ప్రాంతీయ భాషలకు కేంద్రం ప్రోత్సాహం
మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు…
ప్రతి భారతీయుడూ తన మాతృభాషలో చదువుకోవాలి.. మాట్లాడాలి,
భాషను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం
ఇటీవలే 5 భాషలకు ప్రాచీన భాష హోదా
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని . భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యం గల దేశం భారత్ అని, ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యం ఉన్న దేశం మరొకటి లేదని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన దేశంలో 121 భాషలు ఉన్నాయని, మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవి.. నేడు ఆ సంఖ్య మోదీ ప్రభుత్వం వొచ్చిన తర్వాత 21 భాషలకు పెరిగింది. ఈ భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్ పేయి నేతృత్వంలో ఉన్నప్పటినుంచి ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇస్తున్నదని, చెప్పారు. భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్ పేయి చెప్పేవారు. జ్ఞానాన్ని ప్రసరింప జేసేందుకు 1835లో మెకాలే ద్వారా భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇంగ్లీష్ కు ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం.. 1956లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినపుడు.. దేశానికి సహకార సమాఖ్య, పాలనాపరమైన అంశాల కోసం భాష కీలకమైన అంశంగా మారింది. పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు సంతృప్తిగా లేని కారణంగా.. మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగా… మోదీ 2020లో ఎన్ఈపి -2020 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా.. కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారు.
మన భాషలు.. మన దేశాన్ని జోడించే పనిచేస్తున్నాయి. బీజేపీ భారతీయ భాషల ప్రోత్సహించే విషయంలో.. ఏడాడూ వెనక్కు తగ్గలేదు. సింధీని అధికార భాషల జాబితాలో చేర్చే సందర్భంలో వాజ్ పేయి.. ‘మై హిందీ బోల్తా హూ.. లేకిన్ సింధీ మేరీ మౌసీ హై’ అని అన్నారు. కొంకణి, మైతీ, నేపాలీ భాషలకు అధికార భాషలుగా చేర్చాం..బోడో, డోగ్రీ, మైథిలీ, సంథాలీ భాషలను 8వ షెడ్యూల్ లోచేర్చే చట్టాన్ని 2003లో ఎన్డీయే ప్రభుత్వం చేర్చింది. 2003లో నాటి ఉప ప్రధాని అద్వాణీ.. ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్ లో అధికార భాషల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాం. దీని ప్రకారం.. జమ్మూకశ్మీర్లో అధికారిక అవసరాల కోసం.. కశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీని వినియోగించేలా చట్టం తీసుకొచ్చాం. మోదీ ప్రభుత్వంలో జరిగిన ఎన్ఈపి-2020 ద్వారా స్థానిక భాషలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. మొదట్లో దీన్ని విమర్శించిన వారు కూడా.. ఇప్పుడు సమర్థిస్తున్నారు. విద్యావిధానం సులభతరమవుతుందని, మాతృభాషలో విద్య ద్వారా వికాసం సాధ్యమవుతుందన్న వివిధ అధ్యయనాల ఆధారంగానే మోదీ సర్కారు ముందుకెళ్తోంది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, ప్రొపెషనల్ ఎడ్యుకేషన్ (ఇంజనీరింగ్, మెడికల్ వంటివి) ప్రతిచోటా మాతృభాషలో విద్యనభ్యసించేందుకు విద్యార్థులు కూడా గర్వపడుతున్నారు. ఆదివాసీల భాషలను సంరక్షించేందుకు కూడా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కూడా ఈ భాషల ద్వారా సంరక్షించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
భారతీయ భాషలకు ప్రోత్సహించేందుకు ‘అస్మిత’
యూజీసీ ద్వారా.. భారతీయ భాషలకు ప్రోత్సహించేందుకు ‘అస్మిత’ను తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వన్ క్లాస్ వన్ చానల్ పేరుతో.. 1 నుంచి 12 వతరగతి వరకు.. వివిధ భారతీయ భాషల్లో క్లాసులు చెప్పేందుకు.. 200 పీఎం ఈ-విద్య చానల్స్ ను మోదీ సర్కారుప్రారంభించిందన్నారు. ఇటీవలే మోదీ ప్రభుత్వం 234 నగరాల్లో 735 ప్రైవేటు ఎఫ్ఎం చానల్స్ కు కేబినెట్ ఆమోదించింది. ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం ఇవ్వాలనేదే ఈ నిర్ణయం వెనకున్న ఆలోచన. మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినట్లో.. 3 అక్టోబర్, 2024 నాడు.. 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజెస్ హోదా ఇచ్చాం. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృత భాషలకు ఈ హోదా ఇచ్చాం. దీంతో భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన భాషలు తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, సంస్కృత్ తో కలుపుకుని..11 భాషలకు ఈ హోదా అందింది. ఇది ప్రాంతీయ భాషల ప్రోత్సాహం, సంరక్షణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం. విద్యాశాఖ ద్వారా.. క్లాసికల్ లాంగ్వేజెస్ లకు ప్రోత్సాహం అందించేందుకు.. కృషిచేస్తోంది. సంస్కృత భాషలను ప్రోత్సహించేందుకు 3 రాష్ట్రీయ సంస్కృత్ విశ్వవిద్యాలయ్ లను స్థాపించాం. క్లాసికల్ లాంగ్వేజెస్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించేందుకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందిస్తున్నాం. ఈ ఏడాది హిందీ భాషకు అధికార భాష హోదా అంది 75 ఏళ్లు అయింది. హిందీ భాషపై కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే వివాదం చేసే ప్రయత్నం చేశాయి. కానీ ప్రజలు అన్ని భాషలను సమానంగా ఆదరించారు.
హిందీ బలోపేతం కావాలి.. ప్రాంతీయ భాషలు కూడా బలోపేతం కావాలి. అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు వీలు కలుగుతుంది. భారతీయ భాషల పట్ల మనమంతా గర్వించాలి. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. దీంతోపాటుగా మన మాతృభాషలకు కూడా సరిగ్గా గౌరవించుకోవాలి. మోదీ ప్రభుత్వం.. భాషల అనువాదం పైనా ప్రత్యేక దృష్టి సారించింది. యూజీసీ, ఏఐసీటీఈ వంటి సంస్థల ద్వారా వివిధ సులభ పద్ధతులను తీసుకొచ్చింది. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ పేరుతో.. ప్రాంతీయ భాషలు, ప్రాంతీయ సంస్కతి, ప్రాంతీయ కళాకారులను ప్రోత్సహిస్తోంది. కాశీ-తమిళ్ సంగం, కాశీ-తెలుగు సంఘం, కాశీ-సౌరాష్ట్ర సంగమం, వితస్థా వంటి కార్యక్రమాల ద్వారా.. మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి భారతీయుడూ తన మాతృభాషలో చదువుకోవాలి, మాతృభాషలో మాట్లాడాలి, మాతృభాషను ప్రోత్సహించాలి. భాషను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం. ప్రాంతీయ భాషల మీడియా.. ఇంగ్లీష్ చానళ్ల కంటే.. కీలకంగా మారింది. ప్రాంతీయ భాషల పాత్రికేయులను, మీడియా సంస్థలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరం సమష్టిగా మన తల్లిభాషలను కాపాడుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.