- హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా
- పదేళ్లపాటు వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయి
- మూసీ నిర్వాసితులకు అన్యాయం మాట అబద్దం
- పాతబస్తీ మెట్రోను అడ్డుకునే కుట్రలు
- బిఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తే.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.7,380 కోట్లకు అమ్ముకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయన్నారు. పాతబస్తీలో మెట్రోరైలు నిర్మాణాన్ని అడ్డుకున్నారని విమర్శించారు.
‘మూసీ’ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారన్న ప్రతిపక్షం ఆరోపణలను మంత్రి ఖండించారు. మూసీ బఫర్ జోన్, ఎప్టీఎల్‌ను ఎక్కడ ముట్టుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మూసీ ప్రజలకు 10వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రకటించారని గుర్తుచేశారు. శుక్రవారం సచివాలయం డియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… అధికారంలో ఉంటే ఒకలా.. అధికారం కోల్పోతే మరోలా తాము మాట్లాడమని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు.
మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుందని.. అక్రమ కట్టడాలు అయినా.. ఇళ్లను కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు రింగ్ రోడ్డును రూ. 7వేల కోట్లకు అమ్ముకుంది గత బీఆర్‌ఎస్ పార్టీ కాదా! అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కృష్ణా, గోదావరి నీళ్లు ఒక్క టీఎంసీ అయినా తెచ్చారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో చేసింది ఏంటి అంటే శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను డిస్టర్బ్ చేయలేదని అన్నారు.
గతంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు వొస్తే రూ. 10వేలు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పంచుకొని చేతులు దులుపుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలపై మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రేమ ఉంటే నన్ను కలిసి అభిప్రాయం పంచుకోండి. రాబోయే రోజుల్లో రూ. 5500 కోట్లతో మూసీకి గోదావరి నీరు తెచ్చే ఆలోచన చేస్తున్నాం. ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకుని వాస్తవ విమర్శ చేయాలి..లేదంటే పర్యవసానం తప్పదు! బీజేపీ – బీఆర్‌ఎస్ పార్టీలు తాన అంటే తందాన అని అంటుఅన్నాయి. సోషల్ డియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ – బీఆర్‌ఎస్ పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు‘ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.





