Paris Olympics 2024 ప్యారిస్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ సత్తా చాటగలదా..!

రానున్న రెండు వారాల్లో జరుగనున్న బహుళ క్రీడా ఈవెంట్‌గా పారిస్‌ సమ్మర్‌ ఒలంపిక్స్‌-2024 కోసం భారత క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒలంరిక్‌ క్రీడల్ని సమ్మర్‌(వేసవి), వింటర్‌(శీతాకాల) ఒలంపిక్స్‌గా పోటీలను నిర్వహించడం అనాదిగా జరుగుతున్నది. పారిస్‌లో నిర్వహించనున్న సమ్మర్‌ ఒలంపిక్‌-2024 కోసం ప్రపంచ క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జూలై 26 నుంచి ఆగష్టు 11, 2024 వరకు ఫ్రాన్స్‌లోని పారిస్‌ నగరంలో నిర్వహించనున్న ‘‘సమ్మర్‌ ఒలంపిక్స్‌ – 2024’’లో పాల్గొనడానికి 113 మంది క్రీడాకారులు (పురుషులు 66, 47 మహిళల క్రీడాకారులు) తమ సత్తా చాటడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్చరీ(06 క్రీడాకారులు), అథెలెటిక్స్‌(30), బ్యాడ్మింటన్‌(07), బాక్సింగ్‌(06), ఈక్వేస్ట్రియన్‌(01), ఫీల్డ్‌ హాకీ(16), గోల్ఫ్‌(04), జూడో(01), రోయింగ్‌(01), సెయిలింగ్‌(02), షూటింగ్‌(21), స్విమ్మింగ్‌(02), టేబుల్‌ టెన్నీస్‌(06), టెన్నీస్‌(03), వెయిట్‌ లిఫ్టింగ్‌(01), రెజ్లింగ్‌(06 క్రీడాకారులు) అనబడే 16 క్రీడల్లో పాల్గొనడానికి 113 మంది భారత క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. 1900 నుంచి 2020 వరకు నిర్వహించిన ప్రతి సమ్మర్‌ ఓలంపిక్స్‌లో మన జట్టు పాల్గొనడం, పేలవ ఆటతీరుతో ఖాలీ చేతులతో వెనుదిరగడం జరుగుతోంది.

2036 ఒలంపిక్స్‌ ఆతిథ్యానికి భారత్‌ సిద్ధంగా ఉందా!
భారత్‌ గతంలో 2032 సమ్మర్‌ ఒలంపిక్స్‌కి ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపినా ఆ కోరిక నెరవేరలేదు. 2032లో ఒలంపిక్స్‌ నిర్వహణకు వేదికగా ఆస్ట్రేలియా, బ్రిస్బెన్‌ ఎంపికైందని మనకు తెలుసు. 2036లో జరిగే ఒలంపిక్‌ గేమ్స్‌ను తాము భారత్‌లోనే నిర్వహిస్తామనే ధృఢ అభిప్రాయంతో వేలంలో పాల్గొనడానికి ప్రధాని అంగీకారం కూడా తెలపడం ఆహ్వానించదగిన పరిణామంగా తీసుకోవాలి. 2036 ఒలంపిక్స్‌ వేలంలో దృవీకరించబడిన బిడ్లలో భారత్‌-అహ్మదాబాదు తో పాటు ఇండోనేషియా-నుసంతారా, టర్కీ-ఇస్తాంబుల్‌ లాంటి దేశాలు ఉన్నాయి. 2036 ఒలంపిక్స్‌ నిర్వహణకు అహ్మదాబాదు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నేతృత్వంలో అహ్మదాబాదు, గాంధీనగర్‌ పరిసరాల్లో 22 ప్రదేశాలను గుర్తించారు. ఒలంపిక్‌ ప్రమాణాలకు అనుగుణంగా అహ్మదాబాదులో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌ పేరుతో రూ: 4,600 కోట్లు ఖర్చు చేసి ఒక పెద్ద బహుళ క్రీడా వేదికలు నిర్మించబడుతున్నాయి. భారత్‌ ప్రతిపాదించిన బిడ్‌ ఆమోదం పొందితే, మన దేశం ఒలంపిక్‌ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది. దీని కోసం ముందుస్తు ప్రయత్నంగా 2030లో యూత్‌ ఒలంపిక్స్‌ను నిర్వహించుటకు కూడా ఉత్సాహం చూపుతున్నది.

ఐఓఏ, ఎస్‌ఏఐ, క్రీడా మినిష్ట్రీ ఏకతాటిపైకి రాగలవా !
ఇండియన్‌ ఒలంపిక్‌ అసోసియేషన్‌, ఐఓఏ నేతృత్వంలో పారిస్‌కు వెళుతున్న క్రీడాకారులతో 13 సభ్యుల మెడికల్‌ టీమ్‌, సపోర్ట్‌ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ వైద్య జట్టులో స్లీప్‌ థెరపిస్ట్‌, సైకాలజిస్ట్‌, న్యూట్రిషనిస్ట్‌, 24 గంటల మెడికల్‌ రూమ్‌  సదుపాయం కూడా ఈ సారి ఏర్పాటు చేస్తున్నారు. పారిస్‌ జట్టులో ఒలంపిక్‌ మెడలిస్ట్‌ ‘గగన్‌ నరంగ్‌’ను ‘చెఫ్‌-డి -మిషన్‌’గా (మేరీ కోమ్‌ స్థానంలో) జట్టు వెంట వెళ్లనున్నారు. ఐఓఏ అధ్యక్షురాలు పి. టి. ఉష నియమించిన సిఈఓ రఘురామన్‌ అయ్యర్‌ నియామకాన్ని ఇంటర్నేషనల్‌ ఒలంపిక్‌ కమిటీ(ఐఓసి), స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐ), క్రీడా మినిస్ట్రీలు అంగీకరించినప్పటికీ ఐఓఏ కార్యనిర్వాహక వర్గం మనస్ఫూర్తిగా ఒప్పుకోవలసి ఉంది. పారిస్‌-2024 ఒలంపిక్స్‌లో ప్రారంభ వేడుకల్లో భారత జట్టుకు ఫ్లాగ్‌ బేరర్‌గా పి. వి. సింధుకు అవకాశం ఇవ్వబడిరది. వివిధ క్రీడా సంఘాల సభ్యులు విభేదాలు మరిచి క్రీడాకారుల మనోభావాలకు గొడుగులు పడుతూ, ప్రోత్సహిస్తూ అత్యధిక ఒలంపిక్‌ మెడల్స్‌ సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సగటు భారతీయులు కోరుకుంటున్నారు. టోక్యో ఓలంపిక్స్‌ – 2020 క్రీడల్లో 124 క్రీడాకారుల భారత జట్టు పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించిన నీరజ్‌ చోప్రాతో పాటు మరో ఆరుగురు ఒలంపిక్‌ పతకాలు గెలుచుకోవడంతో గతం కన్న మెరుగైన ఫలితాలను తీసుకువచ్చారని తెలుస్తున్నది.

పారిస్‌ సమ్మర్‌ ఒలంపిక్స్‌-2024లో 10కి పైగా పతకాలు సాధించగలరా!
పారిస్‌ సమ్మర్‌ ఒలంపిక్స్‌-2024లో నీరజ్‌ చోప్రా(జావెలిన్‌ త్రో), పి వి సింధు(షటిల్‌), సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకీరెడ్డి/చిరాగ్‌ శెట్టీ(బ్యాడ్‌మింటన్‌), లోవ్‌లీనా బోర్‌గొహైన్‌(బాక్సింగ్‌), నిఖత్‌ జరీన్‌(బాక్సింగ్‌), అంతిమ్‌ పంగల్‌(రెజ్లింగ్‌), మీరాభాయ్‌ చానూ(వెయిట్‌ లిఫ్టింగ్‌), మను బాకర్‌(షూటర్‌), ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌(షూటింగ్‌), మెన్స్‌ హాకీ క్రీడాకారులు తప్పక ఒలంపిక్‌ పతకాలు గెలుస్తారని నమ్ముతున్నాం. మన క్రీడాకారులు తమ సత్తా క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి కనీసం 10కి పైగా ఒలంపిక్‌ పతకాలు సాధించాలని కోరుకుందాం, మన భారత క్రీడాకారులను ప్రోత్సహిద్దాం. 2036 నాటికి భారత్‌ టాప్‌ 10 క్రీడా దేశాల జాబితాలోకి చేరడానికి, 2047 వరకు టాప్‌ 5 దేశంగా ఉండాలనే లక్ష్యాలతో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా క్రీడా కేంద్రాలు, మౌళిక సౌకర్యాలను కల్పించడానికి రూ: 3,000 మిలియన్లు వెచ్చిస్తున్నారు. రానున్న సమ్మర్‌, వింటర్‌ ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి రికార్డు స్థాయిలో పతకాల పంట పండిరచాలని కోరుకుందాం.
-డా.బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌,
9949700037 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *