- నమ్మిన సిద్ధ్దాంతం కోసం కడదాకా నడిచిన కమ్యూనిస్ట్
- ఏచూరీతో మాబంధం రక్త సంబంధం
- రవీంద్రభారతి సంస్మరణలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
అసలుసిసలైన హైదరాబాద్ బిడ్డ సీతారాం ఏచూరీ అని బిఆర్ఎస్ నేతల కెటిఆర్ పేర్కొన్నారు. వోట్ల రాజకీయంలో వెనుకబడినా.. తాము ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిచెప్పిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ అని కేటీఆర్ అన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వొచ్చిన బిడ్డలుగా ఏచూరీతో మాబంధం రక్త సంబంధం అని అన్నారు. నమ్మిన సిద్ధ్దాంత కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరీ జీవితం తమ లాంటి వారికి ఆదర్శం అని పేర్కొన్నారు. ఎప్పుడు కండువా మార్చుతారో తెలియని కాలంలో సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు.
ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా.. సిద్ధ్దాంతం కోసం పని చేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ అని కీర్తించారు. తిట్లు, బూతులు చెలామణి అవుతోన్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరీ రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబంలో పుట్టినప్పటకీ.. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఏచూరీ అని.. ఇందిరా గాంధీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఏకైక వ్యక్తి అన్నారు. దీన్ని బట్టే సీతారం ఏచూరీ గుండె ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రశ్నించటమే ప్రజాస్వామ్యం అని నమ్మిన వ్యక్తి ఏచూరీ అని కీర్తించారు. రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సంస్మరణ సభ జరిగింది.
ఈ సంస్మరణ సభకు కేటీఆర్, కోదండరాం, తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు, మోహన్ కందా, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఈ సమావేశానికి హాజరవనుండగా.. కేటీఆర్ తన ప్రసంగం ముగిసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా, సిద్దాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి కేటీఆర్ తెలిపారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఏచూరి మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. కామ్రేడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సీతారాం ఏచూరిని ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.
వోట్ల రాజకీయం వేరు.. ప్రజల రాజకీయం వేరు. మేం వోట్ల రాజకీయంలో వెనుకబడ్డ ప్రజల కోసం పోరాటంలో మాత్రం ముందున్నాం.. ప్రజల మనసుల్లో ఉన్నామని ఏచూరి చెప్పిన మాట గుర్తుంది. నాయకులుగా, పాలకులుగా ఉండి పోరాడాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలను వోటు బ్యాంకుగా చూసేవారు మరెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఓ కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన గొప్ప వ్యక్తిత్వం ఏచూరిది. అది చాలా గొప్ప విషయం. పోరాటాల నుంచి వచ్చిన నాయకులకు ప్రజల కష్టం, నష్టం తెలుస్తుందంటారు.. అలాంటి వారిలో ఏచూరి ఒక్కరే అని బలంగా నమ్ముతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏచూరి హుందాతనం భవిష్యత్ నాయకులకు ఒక పాఠం అని చెప్పక తప్పదని కేటీఆర్ తెలిపారు.
రాజ్యాంగాన్ని రాజకీయం కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి. పదవులతోనే కీర్తి వస్తుందని అనుకునే వారు కొందరు ఉంటారు. కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పని చేయాలన్న తపన, నిత్యం ప్రజా సంక్షేమం కోసం పని చేసే ఆలోచన, నిత్యం కొత్తది నేర్చుకోవాలనే అభిలాష, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుందనడానికి ఏచూరి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలబడుదాం.. అదే మనందరం ఏచూరికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని భావిస్తున్నాను. నమ్మిన సిద్దాంతం కోసం ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం ఏచూరి జీవితం మా లాంటి కొత్త తరం నాయకులకు కూడా ఆదర్శం అని కేటీఆర్ తెలిపారు.





