మెడిగడ్డపై త్వరలోనే ఎన్‌డిఎస్ నివేదిక
నివేదిక అనంతరం తదుపరి చర్యలపై సిఫారసు
తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు క్లియరెన్స్ ఇవ్వండి
అంతర్ రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజస్థాన్‌లో కొనసాగిన జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు
ఉదయ్‌పూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : సీతారామ ప్రాజెక్టుకు నెల రోజుల్లో అనుమతులు క్లియర్ కానున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాజస్థాన్ లో రెండో రోజు కొనసాగిన జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఆయన కేంద్ర జలవనరుల శాఖామంత్రి సి.ఆర్.పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ ఎదుర్కొంటున్న అంతర్ రాష్ట్ర వివాదాలను సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ లన్నింటికీ క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ లకు 0%వడ్డీతో 50 సంవత్సరాల వెసులుబాటుతో రుణాలు అందించే అంశాన్ని కేంద్రం పరిశీలనలో ఉందని తెలిపారు. అంతే గాకుండా మేడిగడ్డపై ఎన్డిఎస్‌ఏ నివేదికను నెలాఖరులోగా అందించి తదుపరి చర్యలకు సిఫారసు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతుందన్నారు.
టెలీమెట్రీ వ్యవస్థలపై స్పందించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ నుంచి రబీ సీజన్‌లో అధిక నీటిని అక్రమంగా వాడుకుంటుందని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలకు చెందిన పూర్వ నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రబీ పంటను కాపాడేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా, కేంద్ర మంత్రి పాటిల్, నీటి పంపిణీ సమానంగా ఉండేలా, అనధికారిక నీటి వాడకాన్ని నిరోధించే చర్యలు తక్షణమే తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టల్లో, అలాగే కృష్ణానదిపై మొత్తం 35 ప్రాంతాల్లో టెలీమెట్రీ వ్యవస్థలను అమలు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ వ్యవస్థలు నీటి వినియోగాన్ని రియల్-టైమ్‌లో గమనించేందుకు, కేటాయించిన వాటాను పాటించేలా చేయడంలో ఉపయోగపడతాయన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, నీటి మానిటరింగ్ మెరుగుపర్చే వ్యవస్థల ప్రాముఖ్యతను అంగీకరించారు.
అనుమతులు త్వరగా మంజూరు చేయడం, నిధులు అందుబాటులో ఉండేలా చేయడం అవసరమని పేర్కొంటూ.. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పిఆర్‌ఎల్‌ఐఎస్), సీతారామ సాగర్ ప్రాజెక్ట్, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్‌లకు నిధులు మంజూరు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. పిఆర్‌ఎల్‌ఐఎస్‌ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కార్యదర్శి ముఖర్జీ, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుండి సున్నా శాతం వడ్డీతో 50 ఏళ్ల రుణ విరామంతో నిధుల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.సీతారామ సాగర్ ప్రాజెక్ట్‌కు కావాల్సిన అనుమతులను ఒక నెలలోగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మూసీ నది పునరుద్ధరణకు సాయం అందించండి
మూసీ నది శుద్ధి, పునరుద్ధరణ, అలాగే గోదావరి-మూసీ లింక్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కింద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) నిర్వహిస్తున్న మెదిగడ్డ ప్రాజెక్ట్ పతనంపై విచారణ ఒక సంవత్సరంగా కొనసాగుతుందని, తక్షణమే నివేదికను విడుదల చేసి, తదుపరి చర్యల కోసం సిఫార్సులు అందించాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పాటిల్, నివేదికను నెలాఖరులోగా అందిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రం సూచించిన విధంగా, వరల్డ్ బ్యాంక్ సహకారంతో అందిస్తున్న డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (డిఆర్‌ఐపీ) నిధులను నాగార్జునసాగర్, శ్రీశైలం ఆనకట్టల మరమ్మతులకు, అలాగే తెలంగాణలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నదీ పరిరక్షణ, మట్టినిక్షేపాల తొలగింపుకు వినియోగించాలని సూచించారు.
తెలంగాణకు తగిన నీటి వాటా హక్కును సాధించేందుకు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కెడబ్ల్యూడీటీ-2) విచారణను వేగవంతం చేయాలని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ హామీలతో, తెలంగాణ ప్రభుత్వం తన నీటి హక్కుల కోసం పోరాడుతున్న అంశానికి ఈ సమావేశం సంపూర్ణ మద్దతు పలికిందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతంగా జరగడానికి రెండు రోజుల పాటు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో జరిగిన రెండు రోజుల జాతీయ స్థాయి నీటిపారుదల శాఖామంత్రుల సదస్సు ఎంతగానో దోహదపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.