- సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించేందుకు చర్యలు
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగునీరు అందించి రైతులకు బాసటగా నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని, రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల నేరుగా మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ లో చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరి పంట విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి, రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం నుంచి శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా రైతులకు వివరించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పద్దతిలో వరి పంటకు నీరు అందించాలని, దీనివల్ల నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు, అధిక దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
స్వల్పకాలిక రకాలను నవంబర్ లోనే సాగును ప్రారంభిస్తే.. మార్చి మొదటి వారం వరకు వరికోతకు రావడానికి అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తద్వారా నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు, వడగళ్ల వర్షం వంటి విపత్తుల నుంచి కూడా వరిని రక్షించుకోవడానికి వీలు కలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, పవర్ టిల్లర్స్, పవర్ వీడర్, రోటోవేటర్, ట్రాక్టర్ తో నడిపే పరికరాలు, తైవాన్ స్ప్రేయర్స్ మొదలైన వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ పై వెంటనే రైతులకు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ యాస్మిన్ బాషా కు మంత్రి సూచించారు. గత ఐదేళ్లలో టిజి సీడ్స్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని, టిజి సీడ్స్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు.
ఈ సంవత్సరం సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన సీడ్స్ ని అంతా రైతులకు సరసమైన ధరలో అందించగలిగామని, గత ఐదేళ్లలో సీడ్స్ ని నాన్ సీడ్ గా అమ్మినందుకే దాదాపు 90 కోట్లు నష్టం వొచ్చిందని తెలిపారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన సన్న రకాల విత్తనాలను రైతులకు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ కి సూచించారు. కందులు, మినుములు, సన్ ఫ్లవర్, శనగలు మొదలైన పంటల విషయంలో నాణ్యమైన విత్తనాలను సీడ్ కార్పొ రేషన్ ద్వారా అందించాలన్నారు.
మార్క్ ఫెడ్ ద్వారా నిర్వహిస్తున్న జిన్నింగ్ మిల్లు గత నాలుగేళ్లుగా ఉపయోగంలో లేదని, ఈ సంవత్సరం దానిని ఆరంభించామన్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్న గోదాములు 100 శాతం పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మద్ధతు ధరతో కొనుగోలు చేస్తున్న కందులు, శనగలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు మొదలైన పంటల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సీడ్ కార్పొరేషన్ ఎండి యాస్మిన్ బాషా, సీడ్ సర్టిఫికేషన్ ఎండి కేశవులు, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.