పోటీ ప్ర‌పంచ‌ంలో నిలబెట్టేవి నైపుణ్యాలే..

నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి..  
ఈ పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండాలంటే ఆధునిక నైపుణ్యాల‌ను అందిపుచ్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. కొత్త కోర్సులు, కొత్త‌ సాధనాలు అనునిత్యం అనుసరిస్తూనే  ఉండాలి. అసలే పోటీ ప‌రీక్ష‌ల్లో పదుల సంఖ్యలో ఉద్యోగాలకు లక్షలాది మంది త‌ల‌బ‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన  త‌రుణంలో కంపెనీలే మీ వైపు చూడాలంటే ఎలాంటి నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ప్ర‌పంచం శరవేగంగా మారుతున్న వేళ అన్ని పరిస్థితులకు నిలబడగలిగేలా నైపుణ్యాలు పెంచుకోవ‌డం ఎంతో అవసరం. ప్రపంచ వ్యాప్తంగా 2027 నాటికి 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వొస్తాయని, అదే సమయంలో 8.3 కోట్ల ఉద్యోగాలు మాయమవుతాయని ఈ మధ్య ప్రపంచ ఆర్థిక నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా 2027 నాటికి 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వొస్తాయని, అంటే ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నమాట. డిమాండ్‌కి తగిన సంఖ్యలో నిపుణులు దొరక్క అనేక సంస్థలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలూ లేకపోలేదు. సాంకేతిక నైపుణ్యం, వ్యక్తిగత కౌశలం మేళవించిన వారు మాత్రమే ఉద్యోగాలు దక్కించుకోగలుగుతున్నారు. వివిధ కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో నైపుణ్యానికే పెద్దపీట వేస్తున్నాయి. వీటితో పోలిస్తే విద్యార్థులు పరీక్షల్లో సాధించిన మార్కులు, చేసిన ప్రాజెక్టులు, సిఫారసులను అవి పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
భావవ్యక్తీకరణ నైపుణ్యం: నిత్యనూతనంగా లేకపోతే అవకాశాలు వొచ్చినట్లే వొచ్చి చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కళాశాలలో ఉన్నప్పుడే ఎక్కువ స్కిల్స్‌ నేర్చుకొనే యత్నం చేస్తేనే మార్కెట్ లో అవకాశాలను అందిపుచ్చుకోగలం. ఉద్యోగాన్వేషణలో మీకు  కమ్యూనికేష‌న్ స్కిల్స్ అద‌న‌పు బ‌లాన్ని ధీమాను ఇస్తాయి. ఏ ఉద్యోగానికైనా కచ్చితంగా కావాల్సింది భావవ్యక్తీకరణ నైపుణ్యం. ఎదుటి వారికి మీరేం చెప్పాలనుకొంటున్నారో సమర్థంగా వ్యక్తపరిచేందుకు ఈ నైపుణ్యమే కీలకం.  దేశవ్యాప్తంగా ఏటా కొత్తగా పట్టాలు పుచ్చుకుని దాదాపు 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉపాధి వేటలో పడుతున్నారు. వీరిలో చాలా మందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉండడం లేదనేది నిజం.
సమూహపు పని ( టీమ్ వ‌ర్క్ ) : పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా స్కిల్స్‌ నేర్చుకుంటే దాదాపు ఉద్యోగం వచ్చేసినట్లే! ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని దూసుకుపోయే తత్వం, టీమ్‌ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పనిచేయగలగడం, సమస్యలకు పరిష్కారాలు చూపగలగడం, ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం అనేది  టీం వ‌ర్క్‌లో కీల‌కంగా ఉంటుంది. మంచి టీమ్ వర్క్ కు ఇతరులతో కలిసి పనిచేయడం, వారితో కలిసి పనిచేయడం సౌకర్యవంతంగా ఉండటం అవసరం. ఇది మొత్తం మీద మెరుగైన సమస్య పరిష్కారానికి దారితీస్తుంది.
సాఫ్ట్ స్కిల్స్‌, టెక్నిక‌ల్ స్కిల్స్ ఉండాల్సిందే..
భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం వంటి సాఫ్ట్‌ స్కిల్స్ యువ‌త‌కు ఎంతో కీలకం. కాలేజీలో దశలో ఉన్నప్పట్నుంచే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలేంటో నిశితంగా గమనిస్తుండాలి. ఏ కోర్సు నేర్చుకుంటే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చో నిరంతరం శోధిస్తుండాలి. అందుకు తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే బయటకు వొచ్చాక ఉద్యోగం గురించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ మెథడాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్‌, కోడింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి హార్డ్‌ స్కిల్స్‌ తెలిసిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డిజిటల్‌ ఆప్టిట్యూడ్‌తో పాటు డిజిటల్‌ టూల్స్‌, సాంకేతికత వినియోగంలో నైపుణ్యాన్ని పెంచుకోండి. అప్పుడే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశాలు మెరుగవుతాయి.
అంద‌రితో ఇమిడిపోవాలి..
కేవలం సబ్జెక్టుపై పట్టు ఉన్నంత మాత్రాన సరిపోదు. బృందంలో ఇమిడిపోయే మనస్తత్వం, ఛాలెంజ్‌లను స్వీకరించగలగడం, నాయకత్వ లక్షణాలు, కస్టమర్‌ సర్వీస్‌- మేనేజ్‌మెంట్‌, టైం మేనేజ్‌మెంట్‌, ప్రపంచ మార్కెట్‌కు అవసరమయ్యే నైపుణ్యాలకనుగుణంగా అప్‌డేట్‌ అయితే.. ఏ కంపెనీలూ మిమ్మల్ని వదులుకోవు. మార్కెట్‌ అవసరానికి తగ్గట్టు కంపెనీలకు కావాల్సింది సవాళ్లను స్వీకరించి పనిచేసే నైపుణ్యం కలిగిన సిబ్బందే. ప్రపంచంలో వొస్తున్న కొత్త మార్పులపై మేధోమథనం చేసి తగిన పరిష్కారాలు చూపేవారు, సమస్యా పరిష్కార ఆలోచనా దృక్పథం ఉన్న వారినే కంపెనీలు ఎంచుకొంటాయి. ఉన్న సమయాన్ని ఫలప్రదంగా మలచుకోగలగడం, టార్గెట్‌లకు అనుగుణంగా పనులను ప్రాధాన్యతల వారీగా నిర్ణయించుకొని పూర్తి చేయడం, సమయ పాలనకు ప్రియారిటీ ఇచ్చేలా ఉన్న మీ అలవాటును రెజ్యూమ్‌కు జత చేస్తే ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకు మీపై మంచి ఇంప్రెషన్‌ కలుగుతుంది. కంపెనీల్లో ఉత్పాదకతను పెంచేందుకు, కచ్చితమైన ప్రణాళికతో పనిచేయగల సమర్థతనూ వ్యక్తపరచాలి. డిజిటల్‌ యుగంలో ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రతి పనికీ డిజిటల్‌ స్కిల్స్‌, సోషల్‌ మీడియా వినియోగంపై అవగాహన కీలకంగా మారాయి.
కంప్యూటర్‌పై లోతైన పరిజ్ఞానం అవసరమైన ఉద్యోగాలే మార్కెట్లో అధికంగా ఉన్నాయి. అందువల్ల మీరు నేర్చుకున్న కంప్యూటర్‌ నైపుణ్యాలను రెజ్యూమ్‌లో హైలైట్‌ చేయాలి. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్, స్ప్రెడ్‌షీట్‌లు, సోషల్ మీడియా, డేటా విజువలైజేషన్, ఈ-మెయిల్‌ కమ్యూనికేషన్‌లో మీకున్న స్కిల్స్‌ను ప్రస్తావించాలి. ఓపెన్‌ మైండ్ తో పని చేయడమూ మరో కీలక నైపుణ్యమే. ఏదైనా కంపెనీలో ఒక హోదాలో పనిచేస్తే.. కొత్త కంపెనీకి మారేటప్పుడు అదే పనిని అక్కడ విభిన్నంగా చేయాల్సి రావొచ్చు. అందువల్ల అక్కడి పరిస్థితికి అనుగుణంగా పని చేసేందుకు ఈ నైపుణ్యం అవసరం. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉండటం ఉద్యోగులు/ఉద్యోగార్థులు అలవర్చుకోవాల్సిన గొప్ప నైపుణ్యం. మీరు పనిచేసేచోట వర్క్‌ ఎథిక్స్‌ పాటించడం అద్భుతమైన నైపుణ్యం. అప్పగించిన పనిని చక్కబెట్టి, విశ్వాసంతో ఉండే ఉద్యోగులనే ఏ కంపెనీలైనా కోరుకుంటాయి.

ఎథిక్స్‌ కలిగి ఉండటం వల్ల ఎలాంటి పర్యవేక్షణ అవసరం లేకుండానే మీ పనిని మీరు ముగించేందుకు దోహదపడుతుంది. దీనికితోడు యాక్టివ్‌గా వినడం, ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడం, గెలుపోటములను స్వీకరించే స్వభావం, సహనశీలత వంటి లక్షణాలు మిమ్మల్ని ఆకర్షణీయంగా, ఇతరుల నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. జీడీపీ మెరుపులకు సమాంతరంగా జన జీవితాల్లోనూ వెలుగులు నిండాలంటే- ఉపాధి సహిత అభివృద్ధి విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యలో వృత్తి శిక్షణను అంతర్భాగం చేయాలి. తయారీ, ఆరోగ్య సేవలు, పునరుత్పాదక ఇంధన వనరులు, నిర్మాణం, రవాణా, చిల్లర విపణి, బీమా, పర్యాటకం, ఫొటోగ్రఫీ, బ్యాంకింగ్ రంగాల్లో భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అందిరానున్నాయి. వాటిని ఒడిసిపట్టుకునే విధంగా నవతరాన్ని ముందుకు నడిపించాలి. వీటిలో మన యువతను తీర్చిదిద్దుకోవాలి. ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే విద్యను దేశ యువతకు అందించాలి. భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఉన్న కృత్రిమ మేధ, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, డేటా సైన్స్ వంటి అధునాతన కోర్సులను ప్రవేశపెట్టాలి. నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి.

 ప్రొఫెసర్  డాక్ట‌ర్‌ కృష్ణ సామల్ల,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

 9705890045

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page