స్వల్పకాలిక చర్చలో మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘మేం ఇచ్చిన నోట్‌లో రైతు భరోసాపై ఏ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచాం. బీఆర్‌ఎస్ ఏది చెబితే.. అది అమలు చేయాలనే ఆలోచన వారికి ఉంది. ఏ పంటకు ఎంత ఇస్తామనేది ఇంకా నిర్ణయించలేదు. సభలో సభ్యుల సూచనల తర్వాతే నిర్ణయిస్తాం. పత్తి, చెరకుకు ఏం చేయాలనేది సభ్యులు చెబితే.. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రైతుబంధులో కోతలు విధిస్తామని మేం చెప్పలేదు. ప్రజలు, సభ్యుల అభిప్రాయం ప్రకారం విధివిధానాలు నిర్ణయిస్తాం‘ అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు 7వరోజు ఉదయం శాసనసభ ప్రారంభం కాగా స్పీకర్ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు.
రైతు భరోసా పక్రియపై సభ్యులు సలహాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలను సంక్రాంతి పండుగ నాటికి ఖరారు చేసి అనంతరం రైతు భరోసా చెల్లింపులు జరుపుతామని మంత్రి ప్రకటించారు. ఈ చర్చలో భాగంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం 2017-18లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి సీజన్‌కు ఎకరాకు రూ.4వేలు రైతుల ఖాతాల్లో జమ చేసిందని, 2018-19లో ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచామన్నారు. ఈ పథకంలో పేర్కొన్నట్లు భూమిని సాగుచేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని, అయితే ఈ పథకం అమలులో చాలా తేడా ఉందన్నారు.
దీనిని సక్రమంగా అమలు చేసేందుకు వివిధ నిధులను నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. పలువురు నిపుణులు, రైతుల సలహాలు, సూచనలు తీసుకుని ఈ కమిటీ విధివిధానాలను సిద్ధం చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జనవరిలో అమలు చేయాలని భావించిన ఈ పథకానికి సంబంధించి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి.. వీటన్నింటిని క్రోడీకరించి తుది విధివిధానాలు ఖరారు చేసి ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమా సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.