మాకు న్యాయం చేయండి..

  • మామునూరు భూ నిర్వాసితుల ఆందోళన
  • భారీగా తరలివచ్చిన రైతులు.. తీవ్ర ఉద్రిక్తత
  • భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్‌

‌వరంగల్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు మంగళవారం ఉదయం నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్‌ ‌చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు రైతులు. ఆందోళనలో భారీగా మహిళలు పాల్గొన్నారు. సమాచారం అందిన వెంటనే మామూనూరు ఎయిర్‌పోర్టు వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. మామునూరు ఎయిర్‌పోర్టు రావడం సంతోషకరమే అయినా భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. మాములూరుకు సమీపంలో ఉన్న గవిచర్ల క్రాస్‌ ‌రోడ్డు మీదుగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్‌పోర్టులో కలిసిపోతుంది.

రహదారి మూసివేస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కలపల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టును తామేమీ వ్యతిరేకించడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం రావడం సంతోషకరమన్నారు. ఎయిర్‌పోర్టు రావడం వల్ల ఎంతైతే లాభపడుతున్నామో.. అంతకంటే ఎక్కువ నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో ధర్నాకు దిగినట్లు వారు తెలిపారు. మార్కెట్‌ ‌వాల్యూ ప్రకారమే రేట్‌ ఇస్తామని లేదా రైతులు కోరుకున్న చోటే వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములు ఇస్తామని మంత్రి సురేఖ చెప్పారని అన్నారు. నీటి వసతి, విద్యుత్‌ ‌సౌకర్యం కల్పిస్తామని కూడా మాట ఇచ్చినట్లు తెలిపారు.

కానీ ఇప్పుడు భూములకు భూమి ఇవ్వకపోవడమే కాకుండా.. తమ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని కూడా మూసి వేస్తున్నారని.. అంతే కాకుండా కొత్తగా రోడ్డు మార్గానికి ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదని అన్నదాతలు వాపోయారు. తమకు కచ్చితంగా న్యాయం చేయాలని రైతులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. కాగా.. తెలంగాణ రెండవ ఎయిర్‌పోర్టుకు మార్గం సుగమం అయిన నేపథ్యంలో ఇక్కడ భూసేకరణకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం భూసేకరణ సర్వే చేయాలని నిర్ణయించారు అధికారులు.

అయితే సర్వేను అడ్డుకునేందుకు రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. కాసేపటి క్రితమే ఎయిర్‌ ‌పోర్ట్ ‌భూసేకరణ సర్వేకోసం హనుమకొండ ఆర్డీవో సత్యపాల్‌ ‌రెడ్డి, తహసీల్దార్‌ ‌నాగేశ్వరరావు అక్కడకు వెళ్లారు. దీంతో అధికారులను రైతులు, మహిళలు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని అధికారులను నిర్వాసితులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్‌తో వరంగల్‌ ఆర్డీవో, తహసీల్దార్‌ ‌ఫోన్‌ ‌లో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం భూసేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page