది. 2017లోనూ హోమ్ మంత్రిత్వ శాఖ అదే మాట అంది. 2019 జూలైలో హోం మంత్రి కచ్చితమైన అంకె లేదు అన్నాడు. దీన్ని మరొకవైపు నుంచి చూస్తే బంగ్లాదేశ్ మొత్తం జనాభా 16-17 కోట్లు. అందులో 15-20 శాతం, మూడు కోట్ల మంది భారతదేశానికి రావడం సహజమేనా, సాధ్యమేనా, నమ్మశక్యమేనా?
అక్రమంగా దేశంలోకి చొరబడి వోటర్లుగా నమోదు చేసుకున్న రోహింగ్యాలనూ, బాంగ్లాదేశీలనూ తొలగించడానికే సర్ ప్రక్రియ అని ఇప్పటికీ గుడ్డిగా నమ్మే అంధ భక్తులూ, వారిని నమ్మించే ఐటీ సెల్ కిరాయి సైనికులూ, బహిరంగ సభల్లో పచ్చి అబద్ధాలు చెప్పే అమిత్ షాలూ ఉన్నారు. కాని ప్రభుత్వాలు అడపదడపా ప్రకటించిన లెక్కల ప్రకారమే: భారత ప్రభుత్వం గుర్తించి వెనక్కి పంపిన బాంగ్లాదేశీలు సంవత్సరానికి ఏడాదికి వెయ్యి కన్నా తక్కువ. దేశం మొత్తం మీద ఉన్నారనే రోహింగ్యాల అంచనా 40,000. అంటే ఆ రెండు సమూహాలూ కలిసినా ఒక లక్ష కూడా ఉన్నారని చెప్పలేం. మనం చెప్పలేం కాదు, ప్రభుత్వమే చెప్పలేదు! కాని హోమ్ మంత్రి మూడు కోట్లు అని పచ్చి అబద్ధం చెపుతున్నాడు. నమ్మే అంధ భక్తులుంటే ఏమైనా చెప్పవచ్చు.
ఈ అబద్ధాల గురించి, అబద్ధీకుల గురించి తెలంగాణ జాగ్రత్తగా ఉండాలి. ఈ సభకూ ప్రదర్శనకూ వచ్చినవారిలో ఎన్నో కాలేజీల నుంచి తరలించిన విద్యార్థులున్నారు. తమ పిల్లలకు స్కాలర్షిప్ ప్రదర్శన అని చెప్పి తీసుకుపోయారని, తల్లిదండ్రుల అనుమతి లేకుండా కాలేజీ నుంచి అలా పంపించడం తప్పేనని ఒక కాలేజీ ప్రిన్సిపాల్ అన్న వీడియో వైరల్ అయింది. అలా పాదయాత్రకూ సభకూ వచ్చినవారిలో సంఘ్ పరివార్ కానివారు, అమాయకులు చాలమందే ఉండవచ్చు. ఒక సంఘ్ పరివార్ అనుకూల దినపత్రికే “భారత్ మాతాకీ జై నినాదాలు చేయించగా సభికులు సరిగా స్పందించకపోవడంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అని ప్రశ్నించారు” అని రాసిందంటే తెలంగాణ ఇంకా జాగ్రత్తగానే ఉందని అర్థం. అయినా తస్మాత్ జాగ్రత్త!





