“సమస్యల గుర్తింపు అత్యంత హర్షణీయమైనప్పటికీ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇన్నోవేషన్ల ప్రయాణం ప్రదర్శనశాల దాటి ప్రజా క్షేత్రానికి చేరడంలో పెద్ద అగాధమే కనిపిస్తుంది . సాధారణంగా ఇటువంటి స్టార్టప్ ఆవిష్కరణలు సాంకేతికంగా బాగున్నప్పటికీ, గ్రామీణ రైతులకో, సామాన్య అంగన్వాడీ కార్యకర్తకో చేరేసరికి సంక్లిష్టంగా మారుతున్నాయి. ఒక కొత్త సాంకేతికత విజయం సాధించాలంటే అది కేవలం ప్రభుత్వ శాఖల ఆమోదం పొందడం మాత్రమే కాదు; క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి సులభంగా అర్థం కావాలి, అందుబాటు ధరలో ఉండాలి. ‘పైలెట్ ప్రాజెక్టులు’ కేవలం కొన్ని మండలాలకో, నగరాలకో పరిమితమై, బ్యూరోక్రసీ ఫైళ్లలో చిక్కుకుపోకుండా ఉండాలంటే, ఎంపిక చేసిన ఆవిష్కరణలను వేగంగా ‘ప్రభుత్వ కొనుగోళ్ల’ పరిధిలోకి తీసుకు రావాలి..”
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (టీఐఎస్‌సీ) దిల్లీలో జరిగిన పెట్టుబడుల సదస్సు సన్నాహక వేదికగా ప్రాణం పోసుకుని, అక్టోబర్ 31న తన ఏడు ప్రాధాన్య రంగాలను ప్రకటించింది. నవంబర్ 30 వరకు దరఖాస్తుల గడువును ప్రకటించిన ఈ కార్యక్రమం, కేవలం స్టార్టప్‌ల వ్యాపార విస్తరణకు మాత్రమే కాకుండా, ప్రభుత్వ శాఖలలో ప్రయోగాత్మక ప్రాజెక్టుల ద్వారా పరిపాలనా సంస్కరణలకు సైతం ఒక వినూత్న అవకాశాన్ని కల్పిస్తుంది . రాష్ట్రం ఎదుర్కొంటున్న కరువు, సాగునీటి కొరత, ప్రభుత్వ హాస్టళ్లలో ఆహార నాణ్యత, చెరువుల ఆక్రమణలు వంటి సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషించడం ఆహ్వానించదగిన పరిణామం. అయితే, ఇటువంటి ప్రభుత్వ సవాళ్లు గ్లోబల్ సమిట్ల వేదికలపై లేదా ఏసీ గదుల ప్రదర్శనలకే పరిమితమవుతాయా, లేక రైతులు, విద్యార్థులు, సామాన్య పౌరుల దైనందిన జీవితాల్లో కొలవగలిగిన మార్పును తీసుకువొస్తాయా అన్నదే ప్రస్తుత తక్షణ సవాలు. అంతేకాదు సాంకేతిక ఆవిష్కరణల పేరుతో ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పరిస్థితి ఏర్పడకూడదు. ప్రజాధనం వినియోగం, ప్రాజెక్టుల ఎంపిక, ఫలితాల మూల్యాంకనం పారదర్శకంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, చిన్న రైతులకు ప్రయోజనాలు అందుతున్నాయో లేదో నిరంతరం పరిశీలించాలి.
ఈ ఛాలెంజ్‌లో ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు ప్రాధాన్య రంగాలు పూర్తిగా క్షేత్రస్థాయి సమస్యలను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యాంశంగా నిలిచిన ‘వ్యవసాయానికి సౌర విద్యుత్’ ద్వారా ప్రతి చేనుకూ 30 శాతం తక్కువ ధరలో, దొంగతనాలకు ఆస్కారం లేని సోలార్ పంపుల రూపకల్పనను లక్ష్యంగా పెట్టారు. అలాగే నివాస వసతి గృహాల్లో విద్యార్థులకు సురక్షితమైన ఆహారం అందించడం, కల్తీలను వేగంగా గుర్తించే ఏఐ పరిజ్ఞానం; ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలను అడ్డుకునేందుకు శాటిలైట్ నిఘా; వర్షాకాలంలోనూ తట్టుకునేలా రోడ్లపై గుంతల శాశ్వత నివారణ; అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు సూది లేని సులభమైన రక్తహీనత నిర్ధారణ; ప్రాథమిక విద్యలో విద్యార్థుల కోసం తెలుగు ఏఐ రీడింగ్ అసెస్మెంట్, సాగు రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేసే డిజిటల్ క్రాప్ మ్యాపింగ్ ఇందులో ఉన్నాయి.
సమస్యల గుర్తింపు అత్యంత హర్షణీయమైనప్పటికీ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇన్నోవేషన్ల ప్రయాణం ప్రదర్శనశాల దాటి ప్రజా క్షేత్రానికి చేరడంలో పెద్ద అగాధమే కనిపిస్తుంది . సాధారణంగా ఇటువంటి స్టార్టప్ ఆవిష్కరణలు సాంకేతికంగా బాగున్నప్పటికీ, గ్రామీణ రైతులకో, సామాన్య అంగన్వాడీ కార్యకర్తకో చేరేసరికి సంక్లిష్టంగా మారుతున్నాయి. ఒక కొత్త సాంకేతికత విజయం సాధించాలంటే అది కేవలం ప్రభుత్వ శాఖల ఆమోదం పొందడం మాత్రమే కాదు; క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి సులభంగా అర్థం కావాలి, అందుబాటు ధరలో ఉండాలి. ‘పైలెట్ ప్రాజెక్టులు’ కేవలం కొన్ని మండలాలకో, నగరాలకో పరిమితమై, బ్యూరోక్రసీ ఫైళ్లలో చిక్కుకుపోకుండా ఉండాలంటే, ఎంపిక చేసిన ఆవిష్కరణలను వేగంగా ‘ప్రభుత్వ కొనుగోళ్ల’ పరిధిలోకి తీసుకు రావాలి. రైతులకు సోలార్ పంపులు ఇవ్వాలన్నా, గుంతలు లేని రోడ్లు వేయాలన్నా కేవలం స్టార్టప్‌ల టెక్నాలజీ మాత్రమే సరిపోదు. దానికి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, తగిన నిధుల కేటాయింపు, నిరంతర క్షేత్రస్థాయి పర్యవేక్షణ అత్యంత అవసరం. టి-హబ్స్, టి–వర్క్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికల సమన్వయంతో సాగుతున్న ఈ సవాలు కేవలం కార్పొరేట్ పెట్టుబడిదారుల ఆకర్షణకే పరిమితం కాకూడదు.
స్టార్టప్ ఆవిష్కరణలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలకు చేరాలంటే ప్రభుత్వం, స్టార్టప్‌లు , పారిశ్రామిక రంగాలు సమన్వయంతో పనిచేయాలి. స్టార్టప్ ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు నేరుగా కొనుగోలు చేసేలా నిబంధనలను సులభతరం చేయాలి. టెండర్లలో ఉండే కఠినమైన టర్నోవర్ నిబంధనల నుండి స్టార్టప్‌లకు మినహాయింపు ఇవ్వాలి. సాంకేతికత ఎంత ఆధునికమైనదైనా, అది గ్రామీణ రైతులకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఉపయోగపడేలా సులభంగా ఉండాలి. యాప్‌లు , పరికరాలు స్థానిక భాషలలో (తెలుగులో) సులభమైన ఇంటర్ఫేస్తో రూపొందించబడాలి. ప్రయోగాత్మక ప్రాజెక్టులు కొన్ని గ్రామాల్లో విజయవంతం కాగానే ఆపేయకుండా, వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. కొత్త సాంకేతికతపై రైతులకు, విద్యార్థులకు, సామాన్య పౌరులకు క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ సిబ్బందికి (ఉదాహరణకు వ్యవసాయ అధికారులు, రోడ్డు ఇంజనీర్లు) ఈ ఆవిష్కరణలను ఎలా ఉపయోగించాలో ముందే శిక్షణ ఇవ్వాలి. స్టార్టప్ ఉత్పత్తులు సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండాలి. ప్రారంభ దశలో ప్రభుత్వం వీటిపై సబ్సిడీలు లేదా ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వినియోగదారులపై భారం తగ్గించవొచ్చు. ఐటీ శాఖ, టి-హబ్ వంటి సంస్థలతో పాటు వ్యవసాయ, విద్యా, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేసి స్టార్టప్‌లకు క్షేత్రస్థాయి మౌలిక వసతులు కల్పించాలి.
మొత్తంమీద చెప్పాలంటే, ‘టిస్క్’ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారానికి సరికొత్త సాంకేతిక బాటలు వేయడం హర్షణీయం. అయితే, ఈ ఆవిష్కరణలు డిసెంబర్లో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకు లేదా ప్రదర్శన స్టాళ్లకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని సామాన్య పౌరుల, రైతుల, విద్యార్థుల జీవితాల్లో స్పష్టమైన , గుణాత్మక మార్పును తీసుకువొచ్చినప్పుడే ఈ ఛాలెంజ్‌కు పూర్తి సార్థకత చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేయాలని ఆశిద్దాం.
-ప్రజాతంత్ర డెస్క్





