అనంతారం… మ‌రో ఉద్దానం..

ఉసురు తీస్తున్న… కిడ్నీ జబ్బులు
అనంతారంలో అందరికీ మూత్ర‌పిండ స‌మ‌స్య‌లు
మూడేళ్లలో పది మంది కన్నుమూత
రెండు నెలల్లో చిన్నారితో పాటు ఇద్దరు మృతి
మంచంలో మగ్గుతున్న డయాలసిస్ పేషెంట్లు
గ్రామంలో  30 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు
స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించాల‌ని గ్రామస్తుల గ‌గ్గోలు..

జూలూరుపాడు, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఏపీలో ఉద్దానం గ్రామం మాదిరిగా తెలంగాణ లో ఓ గ్రామంలో ప్ర‌జ‌లు కిడ్నీ సంబంధిత‌ వ్యాధుల‌తో  త‌ల్ల‌డిల్లిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో ఎక్క‌డ చూసినా కిడ్నీ  వ్యాధిగ్ర‌స్తులే క‌నిపిస్తున్నారు.   ఈ గ్రామంలో 185 కుటుంబాలు ఉండగా 699 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో అందరూ వ్యవసాయం, వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తుంటారు. కానీ చాప కింద నీరులా గ్రామంలో కిడ్నీ వ్యాధి ఓ మహమ్మారిలా తయారై గ్రామస్తులను పట్టిపీడిస్తోంది.  ఇప్ప‌టికే కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. గత పదేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధులు గ్రామ ప్రజల ఆరోగ్యంపై పగబట్టాయి. ఇక్క‌డివారు  ఏదో ఒక అనారోగ్య కారణంతో నీరసించి పోతున్నారు.  ద‌వాఖాన‌ల‌కు వెళ్లి చికిత్స పొందిన కొంతమంది ఆరోగ్యం కుదుటపడుతుండగా, మరికొందరికి కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్య‌ పరీక్షల్లో నిర్ధారణ అవుతున్నాయి.
image.png
వీరిలో కొందరు వైద్య నిపుణుల సలహా తీసుకుని మందులు వాడటంతో వ్యాధులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఆరోగ్యం సహకరించక అనారోగ్యం మరింత పెరిగి క్షీణించిన వారూ ఉన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఆరుగాలం కష్టపడి శ్రమించే  ప్ర‌జ‌ల‌ ఉసురు తీస్తుండటం బాధాకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ముగ్గురు మృతి చెందారు. ఇటీవల రెండు నెలల వ్యవధిలోనే బాలికతో పాటు మరో ఇద్దరు మృతి చెందటం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన రెండు నెలల్లో గ్రామానికి చెందిన 33 ఏళ్ల‌ యువకుడు కోరం నరేష్, ఎనిమిదేళ్ల బాలిక పాలెపు సాహితి, 30 ఏళ్ళ యువతి పూనెం ప్రేమలత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు. వరుస మరణాలు గ్రామం వ‌ణికిపోతోంది. వీరి మ‌ర‌ణాలు వైద్యశాఖకు కూడా సవాల్ విసురుతున్నాయి. ఇంకా గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇంకా గ్రామంలో మందెరికల సత్యనారాయణ, కోరం నాగేశ్వరరావు పలువురు డయాలసిస్ తీసుకుంటూ అవస్థలు పడుతున్నారు.
స‌రైన‌ వైద్యం అందుబాటులో లేక అవస్థలు…
గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అనంతారం గ్రామస్తులకు వైద్యం అందుబాటులో లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షల కోసం కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లోని పెద్ద హాస్పిట‌ల్స్‌ వెళ్లాల్సి వొస్తోంది.వైద్య పరీక్షలతో పాటు వైద్యం కూడా ఖరీదైనది కావడంతో పేద కుటుంబాలకు ఆర్థిక‌ భారమ‌వుతోంది. కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ వంటి ద‌వాఖాన‌ల‌కు వెళ్లినా కూడా త‌మకు సరైన చికిత్స‌ దొరకటం లేదని రోగులు వాపోతున్నారు. డయాలసిస్ చేయించుకోవడానికి మరింత ఇబ్బందులు పడాల్సిన వొస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని రోగులు మంచానపడి మగ్గాల్సి వొస్తుందని బోరున విలపిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల బారినపడి అల్లాడుతున్నా కూడా అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడంలో అధికార‌ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద‌ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
image.png
గ్రామంలో తాగునీటి స‌మ‌స్య‌
గ్రామంలో తాగునీటి సరఫరా వ్యవస్థ కొంతకాలంగా  అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయడం, ప్రతినెలా విధిగా నీటి పరీక్షలు చేయడం వంటి కనీస జాగ్రత్తలు కూడా ఇటీవల చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రబలడానికి కారణం ఏంటనే విషయాన్ని గుర్తించడంలోనూ అధికారులు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని చెబుతున్నారు. నెలల తరబడి వైద్య పరీక్షలు, మందులు వాడుతూ, మంచాన పడి చివరకు కొందరు కళ్ళముందే చనిపోతుండటంతో భయం వేస్తుందని గ్రామస్తులు గ‌గ్గోలుపెడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు గ్రామాన్ని సందర్శించి కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రబలడానికి కారణాలను పరిశీలించడంతోపాటు, రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందించి, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వైద్య శిబిరం
అనంతారం గ్రామంలో కిడ్నీ వ్యాధి సోకి అనారోగ్యంతో పలు ఇబ్బందు పడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్.. వెంట‌నే చర్యలు తీసుకోవాల‌ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించారు. ఈ మేరకు గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మండల ప్రభుత్వ వైద్యాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటి తిరిగి అనారోగ్యం బారిన పడిన వారి నుంచి రక్త నమోనాలను సేకరించారు. కిడ్నీ వ్యాధులకు గ‌ల కారణాలపై ఆరా తీస్తున్నామని, రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స  అందిస్తామ‌ని వైద్యాధికారి తెలిపారు. గ్రామంలో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నట్లు గుర్తించామని, ఇంకా మరో 30 మందికి ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించిన‌ట్లు తెలిపారు. ఈ జబ్బులకు తాగునీరు కారణం కాదని అన్నారు. మరే కారణమై ఉంటుందోన‌నే విషయంపై పరిశీలనలు చేస్తున్నామని, రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందించేందుకు ప‌టిష్ట‌మైన చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారి వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page