రైతు బంధు ఇస్తే… అసలు చర్చ ఎందుకు..?

  • గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది
  • వివిధ కొర్రీలతో రైతులకు ఎగమానం పెట్టేందుకు కాంగ్రెస్‌ కుట్ర : మాజీ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌ 21: రైతులకు ఇచ్చే రైతు బంధ పథకంలో వివిధ కారణాలతో ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్ధ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు..? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ నిలదీశారు. రైతుభరోసాపై ప్రభుత్వం చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. మేం ఒక దఫా మాత్రమే చెల్లించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చెప్పడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతుబంధు రూ. 21,283 కోట్ల దుర్వినియోగం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారని, 2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలని మంత్రే చెప్పారని గుర్తు చేశారు.

2020-21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలు అని మీరు ఇచ్చిన నివేదికలో ఉందని, రైతుబంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు.నాలుగున్నర లక్షల గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల కింద ఉన్న భూముల్లో ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుందన్నారు. మేజర్‌ కాల్వలు ఉండకపోవడం వల్ల చాలా కష్టంతో సాగు చేస్తారన్నారు. ఈ గిరిజన బిడ్డలకు రెండో విడత రైతుబంధు ఇస్తారా..? ఇవ్వరా..? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక పత్తి 45 లక్షల ఎకరాల్లో పండుతుందని, ఈ పంట కాలం 8 నెలలు, మరి పత్తి రైతుకు ఒకటే పంటకు ఇస్తారా..? రెండు పంటలకు ఇస్తారా..? అలాగే కంది పంట కాలం కూడా 8 నెలలు.. కాబట్టి కంది పంటకు ఒకటే సారి ఇస్తారా..? రెండు సార్లు ఇస్తారా..? లేదా అనేది చెప్పాలి అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రైతుబంధుకు కోతలు పెట్టే ఆలోచన లేకపోతే పీఎం కిసాన్‌ గురించి మంత్రి తుమ్మల ఎందుకు ప్రస్తావించారని నిలదీశారు. పీఎం కిసాన్‌ మార్గదర్శకాలు మీకు మార్గదర్శకం అయితే.. 25 శాతం మంది రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందన్నారు.

 

పీఎం కిసాన్‌ మార్గదర్శకాలు పాటించమని మంత్రి తుమ్మల చెబుతున్నారని, మరి ఉన్నది ఉన్నట్టు ఇచ్చేందుకు రైతుబంధుపై చర్చ ఎందుకు..? రైతుబంధుకు కోతలు పెట్టం అనుకుంటే ఎందుకీ చర్చ. కంది, పత్తి 8 నెలల పంట. పామాయిల్‌ పంటను విపరీతంగా ప్రోత్సహించామన్నారు. పామాయిల్‌ పంటకు, మామిడి తోటలకు రైతుభరోసా ఇస్తారా..? ఇవ్వరా..? రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మూడు పంటలు సాగు చేసే వారు ఉన్నారన్నారు. మరి మూడు పంటలకు రైతుభరోసా ఇస్తారా..? ఇదే శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మూడో పంటకు ఎందుకు ఇవ్వరు అని మా ప్రభుత్వాన్ని నిలదీశారు. కాబట్టి మూడో పంటకు రైతుబంధు ఇస్తారా..? ఇవ్వరా..? అనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page