భాషా సాంకేతికత ఉన్నత విద్యకు కీలకం

– కేయు వీసీ ప్రతాప రెడ్డి
 కాళోజీ జంక్షన్, హనుమకొండ ప్రజాతంత్ర జూన్ 16: భాషా సాంకేతికత ఉన్నత విద్యకు కీలకం అని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో విభాగ అధిపతి డాక్టర్ ఆర్. మేఘనా రావు అద్యక్షతన, రుసా 2.0 సహకారం తో “న్యూ లిటరరీ అండ్ లాంగ్వేజ్ హారిజన్స్: వాయిసెస్, జానర్స్ అండ్ టెక్నాలజీస్” అనే రెండు రోజుల జాతీయ సదస్సు సెనేట్ హాల్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సాహిత్యం, భాష, సాంకేతికతల సమన్వయం నేటి ఉన్నత విద్యలో కీలక అంశమని అన్నారు. ఆంగ్ల అధ్యయనం సంప్రదాయ సాహిత్యానికి మాత్రమే పరిమితం కాకుండా దళిత, గిరిజన, మహిళా, ప్రవాస భారతీయ, డిజిటల్ సాహిత్య రంగాలకు విస్తరించిందని పేర్కొన్నారు. సాంకేతికత బోధన, పరిశోధన, ప్రచురణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నప్పటికీ మానవీయ విలువలు, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలకు ప్రత్యామ్నాయం కాదన్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మక రచనా సామర్థ్యం, విశ్లేషణాత్మక దృక్పథాన్ని పెంపొందించడంలో భాషా విద్య కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ములుగు, సమ్మక్క–సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వై.ఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ సాంకేతికత మానవ సృజనాత్మకతకు సహాయకారిగా ఉండాలే గానీ దానిని నిస్తేజం చేయకూడదన్నారు. భారతీయ కథన సంప్రదాయంలో పంచతంత్ర కథలు విశిష్ట స్థానం పొందాయన్నారు. అనంతర కాలంలో నవల ఒక కొత్త సాహిత్య ప్రక్రియగా ఆవిర్భవించి సమాజంపై గణనీయ ప్రభావం చూపిందన్నారు. 19వ శతాబ్దం ప్రారంభం లో మహిళలకు ఆంగ్ల విద్య అందుబాటులోకి రావడంతో సాహిత్య రంగంలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. నేడు విద్య, సామాజిక చైతన్యం, సాంకేతిక అభివృద్ధి కారణంగా అణగారిన వర్గాల స్వరాలు కూడా సాహిత్యంలో ప్రతిధ్వనిస్తున్నాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల విస్తరణతో ప్రతి పోస్టు ఒక పాఠ్యంగా మారుతోందని, ఇంతవరకు వెలుగులోకి రాని అనేక అనుభవాలు, అంశాలు ప్రపంచ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. భాషా వినియోగంలో భారతీయ ఆంగ్లం, తెలంగాణ ఆంగ్లం, ఆంధ్ర ఆంగ్లం వంటి ప్రాంతీయ రూపాలు ప్రాచుర్యం పొందుతున్నాయని వివరించారు. 1990ల తర్వాత మైక్రో ఫిక్షన్, ట్విట్టర్ కథనాలు, మల్టీఫిక్షన్ వంటి కొత్త సాహిత్య ప్రక్రియలు వెలుగులోకి వచ్చాయని, నేటి పాఠకుడు కేవలం పాఠకుడిగానే కాకుండా సృష్టికర్తగా, వ్యాఖ్యాతగా కూడా మారుతున్నాడని పేర్కొన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పుస్తక పఠనానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రధాన వక్త, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య సి.ఆర్. విశ్వేశ్వరరావు తన కీలక ఉపన్యాసం లో మాట్లాడుతూ సాహిత్యం, సాంకేతికతల కలయికతో రచయితత్వం, పాఠకత్వం స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు పరస్పర ప్రభావంతో సాహిత్య అధ్యయనాలకు కొత్త దిశలు తెరుచుకుంటున్నాయన్నారు. డిజిటల్ యుగంలో పరిశోధన స్వరూపం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. హైపర్‌టెక్స్ట్ ఫిక్షన్ వంటి కొత్త కథన రూపాల్లో పాఠకుడే తన ఎంపికల ద్వారా కథనానికి అర్థాన్ని నిర్మించుకునే అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. మేరీ షెల్లీ, హెన్రీ జేమ్స్, విక్టోరియా గ్లెండిన్నింగ్, స్టాన్లీ ఫిష్ రచనలను ప్రస్తావిస్తూ ఆధునిక సాహిత్యంలో అర్థం స్థిరమైనది కాదని, పాఠకుని అవగాహన, సందర్భాన్ని బట్టి మారుతుందని వివరించారు. అందువల్ల పరిశోధకులు విస్తృత పఠనం ద్వారా విశ్లేషణాత్మక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గౌరవ అతిధి, పాఠ్య ప్రణాళికల సంఘం అధ్యక్షులు ఆచార్య పి. నిర్మల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాంకేతిక పరిణామాలు విద్యా రంగంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. కృత్రిమ మేధస్సు కారణంగా విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయని, ఏఐ సహకారంతో రూపొందుతున్న రచనలు మానవీయ విలువలను దృష్టిలో ఉంచుకొని సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభాగాధిపతి, సదస్సు సంచాలకులు డాక్టర్ ఆర్. మేఘనా రావు మాట్లాడుతూ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 90కి పైగా పరిశోధనా పత్రాలు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు అబ్స్ట్రాక్ట్ సంకలనాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఇంగ్లీష్ విభాగం స్థాపన నుంచి విశిష్ట పరిశోధన సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య ఎం. నవీన్, డాక్టర్ బి. దీపా జ్యోతి, డాక్టర్ వీణ, డాక్టర్ ప్రసున్న, డాక్టర్ కవిత, ఓయూ ఇంగ్లీష్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *