మహిళా దినోత్సవం రోజున అమలుకు శ్రీకారం..
•పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభించేందుకు కసరత్తు
•ఉన్నత స్ధాయి సమీక్షలో మంత్రి సీతక్క
•అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించాలని ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 1 : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించాలని పంచా యతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అధికా రులను ఆదేశించారు. ఆర్థిక రంగంలో తెలంగాణ గ్రామీణ మహిళలు సాధించిన విజయాలను ప్రపంచానికి చాటాలని సూచించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క అధికారులతో సచివాలయంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన, స్పెషల్ కమిషనర్ బి.షఫీఉల్లా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ హాజరైన సమావేశంలో.. మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ, మహిళా సాధికారత కోసం కొత్తగా తీసుకోబోయే కార్యక్రమాలపై చర్చించారు.
మహిళా సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో దాన్ని హైలెట్ చేసే విధంగా మహిళా దినోత్సవ వేదికగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. లక్ష మంది మహిళలతో తలపెట్టిన సభకు.. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, డిప్యూటి సీఎం, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పలు కొత్త పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అందులో ముఖ్యంగా ప్రతి జిల్లాల్లో మహిళా సంఘాలచే ఏర్పాటు కాబోయే సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. మొత్తం 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగా వాట్ల చొప్పున మొత్తం 64 మేగా వాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. మొదటి విడతలో 50 ఆర్టీసీ అద్దే బస్సులకు పచ్చా జెండా ఊపి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నారాయణపేట జిల్లాల్లో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంక్ తరహాలోనే మిగిలిన 31 జిల్లాల్లోనూ పెట్రోల్ బంకులు ప్రారంభించేలా బీపీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ వంటి ఆయిల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.
దీంతో పాటు వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు అందచేయనున్నారు. ఈ ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘ సభ్యులకు రూ.40 కోట్ల ప్రమాధ భీమా చెక్కులను అందచేస్తారు. ఇక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 14 వేల కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియను లాంచ్ చేయనున్నారు. ఇక ఇందిరా మహిళా శక్తి-2025 విధానాన్ని విడుదల చేయనున్నారు. ఇవే కాకుండా మహిళా ప్రాంగణాల్లో మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో ఆయా మహిళలకు సబ్సిడీలో ఆటోలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పట్టణాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేసేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సెర్ప్, మెప్మాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. వీటితో పాటు మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్దిక పటిష్టత కోసం మరి కొన్ని పథకాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక పలు రాష్ట్రాల్లో మహిళా సంక్షేమం కోసం అవలంభిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసి, దేశంలోకెల్లా అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.