“ముఖ్యమంత్రి హోదాలో ఒక నియోజకవర్గానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు ఏం చేస్తారన్నది ముఖ్యం. అక్కడి చేనేత కార్మికుల సమస్యలేమిటి? యువతకు ఉపాధి అవకాశాలేమిటి? రైతుల ఇబ్బందులేమిటి? పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులేమిటి? వాటికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారన్నది ప్రజలకు చెప్పాలి. ర్యాలీలు నిర్వహించడం, ప్రత్యర్థి నాయకులపై విమర్శలు చేయడం, రాజకీయ సవాళ్లు విసరడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. ఒక సభ నిర్వహించినంత మాత్రాన ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్లు కాదు. ఒక నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ప్రసంగించినంత మాత్రాన అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్లు కాదు. అభివృద్ధి పనులు పూర్తి చేసినప్పుడు, ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించినప్పుడే పాలనకు అర్థం ఉంటుంది..”

ఎంఎ.ఎంసీజే, ప్రిలాన్స్ జర్నలిస్ట్
9666680051
ఒక ముఖ్యమంత్రి అంటే కేవలం ఒక రాజకీయ పార్టీకి నాయకుడు మాత్రమే కాదు. ఆయన ఒక రాష్ట్రానికి పరిపాలనా అధిపతి. రాష్ట్రంలోని కోట్లాది ప్రజలకు బాధ్యత వహించే వ్యక్తి. ఆయన మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక ప్రభావం ఉంటుంది. ఆయన వ్యవహరించే తీరు పాలనపై ప్రజలకు ఒక అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి మాట్లాడే భాషలోనూ, చేసే కార్యక్రమాల్లోనూ, వ్యవహారశైలిలోనూ హుందాతనం కనిపించాలి. అధికారంలో ఉన్న వ్యక్తికి రాజకీయ విమర్శలు చేసే హక్కు ఉన్నట్లే.. ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలను పరిశీలిస్తే ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడి రాజకీయ ధోరణి నుంచి బయటకు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ సభ పెట్టినా, ఏ సమావేశంలో మాట్లాడినా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చుట్టూనే ప్రసంగాలు తిరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. బహిరంగ సభలైనా, పార్టీ సమావేశాలైనా, అధికారిక కార్యక్రమాలైనా.. గత ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రజలు ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఏమిటి? తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని, తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తారని, ఇచ్చిన హామీలను అమలు చేస్తారని. కానీ ప్రసంగాల్లో రాజకీయ ప్రత్యర్థుల ప్రస్తావన ఎక్కువై, ప్రజల సమస్యల ప్రస్తావన తగ్గితే పాలనపై సహజంగానే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.
ప్రసంగమా? ప్రత్యర్థులపై దండయాత్రా?
సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటన, భారీ ర్యాలీ, కేటీఆర్‌పై చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజకీయంగా బలపడాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహించడం ఆ పార్టీ రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు. అలాగే త్వరలో సిద్ధిపేటలోనూ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఒక నియోజకవర్గానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు ఏం చేస్తారన్నది ముఖ్యం. అక్కడి చేనేత కార్మికుల సమస్యలేమిటి? యువతకు ఉపాధి అవకాశాలేమిటి? రైతుల ఇబ్బందులేమిటి? పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులేమిటి? వాటికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారన్నది ప్రజలకు చెప్పాలి. ర్యాలీలు నిర్వహించడం, ప్రత్యర్థి నాయకులపై విమర్శలు చేయడం, రాజకీయ సవాళ్లు విసరడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. ఒక సభ నిర్వహించినంత మాత్రాన ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్లు కాదు. ఒక నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ప్రసంగించినంత మాత్రాన అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్లు కాదు. అభివృద్ధి పనులు పూర్తి చేసినప్పుడు, ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించినప్పుడే పాలనకు అర్థం ఉంటుంది.
గత ప్రభుత్వాన్ని విమర్శించడమే ముఖ్యమా?
కేసీఆర్ పదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేయవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలు, గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు జరపవచ్చు. తప్పులు జరిగితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక్కటే ప్రస్తుత ప్రభుత్వ పాలనా కార్యక్రమంగా మారకూడదు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారా? కేటీఆర్ గడ్డం పెంచుకున్నారా? హరీశ్ రావు ఏం చేస్తున్నారు? అనే వ్యక్తిగత ప్రస్తావనల కంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలు నాయకుల వ్యక్తిగత రూపురేఖలు, నివాసాల గురించి వినడానికి సభలకు రావడం లేదు. తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే ముందు తన ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు ఉంచాలి. గత ప్రభుత్వం పదేళ్లలో ఏం చేసింది? ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో ఏం సాధించింది? అనే అంశాలపై గణాంకాలతో చర్చ జరగాలి. అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, రైతుల ఆదాయం వంటి అంశాలపై సమాధానాలు ఇవ్వాలి.
హామీల అమలుపై ప్రజల ప్రశ్నలకు సమాధానమేది?
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీలు ప్రకటించింది. అనేక హామీలు ఇచ్చింది. రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఇతర వర్గాలకు సంబంధించిన హామీలతో ప్రజల్లో ఆశలు కల్పించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేసిన విషయాన్ని కూడా ప్రభుత్వం పదేపదే గుర్తు చేస్తోంది. అయితే ఆ హామీల అమలు విషయంలో ప్రజలకు ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఏ పథకం ఎంతమందికి అందింది? ఎంతమంది అర్హులకు అందలేదు? పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులెన్ని? యువతకు ఉద్యోగాల భర్తీ ఎంతవరకు జరిగింది? రైతు భరోసా పూర్తిస్థాయిలో ఎంతమందికి అందింది? ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదల పరిస్థితి ఏమిటి? మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏవి పూర్తయ్యాయి? ఏవి ఇంకా అమలు కావాల్సి ఉంది? 2026-27 బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ బడ్జెట్ పత్రాలు పేర్కొంటున్నాయి. అయితే బడ్జెట్లో కేటాయింపులు ఉండటం ఒక అంశమైతే, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో ప్రయోజనం అందడం మరో అంశం. కేటాయించిన నిధులు ఎంత ఖర్చయ్యాయి? క్షేత్రస్థాయిలో ఫలితాలు ఏమిటి? అనే వివరాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి.ప్రజలకు కావాల్సింది ప్రకటనలు కాదు.. అమలు. హామీల జాబితా కాదు.. వాటి ద్వారా కలిగే ప్రయోజనం. రాజకీయ విమర్శల కంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ముఖ్యమంత్రి బాధ్యత కాదా?
రాజకీయ సభలకే ప్రాధాన్యమా?
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దుబ్బాక వంటి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాల్లో వర్షాభావం, ఎండిపోతున్న చెరువులు, భూగర్భజలాల తగ్గుదల, బోర్లలో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా కరువు మండలాలను ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రైతుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టాన్ని అంచనా వేసి, అవసరమైన పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైతులకు సాగునీరు, తాగునీరు, పశువులకు మేత, ఉపాధి వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సజావుగా సాగాలి. తేమ శాతం, తాలు, తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు కలగకూడదు. ఎరువుల కొరత రాకూడదు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండకూడదు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. రైతులకు భరోసా కల్పించాలి. కరువు సమస్యను రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాలి.
ప్రాజెక్టుల భవిష్యత్తుపై స్పష్టత ఎక్కడ?
తెలంగాణ సాగునీటి భవిష్యత్తుతో ముడిపడిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలకు స్పష్టత అవసరం. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల సమస్య బయటపడినప్పటి నుంచి ప్రాజెక్టు పునరుద్ధరణ, మరమ్మతులు, నీటి వినియోగంపై చర్చ కొనసాగుతోంది. కేబినెట్ సమావేశాలు, సమీక్షలు, ప్రకటనలు వినిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనుల పురోగతి, పునరుద్ధరణకు సంబంధించిన కార్యాచరణ, గడువులపై ప్రభుత్వం సమగ్ర వివరాలు వెల్లడించాలి. కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడం ఒక అంశం. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు నీటిని అందించేందుకు ఏం చేస్తోంది? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో నిపుణుల సూచనలు ఏమిటి? మరమ్మతులకు ఎంత ఖర్చవుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తారు? గోదావరి జలాలను రైతులకు అందించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు, నీటిముంపు పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పంటలను కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. వరద వచ్చిన తర్వాత పరామర్శలు, ప్రకటనలు చేయడం కంటే ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయాలి.
ప్రజలు కోరుకునేది పాలనా ఫలితాలు!
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ద్వారా కొంతసేపు సభలో చప్పట్లు రావచ్చు. ర్యాలీలతో రాజకీయ సందడి కనిపించవచ్చు. కానీ ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే అభివృద్ధి పనులు జరగాలి. రైతు పొలంలో నీరు పారాలి. పేదవాడికి ఇల్లు అందాలి. నిరుద్యోగికి ఉద్యోగం రావాలి. మహిళకు భరోసా కలగాలి. యువతకు భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడాలి. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, ఉద్యోగులకు భరోసా ఇవ్వాలి, కార్మికులను అక్కున చేర్చుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రసంగాల స్థాయిని మించి పాలనా ఫలితాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై ఎన్ని విమర్శలు చేసినా అవి ప్రజల సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారం కావు. గత ప్రభుత్వ పాలనపై విచారణలు జరగాలి.. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై కూడా సమీక్ష జరగాలి. చివరికి ప్రజలు అడిగేది ఒక్కటే.. మీరు గత ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించారన్నది కాదు.. మీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందన్నది చెప్పండి! ముఖ్యమంత్రి పదవి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే వేదిక కాదు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే బాధ్యతాయుతమైన స్థానం. ఆ పదవికి తగిన మాట, తగిన నడవడిక, తగిన పాలనా దృక్పథం కనిపించినప్పుడే ప్రజల్లో విశ్వాసం బలపడుతుంది. రాజకీయ సభల్లో వినిపించే మాటలకంటే ప్రజల జీవితాల్లో కనిపించే మార్పే ప్రభుత్వానికి అసలైన కొలమానం.





