నేడు ప్రజావాగ్గేయకారుడు గూడ అంజయ్య జయంతి

9347255489
తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తుచేసుకోవడం అంటే రాజకీయ పార్టీలు నాయకుల పేర్లను వల్లిస్తేనే సరిపోదు. తుపాకీ పట్టిన పోరాటకారుల్ని, జైళ్లకు వెళ్లిన ఉద్యమకారుల్ని, అక్షరాలతో యుద్ధం చేసిన రచయితల్ని, గొంతెత్తి పాడిన ప్రజాగాయకుల్ని కూడా గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కేవలం రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటం కాదు. అది ఆత్మగౌరవం, వనరుల మీద హక్కులు, సామాజిక న్యాయం కోసం సాగిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం. అటువంటి పోరాటానికి తన పాటను ఆయుధంగా అందించిన ప్రజావాగ్గేయకారుడు గూడ అంజయ్య, సమాజంలోని అసమానతలను, దోపిడీ స్వభావాలను తన గళమెత్తి నిలదీస్తూ శ్రామిక లోకానికి ఆత్మగౌరవాన్ని నూరిపోసిన రాజీలేని ధిక్కార స్వరం అంజయ్య.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో లస్మయ్య, లస్మమ్మ దంపతులకు 1955 నవంబర్ 1న ఐదవ సంతానంగా అంజయ్య జన్మించారు. ఊర్లోని ‘కానిగిరి’ బడిలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఆయన, లక్సెట్టిపేటలో ప్రాథమికోన్నత విద్య చదివే రోజుల్లోనే ఆ ప్రాంతంలో విస్తరిస్తున్న నక్సలైట్ ఉద్యమ ప్రభావానికి లోనయ్యారు. 1970లో హైదరాబాద్ చంచల్‌గూడ జూనియర్ కళాశాలలో బైపీసి, ఆ తర్వాత బి-ఫార్మసీ పూర్తి చేసి, 1978లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఫార్మాసిస్ట్‌గా ప్రభుత్వ కొలువులో చేరారు. చదువుకునే కాలంలోనే శ్రీశ్రీ, దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి రచనల లోతుల్లోకి వెళ్లి వర్గపోరాట స్పృహను ఒంటపట్టించుకున్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో రెండేళ్లపాటు ముషీరాబాద్ జైలులో నిర్బంధాన్ని అనుభవించారు. ఆ జైలు జీవిత అనుభవాల నేపథ్యంలోంచే ‘గోపి’ ప్రధాన పాత్రగా ‘పొలిమేర’ నవలను రాసి పీడిత వర్గాల బతుకుపోరాటాన్ని సజీవంగా చిత్రించారు.
విప్లవోద్యమ పాటలు – తాత్విక ధిక్కారం
చదువుకునే రోజుల్లోనే అన్నదాతల దయనీయ స్థితిని కళ్లకు కట్టేలా రాసిన “ఊరిడిచి నేబోదున.. ఉరి బెట్టుకొని సద్దునా..” ఆయన తొలి పాట. ఆ తర్వాత ఆయన రాసిన అనేకపాటలు ఆనాటి గ్రామాలకు తరలండి ఉద్యమానికి ఎంతో ఆసరయ్యాయి. భూస్వామ్య దౌర్జన్యాలపై,శ్రమదోపిడిపై ఆయన రాసిన “ఊరు మనదిరా… ఈ వాడ మనదిరా. దొర ఏందిరా… వాని పీకుడెందిరా” అనే ఈ ఒక్క పాట యావత్ శ్రామిక వర్గపు యాజమాన్య హక్కును, ఉత్పత్తి శక్తుల తాత్వికతను నిలదీసిన సార్వజనీన నినాదమైంది. 1980 ఆసియా–ఆఫ్రికన్ రచయితల సదస్సులో ఈ గీతాన్ని విన్న విదేశీ ప్రతినిధులు ముగ్ధులైయ్యారు దీనిని 16కు పైగా భాషల్లోకి అనువదించుకున్నారు.అట్లా తెలంగాణ పాటను విశ్వవ్యాప్తం చేసిన ఘనత అంజయ్యది. ‘రంగుల కల’లో “భద్రం కొడుకో.. కొడుకో కొమురన్న”అంటూ పట్టణప్రాంత దోపిడి రూపాన్ని వివరించాడు,”నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..అంటూ నాటి ప్రభుత్వ దవాఖానాల దుస్థితి తెలిపాడు.’అడవిలో అన్న’లో “దున్నేటోనిదే భూమిరా..” “అసలేటి వానల్లో ముసలెడ్లు కట్టుకొని..”వంటి పాటల్లో శ్రమ సౌందర్యాన్ని, పల్లె వేదనను విప్లవాత్మక భావుకతతో మేళవించారు.
తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో పాత్ర
మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో గూడ అంజయ్య పాత్ర ఒక చారిత్రక అధ్యాయమే రాజకీయ ప్రక్రియలు స్తంభించిన వేళ సాంస్కృతిక కళారూపాల ద్వారా ఉద్యమాన్ని సజీవంగా నిలిపారు. “అయ్యోనివా నువ్వు అవ్వోనివా” అంటూ ప్రాంతీయ దోపిడీని నిలదీసారు .”పుడితొక్కటి.. సత్తెరెండూ.. రాజిగ ఓరి రాజిగా.. ఎత్తరా తెలంగాణ జెండా” అన్న పాటతో చావుపుట్టుకల తాత్వికతను పోరాట ధైర్యంగా మలిచి యువతను పోరు బాట పట్టించారు. 2007లో గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్నలతో కలిసి ‘తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య’ను స్థాపించి, దానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘ధూంధాం’ వేదికల ద్వార పల్లెపల్లెనా ఉద్యమ అగ్గిని రగిలించారు.
స్వయంపాలన సిద్ధించిన నేటి తెలంగాణలో గూడ అంజయ్యను కేవలం గతకాలపు కవిగా మాత్రమే చూడలేం. రాబోయే తరాలకు ఆయన ఒక నిరంతర ఆత్మగౌరవ దీపిక. కళ కేవలం వినోదపు సరుకు కాకూడదని, అణగారిన వర్గాల సమగ్ర విముక్తికి బలమైన ఆయుధంగా నిలవడమే నిజమైన సృజనకారుడి పరమ ధ్యేయమని భావితరాలు ఆయన జీవితం నుంచి నేర్చుకోవాలి. సమాజంలో సరికొత్త రూపాల్లో పుట్టుకొస్తున్న ఆధునిక దోపిడీలను, వివక్షలను నిలదీసే ధైర్యాన్ని ఆయన పాట నిరంతరం నూరిపోస్తుంది. తెలంగాణ సమాజం తన మట్టి మూలాలను నిలుపుకోవాలంటే ‘దొర ఏందిరో’ అన్న నిక్కచ్చైన ప్రశ్నించే స్వభావం ఎప్పటికీ సజీవంగా ఉండాలి. పదవుల కోసం అమ్ముడుపోకుండా తుదిశ్వాస వరకు పీడిత ప్రజల పక్షానే నిలిచిన ఆయన నిరాడంబర జీవితం రేపటి యువతకు గొప్ప దిక్సూచి. 2016 జూన్ 21న ఆయన భౌతికంగా కన్నుమూసినా, ఆయన ఎక్కుపెట్టిన అక్షరాలు చిరంజీవులు. దోపిడీ ఉన్నంత కాలం ప్రతిఘటన ఉంటుంది; ప్రతిఘటన ఉన్నంత కాలం గూడ అంజయ్య పాట తెలంగాణ గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది.





