ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం

– అమెరికాలో నేషన్ వైడ్ గ్రౌండ్ స్టాప్’

– దేశవ్యాప్తంగా గంటలతరబడి నిలిచిపోయిన 11వేల‌ విమానాలు

వాషింగ్ట‌న్‌, న‌వంబ‌ర్ 14 : అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 11,000 విమానాలు గంటల తరబడి నిలిచిపోయాయి. శుక్ర‌వారం(భారత కాలమానం ప్రకారం 14 తెల్లవారుజామున) ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భద్రతా కారణాలతో ఈ ‘నేషన్ వైడ్ గ్రౌండ్ స్టాప్’ విధించింది. అమెరికాలోని 22 ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మొరాయించడంతో రాడార్, డేటా సమాచారంలో అస్థిరత ఏర్పడింది. పాత సాంకేతిక పరికరాలకు కొత్త టెక్నాలజీని అనుసంధానించే క్రమంలో పాత సిస్టమ్‌లపై భారం (ఓవర్‌లోడ్) పెరిగి ఈ సాంకేతిక లోపం తలెత్తినట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. ఇది ఏదైనా సైబర్ దాడి వల్ల జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

ప్రయాణికుల అవస్థలు 

సుమారు నాలుగు గంటలకు పైగా (అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:54 నుండి రాత్రి 8:15 వరకు) విమానాల టేకాఫ్‌లను నిలిపివేయడంతో 15 లక్షల మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఈ అంతరాయం వల్ల వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా, 10వేల‌ విమానాలు ఆలస్యమయ్యాయి. అప్పటికే గాలిలో ఉన్న 3,000 పైచిలుకు విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేశారు.

సర్వీసులు తిరిగి ప్రారంభం

ఎఫ్ఏఏ ఆంక్షలను ఎత్తివేయడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, విమానాలు సిబ్బంది షెడ్యూల్స్‌ అస్తవ్యస్తం కావడంతో సాధారణ స్థితికి రావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టవచ్చని విమానయాన సంస్థలు తెలిపాయి. (2001 సెప్టెంబర్ 11 దాడులు, జనవరి 2023 నాటి నోట‌మ్‌ సిస్టమ్ లోపం తర్వాత అమెరికాలో విమానాలను ఇంత పెద్ద ఎత్తున నిలిపివేయడం ఇదే మొదటిసారి. అయితే ఎయిర్ ట్రాఫిక్ నెట్‌వర్క్‌ను మరింత ఆధునీకరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు భారీగా నిధులు అవసరమని యూఎస్ రవాణా శాఖ అభిప్రాయపడింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *