– కృతజ్ఞతలు తెలిపిన ఆనంద్
– నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ
– 1న బాధ్యతలు తీసుకోనున్న నూతన డీజీపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతిభద్రతల పరిరక్షణలో తనపై నమ్మకం ఉంచి డీజీపీగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త డీజీపీ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం, పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసే అంశాలపై సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉన్న సీవీ ఆనంద్ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ బాస్‌గా పగ్గాలు చేపట్టడంతో పోలీస్ శాఖలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (1991 బ్యాచ్)ను డీజీపీగా నియమిస్తూ సీఎస్ కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత డీజీపీ బి.శివధర్‌రెడ్డి గురువారం (30వ తేదీ) పదవీ విరమణ చేయనుండగా మే 1న సీవీ ఆనంద్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి డీజీపీలుగా నియమితులైన అందరూ తొలుత ఇన్‌చార్జి డీజీపీలుగా బాధ్యతలు నిర్వర్తించగా సీవీ ఆనంద్ మాత్రం పూర్తిస్థాయి డీజీపీగా నియమితులు కావడం గమనార్హం. 2028 జూన్ వరకు అయన కొనసాగనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




