అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో శరన్నవరాత్రివేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆలయాల్లో శైవ సంప్రదాయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవ సంప్రదాయంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఇదే మాసంలో నిర్వహిస్తారు.ఐదో శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం విద్యుత్తు దీపాల అలంకరణలో మిరుమిట్లు గొలుపుతోంది. రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ శ్రీజోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు.
ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో అలంకరించటంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. నవరాత్రుల్లో అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి, కూష్మాండదేవి, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా ప్రత్యేక దర్శనమిస్తారు. రోజూ త్రిశతి, ఖడ్గమాల అర్చనలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా కుమారి, సువాసిని పూజ నిర్వహిస్తారు. సహస్ర నామార్చన, నవవర్ణ అర్చన, తర్వాత చండీహోమం ఉంటాయి.
9న ఉదయం 10 గంటలకు మూలానక్షత్ర శుభ సమయమున జోగులాంబ అమ్మవారు, బాల బ్రహ్మేశ్వరస్వామి వారి కల్యాణం, సాయంత్రం 4 గంటలకు సింహవాహన సేవ, 10న దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 10 గంటలకు రథోత్సవం, 11న మహర్నవమి పురస్కరించుకుని కాళరాత్రి పూజ నిర్వహిస్తారు. 12న విజయదశమి రోజు ఉదయం 8 గంటలకు మహాపూర్ణాహుతి, సాయంత్రం 4 గంటలకు శవిూపూజ, 6.30 గంటలకు నదీహారతులు, జోగులాంబ అమ్మవారు, శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను హంసవాహనంలో ఆసీనులను చేసి తుంగభద్ర నదిలో తెప్పోత్సవాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు.