జబల్‌ పూర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

నాచారానికి చెందిన.. ఎనిమిది మంది దుర్మరణం
˜కుంభమేలా నుంచి తిరిగి వొస్తుండగా కబళించిన మృత్యువు
˜ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి11: ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేలాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయా ణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఘటనపై సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని.. గాయపడిన వ్యక్తి కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు హాస్పి టల్‌లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు. మృతులను హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా గుర్తించారు.

జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్‌ లోడ్‌తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్‌ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మినీ బస్సులో చిక్కుకున్న మరికొందరు యాత్రికులను స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. క్షతగాత్రులను సిహోరా హిస్పిటల్‌కి తరలించారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వాహనం నంబరును గుర్తించారు. మినీ బస్సు రిజిస్టేష్రన్‌ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడిరచారు.

 ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
మధ్యప్రదేశ్‌ లోని జబల్పూర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌ నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు  ఎంపీ ఈటల సంతాపం
మధ్యప్రదేశ్‌ రోడ్డు ప్రమాదం పట్ల మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహాకుంభమేలా నుంచి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నాచారానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఎన్‌హెచ్‌-30 పై మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్‌ జిల్లా సిహోరా వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో.. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. చనిపోయిన వారు నవీన్‌ బాలకృష్ణ సంతోష్‌ శశికాంత్‌ రవి ఆనంద్‌ మల్లారెడ్డి. వీరందరూ బంధువులే..  కాగా రోడ్డు ప్రమాదంపై మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యులు ఈటల రాజేందర్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. . బజల్‌ పూర్‌ జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా పూర్తి చేయాలని కోరారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఈటల కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page