దిల్లీకి నజరానా.. రైతుకు జరిమానా..

వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతున్నా కనికరం లేదా?
ఏసీ రూముల్లో ఉత్తమ్ అబద్ధాలు.. చౌటుప్పల్ మార్కెట్‌కు వచ్చి రైతుల గోస చూడు
తరుగు పేరుతో దోపిడీ చేస్తుంటే ‘తోలు తీస్తామన్న’ సీఎం ఏమయ్యారు?
రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు నిప్పులు

యాదాద్రి భువనగిరి, ప్ర‌జాతంత్ర‌, మే 7 : “రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన దిల్లీకి నజరానా చెల్లించడానికి, రైతులకు జరిమానా విధించడానికి అన్నట్టుగా తయారైంది” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు తీవ్రంగా విమర్శించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. నెల రోజులుగా వడ్ల కుప్పల వద్ద నిరీక్షిస్తున్న రైతుల ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులైనా వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన హరీశ్ రావు, రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలకు గుండెలు అరచేతిలో పెట్టుకుని పడిగాపులు కాస్తున్న రైతుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏమ‌న్నారంటే.. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. వడ్ల కుప్పల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా, సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవ‌ల ప్రెస్ మీట్ పెట్టి మేం చాలా బాగా వడ్లు కొంటున్నాం, ఎవరికీ ఇబ్బంది లేదు అని గొప్పలు చెప్పారు. తాను ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడటం లేదు. మీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాన‌ని హ‌రీష్ రావు అన్నారు.

ఈ తల్లీ, ఈ చెల్లెలు వడ్లు మార్కెట్ కు తెచ్చి 24 రోజులైంది. 30న మాయిశ్చర్ చూసి పాస్ అన్నాక కూడా 8 రోజులుగా కాంటా పెట్టే దిక్కే లేదు. 44 డిగ్రీల ఎండలో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ, పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇది పూర్తిగా మీ ప్రభుత్వ చేతగానితనమే. మాయిశ్చర్ చూడటానికి పది రోజులు, సంచులివ్వడానికి వారం, కాంటాకు వారం, మిల్లుకు వెళ్లడానికి మరో వారం పడుతోంది. తీరా మిల్లుకు వెళ్లాక తాలు ఉందని చెప్పి లారీకి 4, 5 బస్తాలు కటింగ్ పెడుతున్నారు. అటు మార్కెట్లో తరుగు, ఇటు మిల్లులో కోత.. అసలు మీకు వడ్లు కొనడం చేతవుతోందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గల్లీలకు వచ్చి రైతుల గోస వినండి. మీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే.. ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా అన్నట్టుగా తయారైంది. 69 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టే బదులు రైతులను పట్టించుకోండి. తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం.. ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలి. ప్రతి బస్తాకు 2-3 కిలోల తరుగు తీస్తుంటే ఏం చేస్తున్నారు? అని హ‌రీష్ రావు నిల‌దీశారు.

మంచిర్యాలలో అకాల వర్షాలకు గోడ కూలి వడ్ల కుప్పల వద్ద ముగ్గురు రైతులు, కొడుకు చనిపోయారు. నల్గొండ జిల్లాలో వడ్ల కుప్పల మీదనే రైతు గుండె ఆగి చనిపోయాడు. రైతు భరోసా వారోత్సవాలు చేస్తున్నారు. ఎకరాకు చొప్పున విడతల వారీగా విదిలిస్తూ సంబరాలు ఏ మొహం పెట్టుకుని చేస్తున్నారు? రైతుబంధు, యూరియా, రుణమాఫీ, కొనుగోళ్లు అన్నీ ఎగ్గొట్టినందుకు చేస్తున్నారా ఈ వారోత్సవాలు? రాష్ట్ర, దేశ చరిత్రలో యూరియా అమ్మకాలపై నిషేధం విధించిన ఏకైక ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ దేన‌ని ఆరోపించారు. కూరగాయలు, ఆయిల్ పామ్ పండించే రైతులకు యూరియా అమ్మొద్దని బోర్డులు పెట్టడం మీ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమ‌న్నారు. మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్ కొని నెలలు దాటుతున్నా రైతులకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. కేసీఆర్ కరెంటు, సాగునీరు, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. కానీ మీరు ధాన్యం కొనకుండా జాప్యం చేసి, రైతులు దళారులకు అగ్గువకు అమ్ముకునేలా కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని మార్కెట్లకు సరిపడా లారీలు, గన్నీ బ్యాగులు పంపాలని, మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసి యుద్ధప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *