‘మమత స్వయంకృతం ..!

     “తాను తీసిన గోతిలో  ..” అని తెలుగులో ఒక సామెత .. ఆ సామెత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన ముఖ్యమంత్రి ( ఇంకా రాజీనామా చేయలేదు )  మమతా బెనర్జీ కి సరిపోతుంది. ప్రతి పక్ష రహిత రాజకీయలే లక్ష్యంగా .. ఏ పార్టీ అండదండలతో రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలను వంద మీటర్ల గోతిలో మమత పాటిపెట్టిందో .. ఇప్పుడు అదే పార్టీ టీఎంసీ ను ప్రతిపక్ష గోతిలోకి తోసేసింది.
    పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం గత మూడు దశాబ్దాలుగా అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఒకప్పుడు వామపక్షాల కంచుకోటగా ఉన్న బెంగాల్‌లో, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ ) ప్రస్థానం మరియు భారతీయ జనతా పార్టీ  అనూహ్య ఎదుగుదల వెనుక మమతా బెనర్జీ పాత్ర విడదీయలేనిది.  ఆమె రాజకీయ వ్యూహాలే పరోక్షంగా బెంగాల్‌లో కమలం వికసించడానికి దోహదపడ్డాయి ,
     పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సామెత ఉంది: “బెంగాల్ ఈరోజు ఆలోచించేది, భారతదేశం రేపు ఆలోచిస్తుంది.” కానీ నేడు బెంగాల్ రాజకీయాల్లో కనిపిస్తున్నది   మాత్రం దేశ రాజకీయాలకే ఒక పాఠంగా మారింది. 34 ఏళ్ల సుదీర్ఘ వామపక్ష పాలనను అంతమొందించిన మమతా బెనర్జీ, అదే ఉత్సాహంతో ప్రతిపక్ష రహిత రాష్ట్రాన్ని సృష్టించాలనుకోవడం ఇప్పుడు ఆమెకే సవాలుగా మారింది.
1990ల చివరలో మమతా బెనర్జీ కాంగ్రెస్ నుండి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించినప్పుడు, బెంగాల్‌లో బీజేపీ ఉనికి నామమాత్రం. అప్పట్లో వామపక్షాల ఎదుర్కోవడానికి ఆమెకు ఒక బలమైన శక్తి అవసరమైంది. 1998లో వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే  లో చేరడం ద్వారా ఆమె బీజేపీకి బెంగాల్ సరిహద్దులు దాటడానికి అనుమతి ఇచ్చారు. ఆ పొత్తు ద్వారానే బీజేపీ బెంగాల్‌లో తొలిసారిగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. బీజేపీని ఒక “అంటరాని” పార్టీగా కాకుండా, బెంగాల్ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా పరిచయం చేసిన క్రెడిట్  మమతకే దక్కుతుంది.
2011లో రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన తర్వాత, మమత అనుసరించిన ప్రధాన వ్యూహం ‘ప్రతిపక్ష రహిత బెంగాల్’. ఆమె కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలను క్షేత్రస్థాయిలో బలహీనపరిచారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ  ఇతర పార్టీల నుండి గెలిచిన నాయకులను టీఎంసీ లో చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. రాజకీయ హింస లేదా ఒత్తిళ్ల కారణంగా కాంగ్రెస్, లెఫ్ట్ కార్యకర్తలు తమ ఉనికిని కాపాడుకోలేకపోయారు.
దీని వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి బీజేపీకి అవకాశం దొరికింది. టీఎంసీ అరాచకాలను ఎదిరించలేక, కాంగ్రెస్ లేదా లెఫ్ట్ రక్షించలేక ఉన్న కార్యకర్తలు తమకు రక్షణనిచ్చే ఏకైక శక్తిగా బీజేపీని భావించడం ప్రారంభించారు. అందుకే బీజేపీని ఒక ‘లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ’గా ప్రజలు చూడటం మొదలుపెట్టారు. బెంగాల్‌లో టీఎంసీ కేడర్ బలం అపారం. దీనిని ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు అవసరమని మమతా బాధిత రాజకీయ పార్టీల  క్షేత్ర స్థాయి నాయకులు భావించారు. మమత అణిచివేత ధోరణి వల్ల లెఫ్ట్ వోటు బ్యాంకు ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్లింది. “ముందు రాముడు, తర్వాత వాముడు” (First Ram, then Left) అనే నినాదం బెంగాల్ గ్రామాల్లో వినపడటం మమత వైఫల్యానికి నిదర్శనం. ప్రజలు తమకు టీఎంసీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన శత్రువు కావాలని కోరుకున్నారు, ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది.
మమతా బెనర్జీ అనుసరించిన కొన్ని విధానాలు, ముఖ్యంగా మైనారిటీ బుజ్జగింపు రాజకీయం అనే ముద్ర పడటం బీజేపీకి వరంగా మారింది. దీనికి తోడు శారదా, నారదా వంటి కుంభకోణాలు మరియు స్థానిక టీఎంసీ నాయకుల అవినీతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను నింపాయి. ఈ వ్యతిరేకతను వోట్లుగా మార్చుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలవడం, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం వెనుక మమత సృష్టించిన రాజకీయ శూన్యతే ప్రధాన కారణం.

     మమతా బెనర్జీ తన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, లెఫ్ట్‌లను నామరూపాలు లేకుండా చేయాలని చూశారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఒక సహజ అవసరం. ఒక పాత గోడను కూల్చితే, ఆ స్థలంలో కొత్త గోడ కట్టడం సహజం. మమత పాత గోడలను (వామపక్ష,కాంగ్రెస్ ) కూల్చేశారు, కానీ ఆ స్థలంలో అంతకంటే బలమైన ‘బీజేపీ’ అనే గోడ వెలిసింది. నేడు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదల అనేది కేవలం ఆ పార్టీ గొప్పతనం మాత్రమే కాదు, అది మమతా బెనర్జీ వ్యూహాత్మక తప్పిదాల ఫలితం కూడా. ఏ పార్టీ అయితే తనను తాను రక్షించుకోవడానికి బీజేపీని చేరదీసిందో, ఈరోజు అదే పార్టీ ఆమె ఉనికికే సవాలుగా మారడం ఒక చారిత్రక వైచిత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *