- దేవుడి దర్శనానికి వొచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్
- అఘాయిత్యానికి పాల్పడని వారిలో ఆలయ ఉద్యోగి
- అడ్డుకున్న బంధువును తాళ్లతో కట్టేసి ఘాతుకం
కల్వకుర్తి, ప్రజాతంత్ర, మార్చి 31: నాగర్ కర్నూలు (Nagar Karnool) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊరుకొండ పేట ఆంజనేయస్వామి దర్శనం కోసం వొచ్చిన ఓ వివాహితపై ఆలయ ఉద్యోగితో పాటు మరో ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులను చేతులు కాళ్లు కట్టేసి దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకోగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, భూత్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత (30) శనివారం రాత్రి అంజన్న దర్శనం కోసం ఊరుకొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వొచ్చింది. దర్శనం అనంతరం నిద్రకు ఉపక్రమించారు. అనంతరం బాత్రూం కోసం వెళ్లినట్లు మాటు వేసి గుర్తించిన యువకులు పక్కనే ఉన్న గుట్టపైకి ఈడ్చుకెళ్ళి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఓ బంధువు అనుమానించి వెతకడం ప్రారంభించారు. అతడిని గ్రహించిన యువకులు చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి పరారయ్యారు. అఘాయిత్యానికి పాల్పడ్డ వారిలో ఆలయ ఉద్యోగితో పాటు బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, క్రాంతి, కార్తీక్, బాబా, కౌకుంట్ల హరీష్, మహేష్, వాగుల్దార్ మణికంఠ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ తరలించినట్లు తెలిపారు.