ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై జయశంకర్ స్ఫూర్తిని ఎత్తి పడదాం

“రాజ్యాంగ సంస్థలు అధికార పార్టీకి అనుబంధ విభాగాలుగా పనిచేయడానికి కాదు,ప్రజాస్వామ్య ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడ్డాయి.వాటి నియామకాలు,నిర్ణయాలు,కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి.ప్రజాస్వామ్యాన్ని కాపాడేది వ్యక్తి ఆరాధన కాదు, వ్యవస్థల స్వతంత్రత. నాయకుడిని ప్రశ్నించకూడదనే సంస్కృతి పెరిగినప్పుడు ప్రజాస్వామ్యం క్రమంగా వ్యక్తి కేంద్రిత పాలనగా మారుతుంది.రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం,సౌభ్రాతృత్వం కేవలం పుస్తకాలకు పరిమితమైనవి కావు.అవి పాలనలో ప్రతిబింబించాలి..”

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఆరు దశాబ్దాల ఉద్యమానికి వారధి.వారు ఒక సామాజిక విశ్లేషకులు,ఆర్థికవేత్త,విద్యావేత్త,గొప్ప ప్రజాస్వామికవాది, అన్నింటికంటే ముఖ్యముగా తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి వైజ్ఞానిక దృక్పథాన్ని అందించినమేధావి.వారిఆలోచనలు,ప్రసంగాలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ప్రజాస్వామ్యం,సమానత్వం,సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధత వెలకట్టలేనిది.

ఆచార్య జయశంకర్ ఒక ప్రాంతీయ ఉద్యమానికే పరిమితం కాకుండా ఒక ప్రాంతం ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ,సామాజిక వివక్షతలను గణాంకాల ఆధారంగా విశ్లేషించి,ప్రజాస్వామిక హక్కుల పోరాటంగా మలిచిన అరుదైన సామాజిక శాస్త్రవేత్త.తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన గొప్ప కానుక భావోద్వేగం మాత్రమే కాదు.వైజ్ఞానిక దృక్పథం కూడా.నీళ్లు,నిధులు,నియామకాల్లో జరిగిన అన్యాయాలను ఆధారాలతో నిరూపించి,ప్రాంతీయ అసమానతలను జాతీయ చర్చగా మార్చిన తాత్వికుడు సార్.ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం,ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు.ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం, ప్రాంతాలకు స్వయంపాలన,వనరులపై సమాన హక్కులు కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది అనే స్ఫూర్తిని వారు చేసిన ఉద్యమం చాటిచెప్పింది.ఆచార్య జయశంకర్ ఆలోచనల్లో స్వయం పాలన అనేది వేర్పాటువాద భావన కాదు.అది సమాఖ్య ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ అస్తిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని, ప్రజల రాజకీయ అధికారాన్ని గుర్తించే రాజ్యాంగబద్ధమైన ఆకాంక్ష గా పరిగణించారు.ఆయన చేసిన మహత్తర పోరాటం అధికార మార్పిడి కోసం కాదు,అధికార వికేంద్రీకరణ కోసం అనితెలంగాణరాష్ట్రం రుజువుచేసింది.పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని,అట్టడుగు వర్గాలకు నిర్ణయాధికారం దక్కాలని ఆకాంక్షించిన ప్రజాస్వామిక దార్శనికుడు జయశంకర్.

ఒక సమాజం అభివృద్ధిని కేవలం స్థూల రాష్ట్ర ఉత్పత్తి, పెట్టుబడులు,మౌలిక సదుపాయాలతో కొలవలేమని, విద్య,వైద్యం,ఉపాధి,సామాజిక సమానత్వం,వనరుల న్యాయమైన పంపిణీ అభివృద్ధికి అసలైన కొలమానాలని జయశంకర్ ఆలోచనా దృక్పథం గుర్తుచేస్తుంది.జయశంకర్ ఆలోచనల్లో సామాజిక న్యాయం అనేది రాజకీయ నినాదం కాదు.కుల, వర్గ, ప్రాంతీయ అసమానతలను తొలగించి, ప్రతి సామాజిక సమూహానికి సమాన అవకాశాలు కల్పించే నిర్మాణాత్మక పరివర్తన గా పరిగణించాలి.తెలంగాణ ఉద్యమం భారత సమాఖ్య వ్యవస్థలో ప్రాంతీయ ఆకాంక్షలకు ఉన్న ప్రజాస్వామిక ప్రాధాన్యతను చాటిచెప్పింది.భిన్నత్వాన్ని గౌరవించడం,రాష్ట్రాల హక్కులను పరిరక్షించడం,అధికార కేంద్రీకరణను నిరోధించడం సమాఖ్య ప్రజాస్వామ్యానికి అత్యవసరమని ఆచార్య జయశంకర్ నొక్కి చెప్పారు.జయశంకర్ వ్యక్తిత్వంలో మేధోపరిశీలన,నైతిక నిబద్ధత,ప్రజా ఉద్యమం సమన్వయమయ్యాయి.విశ్వవిద్యాలయ పరిశోధనలను సామాజిక సమస్యల పరిష్కారానికి అనుసంధానించిన ఆదర్శప్రాయమైన విద్యావేత్త ఆయన. ప్రజాస్వామ్యంలో అసమ్మతి అనేది దేశద్రోహం కాదని,ప్రజాస్వామ్య పరిణతికి అవసరమైన ప్రాథమిక లక్షణం.ప్రశ్నించే గొంతులను గౌరవించడం, భిన్నాభిప్రాయాలకు చోటు కల్పించడం,భావప్రకటనా స్వేచ్ఛను కాపాడటం జయశంకర్ ఆశయాలు.రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు.అవి పౌరుల నిత్యజీవితంలో ఆచరణాత్మకంగా అమలైనప్పుడే రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక,ఆర్థిక ప్రజాస్వామ్యంగా పరిణతి చెందుతుందని బలంగా ఆకాంక్షించారు.

విద్యావంతులు అంటే ఉద్యోగాలు సంపాదించుకోవడం మాత్రమే కాదు.బాధ్యతగా సమాజంలో నెలకొన్న అసమానతలను విశ్లేషించడం,పాలకుల విధానాలను ప్రశ్నించడం,శాస్త్రీయ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా సామాజిక బాధ్యతగా జయశంకర్ భావించారు.ఆ వైపుగానే వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు.జయశంకర్ కలలుగన్న తెలంగాణ అంటే కేవలం భౌగోళికంగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం కాదు. ప్రజాస్వామిక స్వేచ్ఛలు,లౌకిక విలువలు,సామాజిక న్యాయం,సమాన అవకాశాలు,మానవీయ అభివృద్ధి కేంద్రంగా నిర్మితమయ్యే ప్రజల తెలంగాణగా రూపుదిద్దుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆచార్య జయశంకర్‌ ను స్మరించుకోవడం ఆయన ప్రతిపాదించిన శాస్త్రీయ దృక్పథాన్ని ఆచరణలో పెట్టడం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేయడంలోనే ఉంటుంది.

ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రమక్రమేనా హరించి వేసుకుంటూ వస్తుంది.ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం మాత్రమే కాదు.రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను కాపాడటం,ప్రజల హక్కులను గౌరవించడంఅధికారంపై రాజ్యాంగ నియంత్రణలను అంగీకరించడం.ఈ మౌలిక సూత్రాలను విస్మరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప,రాజ్యాంగాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకోవాలనుకోవడం ప్రమాదకరం.అధికారమే పరమావధిగా మారినప్పుడు రాజ్యాంగ విలువలు క్రమంగా కనుమరుగవుతాయి. బిజెపి ఆ వైపుగా తన పాలనను కొనసాగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం.న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆందోళనలు తలెత్తడం కూడా ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మంచిది కాదు.న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత ప్రమాదకరం.ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం దెబ్బతింటే ప్రజాస్వామ్యా పునాదులే కదిలిపోతాయి. ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగా చూడాల్సింది పోయి శత్రువులుగా చిత్రీకరించే రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిపోయింది.ప్రశ్నించే గొంతులను అణచివేయడం పాలన బల నిరూపణ కాదు, ప్రభుత్వం యొక్క అభద్రతకు సంకేతం.

సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై రాజకీయ దుర్వినియోగ ఆరోపణలు రావడం తీవ్రమైన ఆందోళనలు కలిగిస్తోంది.చట్టం అందరికీ సమానంగా వర్తించాలి తప్ప,రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే సాధనంగా మారకూడదనేది రాజ్యాంగం చెపుతుంది.పార్లమెంటు ప్రజాస్వామ్యానికి దేవాలయం.అక్కడ చర్చలకు తావులేకుండా,ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా,కీలకమైన చట్టాలను తగిన చర్చ లేకుండానే ఆమోదించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కేంద్రం బలహీనపరుస్తుంది.మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం.ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వతంత్ర మీడియా సంస్థలపై బలంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.విమర్శలు, జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భావప్రకటనా స్వేచ్ఛను కాపాడటం కేంద్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత కావాలి.ప్రజాస్వామ్యంలో అసమ్మతి దేశద్రోహం కాదు. అది ప్రజల రాజ్యాంగబద్ధ హక్కు.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే విద్యార్థులు,యువత,మేధావులు,సామాజిక ఉద్యమకారులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్య సంస్కృతిని దెబ్బతీస్తుంది.అధికార కేంద్రీకరణ ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష ముప్పు.సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల హక్కులు, అధికారాలు, స్వయంప్రతిపత్తిని గౌరవించకుండా కేంద్రం తన అధికార పరిధిని విస్తరించుకోవాలనుకోవడం ద్వారా రాజ్యాంగ సమతుల్యతను దెబ్బతీస్తుంది.

రాజ్యాంగ సంస్థలు అధికార పార్టీకి అనుబంధ విభాగాలుగా పనిచేయడానికి కాదు,ప్రజాస్వామ్య ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడ్డాయి.వాటి నియామకాలు,నిర్ణయాలు,కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి.ప్రజాస్వామ్యాన్ని కాపాడేది వ్యక్తి ఆరాధన కాదు, వ్యవస్థల స్వతంత్రత. నాయకుడిని ప్రశ్నించకూడదనే సంస్కృతి పెరిగినప్పుడు ప్రజాస్వామ్యం క్రమంగా వ్యక్తి కేంద్రిత పాలనగా మారుతుంది.రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం,సౌభ్రాతృత్వం కేవలం పుస్తకాలకు పరిమితమైనవి కావు.అవి పాలనలో ప్రతిబింబించాలి.మతం, కులం, ప్రాంతం ఆధారంగా సమాజంలో విభజనలను పెంచే రాజకీయాలకు రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో స్థానం ఉండకూడదు.దేశ రాజధానిలో యువత పెద్ద ఎత్తున గొంతెత్తడం కేవలం ఒక రాజకీయ నిరసన గా చూడటానికి అవకాశం లేదు.ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతపై వారి ఆందోళనకు ప్రతిబింబం గా పరిగణించాలి.యువత అడుగుతున్న ప్రశ్నలకు అణచివేతతో కాకుండా, ప్రజాస్వామ్యబద్ధమైన సమాధానాలతో ప్రభుత్వం స్పందించాలి.దేశాన్ని పాలించే ప్రభుత్వాలు శాశ్వతం కావు,కానీ రాజ్యాంగం,ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వతంగా నిలవాలి.అధికారంలో ఉన్నవారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు,కానీ ఏ ప్రభుత్వానికీ రాజ్యాంగం కంటే ఎక్కువ అధికారం ఇవ్వరు. ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని,భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే దిశగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఆచార్య జయశంకర్ 15 వ స్మారకోపన్యాసాన్ని హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నాము.

ప్రధాన వక్త దిల్లీకి చెందిన సిద్ధార్థ్ వరదరాజన్ సీనియర్ పాత్రికేయుడు, ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు.సిద్ధార్థ్ వరదరాజన్ ప్రొ: జయశంకర్ 15వ స్మారకోపన్యాసాన్ని”ప్రజాస్వామ్య పునర్జీవనం-సవాళ్లు-భారతదేశ అనుభవాలు” అనే అంశంపై ప్రసంగించనున్నారు .జయశంకర్ సార్ స్పూర్తిని ఎత్తిపట్టడానికి,యువతను విద్యావంతులను,ఉద్యమ శక్తులను,మేధావులను సకలజనులను, సబ్బండ వర్గాలను తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ స్మారకోపన్యాసానికి ఆహ్వానిస్తుంది.

-పందుల సైదులు,న్యాయవాది
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *