“ప్రపంచంలోని ఔషధ ఉత్పత్తిలో మన దేశం 5 అత్యధిక ఉత్పాదక దేశాలలో ఒకటిగా నిలిచింది. మన ఉత్పత్తిలో 30% ఔషధాలు 200 పైగా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ కూడా గణనీయంగా జరుగుతున్నాయి. కానీ, ఫార్మసిస్ట్ సేవలను ప్రత్యక్ష ప్రజారోగ్యంలో వినియోగించుకొనే విషయంలో దేశం విఫలమైంది..”
(65వ జాతీయ ఫార్మసీ సప్తాహం: 15-21 నవంబర్ 2026)

ఫోన్: 9440163211
ప్రపంచంలోని ఆరోగ్యసంరక్షణ నిపుణులలో మూడవ అతిపెద్ద సమూహం ఫార్మసిస్ట్ లు. భారత్ లో 13 లక్షల రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లు ఉండగా ఎనిమిదిన్నర లక్షల పైచిలుకు ఫార్మసిస్ట్ లు క్రియాశీలకంగా వృత్తిలో ఉన్నారు. దేశంలో ఫార్మసిస్ట్ ల సాంద్రత ప్రతి పదివేల జనాభాకు 9.1. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 9.5 కు సమీపంలో ఉంది. వీరిలో 40% మంది 35 సంవత్సరాలకు దిగువన ఉన్నారు. దీనికి తోడు దేశంలోని రెండు వేల డి ఫార్మ్, రెండున్నర వేలు బి ఫార్మ్ కాలేజీల నుండి సుమారు 4 లక్షలు మరియు 2 లక్షల చొప్పున పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్నారు. ఫలితంగా భవిష్యత్ అవసరాలకు కావలసిన ఫార్మసిస్ట్ మానవ సంపద మనకు పుష్కలంగా ఉంటుంది. ప్రపంచంలోని ఔషధ ఉత్పత్తిలో మన దేశం 5 అత్యధిక ఉత్పాదక దేశాలలో ఒకటిగా నిలిచింది. మన ఉత్పత్తిలో 30% ఔషధాలు 200 పైగా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ కూడా గణనీయంగా జరుగుతున్నాయి. కానీ, ఫార్మసిస్ట్ సేవలను ప్రత్యక్ష ప్రజారోగ్యంలో వినియోగించుకొనే విషయంలో దేశం విఫలమైంది.
మన దేశంలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కావాలంటె డి ఫార్మ్, బి ఫార్మ్ లేదా ఫార్మ్ డి పట్టా ఉండాలి. తదుపరి ఎం ఫార్మ్, ఎం ఎస్ ఫార్మసీ, పిఎచ్ డి, పి డి ఎఫ్ వంటి అదనపు అర్హతలు ఉన్నాయి. ఇంకా కొన్ని క్లినికల్ స్పెషాలిటీ కోర్స్ ల రూపకల్పన జరగవలసి ఉంది. విద్యా పరంగా మెడికల్ ప్రాక్టిషనర్ లు వ్యాధి చికిత్స, ఫార్మసిస్ట్ లు ఔషధ కల్పన ప్రధానంగా అభ్యసిస్తారు. మెడికల్ ప్రాక్టిషనర్ లకు ఔషధాలు తెలిసినట్లే, ఫార్మసిస్ట్ లకు వ్యాధి చికిత్స తెలుసు. బ్రిటిష్ కాలంలో సబ్-అసిస్టెంట్ సర్జన్ హోదాలో వైద్య సేవలు అందించిన ఎపోతెకరీలు/ ఫార్మసిస్ట్ లు 1970 దశాబ్ది దాకా డిస్పెన్సరీలలో స్వతంత్రంగా, వైద్యశాలల్లో వైద్యాధికారి అనుపస్థితిలో ఆధికారిక ఇన్-ఛార్జ్ గా నడిపిన చరిత్ర ఉంది. ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్ట్ లే పెద్ద దిక్కు. ఆ విషయం తెలిసి, చట్టం తెలిసి కూడా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ ఎచ్ ఎం) కింద ఏర్పాటు చేస్తున్న బస్తీ/ పల్లె దవాఖానల్లో ఫార్మసిస్ట్ లను అసలే నియమించలేదు. జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లుగా ఫార్మసిస్ట్ లను తీసుకోవలసి ఉన్నా ఎన్ ఎచ్ ఎం అధికారులు ఎంపిక చేయడం లేదు.
ప్రభుత్వాల పాక్షిక అవగాహన, ఉన్నతాధికారుల ఒంటెద్దు ఆధిపత్యం మూలంగా ప్రజలకు ఫార్మసిస్ట్ ల సేవలు సమగ్రంగా అందక పోగా, ఫార్మసిస్ట్ లు నిమ్నఉద్యోగిత, నిరుద్యోగిత అనుభవిస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులకు మెడికల్ ప్రాక్టిషనర్ లు మాత్రమే, అదేవిధంగా మెడికల్ ప్రాక్టిషనర్ లకు కూడా తామే ఆరోగ్యరంగ సర్వస్వం అనే భావన ప్రబలంగా నిండి ఉంది. ఫార్మసిస్ట్ ల తోడ్పాటుతో అందరికి ఆరోగ్యం, నాణ్యమైన వైద్యం అందించవచ్చు అనే పరిష్కార వాస్తవికత కంటె వారి అభిజాత్యమే రాజ్యమేలుతున్నది.
నేషనల్ మెడికల్ కమిషన్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కళాశాలల అనుమతి ఇచ్చేటప్పుడు అనుబంధ హాస్పిటల్ లలో ఫార్మసీ డిపార్ట్మెంట్స్ ప్రాధాన్యతను విస్మరిస్తున్నాయి. అన్ని వైద్యశాలల్లో ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పాలని సుప్రీం కోర్ట్ నిర్దేశాలు ఇచ్చినా ప్రభుత్వాలకు, ఆరోగ్య శాఖ అధికారులకు చీమ పారినట్టు కూడా లేదు. ఫలితంగా అహేతుక ఔషధ వినియోగం, ఆంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ జటిలమైన ప్రజారోగ్య సమస్యలుగా మారినాయి.
డబ్బున్న వారు యజమానులుగా మెడికల్ షాప్/ కమ్యూనిటీ ఫార్మసీ, చెయిన్ ఫార్మసీ, ఆన్ లైన్ ఫార్మసీ లు నెలకొల్పుతున్నందున ఫార్మసిస్ట్ ల పాత్ర చాలా సందర్భాలలో కాగితాలకు పరిమితం అయిపోతున్నది. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ల సంఖ్య తక్కువ ఉండి, సహాయక సిబ్బంది, అనువైన కార్యాలయాలు లేక వారు ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవలి కాలంలో క్షేత్రస్థాయిలో ఇతర శాఖలకు చెందిన అధికారుల జోక్యం పెరుగుతున్నది. ఇది డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రత్యేకతకు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ల ఆత్మగౌరవానికి, ఫార్మసీ నిర్వాహకుల ఆత్మ స్థైర్యానికి విఘాతం కలిగించే అంశం. అభివృద్ధి చెందిన దేశాలలో ఫార్మసిస్ట్ లకు సెకండరీ ప్రిస్క్రైబర్ అధికారాలు ఉంటాయి. ఇక్కడ ప్రజావసరం ఉన్నా, సాంప్రదాయకంగా చికిత్సా సేవలు అందిస్తూనే ఉన్నా ఔషధ నిపుణులైన ఫార్మసిస్ట్ లకు ఆంక్షలే ఎక్కువ.
మరి పరిష్కార మార్గాలు ఏమిటి?
* ఫార్మసీ విద్యార్థులకు స్టైపండ్ తో కూడిన నాణ్యమైన అభ్యాస శిక్షణ సక్రమంగా అందించాలి.
* ఫార్మసిస్ట్ లకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కాలానుగుణంగా నిర్వహించాలి.
* అన్ని హాస్పిటల్ లలో పూర్తి స్థాయి ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
* ఔషధాలు, వ్యాక్సిన్స్ ఉన్న అన్ని చోట్ల ఫార్మసిస్ట్ లను నియమించాలి.
* 24 గంటలు నడిచే వైద్యశాలల్లో ప్రతి షిఫ్ట్ కు సరిపడే విధంగా ఫార్మసిస్ట్ లను నియమించాలి.
* ఫార్మసిస్ట్ లు సొంత ఫార్మసీ పెట్టుకోవటానికి బ్యాంక్ రుణాలు, ఇండెమ్నిటి ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించాలి.
* పెద్దల వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పించి కమ్యూనిటీ ఫార్మసీలను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. తద్వారా సాంక్రామిక వ్యాధులను నివారించటంతో పాటు ఆంటీ మైక్రోబియల్ వాడకంను నియంత్రించవచ్చు.
* ఫార్మసిస్ట్ లు స్వయంగా కమ్యూనిటీ/ సోషియల్ ఫార్మసీ ప్రాక్టీస్ చేపట్టి ప్రైమరీ కేర్, మెడికేషన్ మేనేజ్మెంట్, దీర్ఘవ్యాధుల నిర్వహణ, వ్యాధి నిరోధకత, ఆహారం, జీవన శైలి, పోషణ వంటి సేవలు అందించి ప్రజల ఆదరం పొందాలి.
* ఫార్మకోవిజిలెన్స్ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ ల పాత్ర పెంచాలి.
* పరిశ్రమలో ప్రతి దశలో ఫార్మసిస్ట్ పర్యవేక్షణ ఉండాలి.
* ఫార్మసీ కళాశాలలలో ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐ పి ఎ) స్టూడెంట్ ఫోరంను బలోపేతం చేయాలి.
* ఫార్మసిస్ట్ లందరూ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐ పి ఎ) సభ్యత్వం స్వీకరించి ఆరోగ్య వైజ్ఞానిక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి.
* ఐ ఎం ఎ, ఐ డి ఎ వంటి సహ సంఘాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలి.
ఆరోగ్య వ్యవస్థకు ఆధార స్తంభాలైన ఫార్మసిస్ట్ లను బలోపేతం చేసి, వారి విజ్ఞానాన్ని, సేవలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా వినియోగించుకొంటే ఆరోగ్య భారత్ సాకారం సులభసాధ్యం! అందుకే ఐ పి ఎ ఈ 65వ జాతీయ ఫార్మసీ సప్తాహానికి “ఆరోగ్యవంతమైన భవితకు ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ” (ఎంపవరింగ్ ఫార్మసిస్ట్ స్ ఫర్ హెల్దియర్ ఫ్యూచర్) అనే నినాదాన్ని ఎంపిక చేసింది.





