నక్సల్బరీ నిప్పుకణిక నుంచి విప్లవోద్యమ నిర్మాణం దాకా..

“నక్సల్బరీ లేవనెత్తిన భూమి, భుక్తి, సమానత్వం, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం వంటి ప్రశ్నలు నేటికీ ప్రాసంగికమైనవే. భూస్వామ్య దోపిడీతోపాటు కార్పొరేట్ భూదాహం, వ్యవసాయ సంక్షోభం, కుల వివక్ష, మహిళలపై అణచివేత, ప్రజాస్వామిక హక్కులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా ఉద్యమాల కేంద్రంగా తీసుకోవాల్సిన అవసరముంది..”

కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య (శంభూజీ) రాజకీయ ప్రస్థానం

మామిండ్ల రమేష్ రాజా
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్
సెల్: 78932 30218

కొన్ని జీవితాలు కాలంతోపాటు కనుమరుగైపోవు. అవి ఒక తరం కలలకు, కష్టాలకు, పోరాటాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య అలియాస్ శంభూజీ జీవితం అలాంటిదే. నక్సల్బరీ పోరాటం రగిలించిన రాజకీయ చైతన్యంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగింది. విప్లవోద్యమ ఉత్థానపతనాలు, నాయకత్వ సంక్షోభాలు, నిర్బంధాలు, రాజకీయ పునఃపరిశీలనలు, సంస్థాగత పునర్నిర్మాణంలో ఆయన కీలక భాగస్వామిగా నిలిచారు.  1967 మేలో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతంలో పేద రైతులు, వ్యవసాయ కార్మికులు భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం సాగిన ఆ పోరాటం దేశ రాజకీయాలను కుదిపేసింది. విద్యార్థులు, యువకులు, మేధావులు, కార్మికుల్లో కొత్త రాజకీయ చైతన్యాన్ని రగిలించింది. 1969 ఏప్రిల్ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) ఏర్పాటుకు నక్సల్బరీ పోరాటమే నేపథ్యమైంది.

ఆ ఉద్యమ ప్రభావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన యువకుల్లో స్వదేశ్ భట్టాచార్య ఒకరు. విద్యార్థి దశలోనే వ్యక్తిగత భవిష్యత్తు కంటే సమాజ మార్పుకు ప్రాధాన్యమిచ్చారు. 1999 జనవరిలో వినోద్ మిశ్రా స్మృతిలో రాసిన వ్యాసంలో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన పరిస్థితులను వివరించారు. 1972 నాటికి సీపీఐ (ఎంఎల్) తీవ్రమైన సంక్షోభంలో పడింది. చారు మజుందార్ సహా అనేకమంది నాయకులు రాజ్య అణచివేతకు బలయ్యారు. కేంద్ర నాయకత్వం విచ్ఛిన్నమైంది. వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. రాజకీయ పంథా, ప్రజా ఉద్యమాల నిర్మాణం, సంస్థాగత విధానాలపై గందరగోళం నెలకొన్నది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను స్వదేశ్ భట్టాచార్య స్వీకరించారు.

1974 జూలై 28న చారు మజుందార్ రెండో వర్ధంతి సందర్భంగా ముగ్గురు సభ్యులతో కేంద్ర కమిటీని పునర్వ్యవస్థీకరించారు. జౌహర్ ప్రధాన కార్యదర్శిగా, వినోద్ మిశ్రా, రఘు పేరుతో స్వదేశ్ భట్టాచార్య సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. భోజ్‌పూర్, పాట్నా ప్రాంతాల్లో రైతాంగ పోరాటాలను కొనసాగించడం, పశ్చిమ బెంగాల్‌లో పార్టీని పునర్నిర్మించడం, ఇతర ప్రాంతాల్లో విప్లవ శక్తులను సమీకరించడం వారి ముందున్న ప్రధాన కర్తవ్యాలు. 1975 నవంబరులో జౌహర్ మరణానంతరం వినోద్ మిశ్రా ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1976 ఫిబ్రవరిలో గయా జిల్లాలో జరిగిన రెండో పార్టీ మహాసభ గత రాజకీయ అనుభవాలను సమీక్షించింది. ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడం, విస్తృత ప్రజా ఉద్యమాలను నిర్మించడం అవసరమని గుర్తించింది.

1978లో సరిదిద్దుకునే ఉద్యమం చేపట్టడం, 1979 జూలైలో భోజ్‌పూర్ ప్రత్యేక సమావేశంలో బహిరంగ ప్రజా కార్యకలాపాలు, ప్రజా సంఘాల నిర్మాణానికి నిర్ణయించడం ముఖ్యమైన మలుపులు. ప్రజల బతుకు సమస్యలతో మమేకం కాకుండా విప్లవ రాజకీయాలు ముందుకు సాగలేవనే అవగాహన బలపడింది.1982లో ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రజాస్వామిక ఉద్యమాలకు విస్తృత రాజకీయ వేదిక నిర్మించే ప్రయత్నం మొదలైంది. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, అణగారిన వర్గాల సమస్యలను సమన్వయం చేసే కార్యాచరణకు ప్రాధాన్యం పెరిగింది.

1982 డిసెంబరులో గిరిడీలో జరిగిన మూడో పార్టీ మహాసభ కార్యక్రమం, వ్యవసాయ విధానం, రాజ్యాంగం వంటి కీలక పత్రాలను ఆమోదించింది. 1988 జనవరిలో హజారీబాగ్‌లో జరిగిన నాలుగో మహాసభలో కేంద్ర నియంత్రణ కమిషన్ ఏర్పాటైంది. దాని అధ్యక్షుడిగా స్వదేశ్ భట్టాచార్య ఎన్నికయ్యారు. పార్టీ క్రమశిక్షణ, అంతర్గత ప్రజాస్వామ్యం, సంస్థాగత జవాబుదారీతనాన్ని పరిరక్షించే కీలక బాధ్యత ఆయనకు అప్పగించబడింది. 1990వ దశకంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, తూర్పు ఐరోపాలో సామ్యవాద ప్రభుత్వాల పతనం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి సవాళ్లు విసిరాయి. మార్క్సిజం–లెనినిజం ప్రాసంగికత, పెట్టుబడిదారీ వ్యవస్థ పరిణామాలు, భారత సమాజంలో మార్పులపై పునఃపరిశీలన అవసరమైంది. ఈ కాలంలోనూ స్వదేశ్ భట్టాచార్య కేంద్ర నాయకత్వంలో కొనసాగారు.

1998 డిసెంబరులో వినోద్ మిశ్రా మరణానంతరం దీపాంకర్ భట్టాచార్య ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నాయకత్వ తరాల మధ్య అనుభవాల కొనసాగింపులో శంభూజీ వంటి సీనియర్ నాయకులు ముఖ్యపాత్ర పోషించారు. 2002 పాట్నా ఏడో మహాసభ సమయంలో ఆయన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. విస్తృత వామపక్ష, ప్రజాస్వామిక ఐక్యత నిర్మాణంపైనా తన అభిప్రాయాలను వెల్లడించారు. 2012 జూలై 28న దిల్లీలోని చారు భవన్ ప్రారంభోత్సవంలో చారు మజుందార్ అర్ధవిగ్రహాన్ని స్వదేశ్ భట్టాచార్య ఆవిష్కరించారు. 1974లో పునర్వ్యవస్థీకరించిన ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీలో అప్పటికి జీవించి ఉన్న ఏకైక సభ్యుడు ఆయనే. నాలుగు దశాబ్దాల చరిత్రకు ఆ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది. 2023లో పాట్నాలో జరిగిన వినోద్ మిశ్రా 25వ వర్ధంతి సంస్మరణ సభలోనూ పాల్గొన్నారు.

శంభూజీ జీవితం విప్లవోద్యమంలో నాయకత్వానికి విస్తృతమైన అర్థాన్ని తెలియజేస్తుంది. నాయకత్వమంటే కేవలం బహిరంగ ప్రసంగాలు కాదు. సంక్షోభాల్లో సంస్థను నిలబెట్టడం, చెదిరిపోయిన శక్తులను సమీకరించడం, సమష్టి నిర్ణయాలకు తోడ్పడటం, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, కొత్త తరాలకు అనుభవాలను అందించడం కూడా నాయకత్వమే. నక్సల్బరీ లేవనెత్తిన భూమి, భుక్తి, సమానత్వం, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం వంటి ప్రశ్నలు నేటికీ ప్రాసంగికమైనవే. భూస్వామ్య దోపిడీతోపాటు కార్పొరేట్ భూదాహం, వ్యవసాయ సంక్షోభం, కుల వివక్ష, మహిళలపై అణచివేత, ప్రజాస్వామిక హక్కులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా ఉద్యమాల కేంద్రంగా తీసుకోవాల్సిన అవసరముంది. చరిత్రలో కొందరి పేర్లు ప్రముఖంగా కనిపిస్తాయి. మరికొందరి కృషి ఉద్యమపు పునాదుల్లో కలిసిపోతుంది. ఆ పునాదులను నిర్మించిన నాయకుల్లో శంభూజీ ఒకరు. ఆయన రాజకీయ నిబద్ధత, సంక్షోభాలను ఎదుర్కొన్న ధైర్యం, సంస్థాగత నిర్మాణానికి చేసిన కృషి కొత్త తరాలకు స్ఫూర్తి. నక్సల్బరీ రగిలించిన సమానత్వ స్వప్నం నేటి ప్రజా పోరాటాల్లో కొత్త రూపాలతో కొనసాగడమే ఆ తరానికి నిజమైన నివాళి.

కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్యకు విప్లవ జోహార్లు! నక్సల్బరీ పోరాట వారసత్వానికి లాల్ సలాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *