ఇదేనా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఆర్థిక భద్రత!?
పదేళ్లుగా ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు కలిగింది అని చెప్పడానికి దాఖలాలు లేవు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజలను దారుణంగా పీల్చి పిప్పి చేస్తున్నారు. రకరకాల పన్నులు, జిఎస్టీలతో వారి ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తున్నారు. దీనిపై చర్చించడానికి వేదిక లేకుండా పోయింది. జిఎస్టీ బాదుడంతా కేవలం పెద్దల కోసమే తప్ప… సామాన్యులకు కాదని బొంకుతున్నారు. అద్భుతమైన, అందమైన మాటలతో గత పదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నా.. చర్చించేవారు లేకుండా పోయారు.
ఈ క్రమంలో ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ అన్నది ఎండమావిలాగా మారింది. జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి, రిట్కెర్‌మెంట్ అయిన వారికి పెన్షన్ ఉండదు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం లక్షల్లో జీతాలు పెన్షన్లు అందుతున్నాయి. కేంద్రంలో ఎంపిలకు లక్షల్లో జీతాలు..పెన్‌న్షు ఉన్నాయి. రాష్టాల్ల్రో అసెంబ్లీల్లో కూడా అదే విధంగా జీతాలు పెన్షన్లు ఉన్నాయి. వారు మాత్రం చట్టాలు చేసుకుని వేలకోట్ల ప్రజాధనం తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. లక్షల కోట్ల పన్నులు వసూళ్లు అవుతున్నా..ప్రజల అవసరాలు గుర్తించి ఖర్చు చేయడం లేదు.
ఎంపిలు, ఎమ్మెల్యేలకు లక్షల్లో జీతాలు, పెన్షన్లు అవసరా అన్నది గుర్తించడం లేదు. ప్రజలే ఈ విషయంలో నిలదీయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు లేని పెన్షన్లు రాజకీయ నేతలకు అవసరమా? అన్నది చర్చించాలి. ఉద్యోగులు కానివారికి పెన్షన్లు ఇవ్వడం అనుచితంగా గుర్తించాలి. రాజకీయమంటే కేవలం ప్రజలకు సేవ చేయడం తప్ప మరోటి కాదు. ఈ విషయంలో దేశంలో మేధావులు చర్చించాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సిపిఎస్ అనేది నాటి వాజ్‌పేయి సర్కారు హయాంలో పురుడు పోసుకుంది. ఇప్పుడు ప్రజల పట్ల ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్ దానిని అమలు చేసింది. నాటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో అమల్లోకొచ్చింది.
సైనిక రంగ ఉద్యోగులు మినహా 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన వారిని కేంద్రం ఎన్‌పిస్‌లోకి చేర్చింది. అప్పటి నుంచి ఉద్యోగులు ఒపిఎస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యనే రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒపిఎస్‌కు వెళ్లాయి. దాంతో కేంద్రంతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలు రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డాయి. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ నేతృత్వంలో గతేడాది మోదీ సర్కారు కమిటీ వేయగా, అది యుపిఎస్‌ను సిఫారసు చేసింది. ఆ నివేదికకు మోదీ సర్కారు పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్‌ను రద్దు చేస్తామన్న వైసిపి ప్రభుత్వం మాట తప్పి జిపిఎస్ పేరిట విన్యాసాలు చేసింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో సిపిఎస్ రద్దు ప్రధాన ఎజెండాగా ముందుకొచ్చింది.
దీంతో వైకాపా ప్రభుత్వం మాట తప్పినందుకు మూల్యం చెల్లించు కుంది. టిడిపి ప్రభుత్వం సైతం సిపిఎస్ రద్దు అనకుండా ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పెన్షన్ స్కీం తెస్తామంది. కేంద్రం ప్రతిపాదించిన యుపిఎస్‌పై టిడిపి కూటమి ప్రభుత్వం మౌనం దాల్చింది. ఇదీ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో, పాలనలో జీవితాంతం సేవ చేసే ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి. వారిని బానిసలుగా చూస్తూ..వెట్టి చేయించుకుని ముష్టి విదిల్చి పంపాలన్న ఎత్తగడగానే పాలన సాగుతోంది. ఉద్యోగ నియామకాలు ఎలాగూ లేవు. ఉన్న ఉద్యోగుకలు కాస్తా పెనషన్ ఎత్తేసి రెండు దశాబ్దాలు అవుతున్నా పట్టించుకోవడం లేదు. సిపిఎస్, రిక్రూట్‌మెంట్ నిలిపివేత, కాంట్రాక్టు, ఔట్‌సోర్స్ అనేవి ప్రపంచబ్యాంక్ ఆదేశిత, నయా ఉదారవాద విధానాలు.
వాటి అడుగు జాడల్లో నడిచే ప్రభుత్వాలకు ఆ విధానాలే శిలాశాసనాలు. ఉద్యోగులకు పెన్షన్ అనేది భిక్ష కాదు, హక్కుగా గుర్తించాలి. ఐదేళ్లు పాలించే వారికే పెన్షన్ ఉంటే 30 ఏళ్లపాటు ఉద్యోగాలు చేస్తున్నవారికి తప్పకుండా పెన్షన్ ఉండాల్సిందే. ఈ తత్వాన్ని పాలకులు అంగీకరించి తీరాలి. ప్రభుత్వాల మెడలు వొంచేదుకు ఉద్యోగులు సమైక్యంగా ఉద్యమించాలి. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్‌పిఎస్) స్థానంలో యూనిడ్ పెన్షన్ స్కీం (యుపిఎస్)ను తెస్తూ నరేంద్ర మోదీ కేబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మరో ఎన్నికల జిమ్మిక్కు కాక మరోటి కాదు. ఎందుకంటే మోదీ ఏ పనిచేసినా నిజాయితీ ఉండడం లేదని గుర్తించాలి. ఈ ఏడాదిలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోల గట్టెక్కేందుకు ఉద్యోగులకు వేస్తున్న ఎరగా గుర్తించాలి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడగా మహారాష్ట్ర ఎన్నికలూ ఇప్పుడే ఉన్నాయి.
ఈ సంవత్సరంలోనే దిల్లీ, జార?ండ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి.. రెండు దశాబ్దాల నుంచి ఎన్‌పిఎస్‌కు నిరసగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తుండగా, పదేళ్లుగా కేంద్రంలో తామే అధికారం వెలగబెడుతూ, హఠాత్తుగా పెన్షన్ అంశం మోదీ ప్రభుత్వానికి గుర్తుకు వచ్చిందంటేనే దాని ఎత్తుగడ ఏమిటో తెలియని అమాయకులు కాదు ప్రజలని గుర్తించాలి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పట్ల ఉద్యోగుల్లో వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో సీట్లు తగ్గాయి. అందుకే వారిని ఎలాగైనా మచ్చిక చేసుకునేందుకు పన్నిన పన్నాగంగా అర్థమైపోతుంది. ఇంత డ్రామాకూ ఒడిగట్టి మోదీ సర్కారు ఉద్యోగులకు కొత్తగా ఒరగబెట్టిందేవిరీ లేదు. ఎన్‌పిఎస్‌లో ఉద్యోగులు తప్పనిసరిగా తమ కంట్రిబ్యూషన్ చెల్లించాలి. చందా లేకుండా పాత పెన్షన్ స్కీం (ఒపిఎస్) ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఆ మౌలిక అంశాన్ని అంటుకోలేదు మోదీ సంకీర్ణ ప్రభుత్వం. అందుకే యుపిఎస్ పట్ల ఉద్యోగుల నిరసనలు ఎగసిపడుతున్నాయి.
ఏకీకృత పెన్షన్ అంటున్నా ఎక్కడా ఏకీకృతం కనిపించదు. పాతిక సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే బేసిక్‌లో 50 శాతం పెన్షన్ వస్తుంది. మిగిలిన వారికి సర్వీస్ బట్టి పెన్షన్ ఖరారు చేస్తారు. పెన్షన్ పొందాలంటే ఉద్యోగికి కనీసం పదేళ్ల సర్వీస్ నిండి ఉండాలి. కనీస పెన్షన్ రూ.10 వేలే. బేసిక్‌లో యాభ్కె శాతం పెన్షన్‌కు 20 ఏళ్ల సర్వీస్ ఉంటే సరిపోతుంది. కానీ 25 ఏళ్లు నిండాలన్నారు. ఈ నిబంధనలు ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ ఇచ్చేవేవిరీ కాదు. ఇదేనా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఆర్థిక భద్రత అన్నది ఆలోచన చేయాలి. ఎన్‌పిఎస్‌లో ఉన్న 23 లక్షల మంది యుపిఎస్‌లోకి మారితే గొప్ప ప్రయోజనం అంటోంది మోదీ సర్కారు. రాష్ట్రాలు కలిస్తే 90 లక్షల మందికి మేలు జరుగుతోందంటోంది. ఇదంతా తాము తీసుకొచ్చే యుపిఎస్ స్కీంకు ప్రమోషన్ వర్క్. ఉద్యోగులను మభ్యపెట్టే ఎత్తుగడగా గుర్తించాలి. ఇలాంటి ప్రయోగాలు చేసే బదులు గతంలో ఉన్న పెన్షన్ పునరుద్దరించడం ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలి. ఇందుకోసం రాజకీయ నాయకులకు ఇచ్చే పెన్షన్ ఎత్తేసినా ఫర్వాలేదు.
-కందుల శ్రీనివాస్





