సొంత ఎమ్మెల్యేలే అవినీతిని నిల‌దీస్తున్నారు

– రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌విస్తున్నా
– కుటుంబం కోస‌మే ప‌నిచేస్తున్న రేవంత్‌
– హైకోర్టు తీర్పు మాటున క‌ళ్యాణ‌ల‌క్ష్మి ర‌ద్దుకు కుట్ర‌
– మీడియాతో బీఆర్ ఎస్ నేత‌ కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 15: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పడం మాత్రమే కాదని, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా వెల్లడిస్తున్నారని బీఆర్ ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ‌నివారం తెలంగాణ భవన్లో న్యూస్ ఏజెన్సీలు, మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఆయన తెలిపారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో పాలన ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఇంతకాలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ విమర్శలుగా కొట్టిపారేస్తూ వచ్చిందని కేటీఆర్ అన్నారు. అయితే ఇప్పుడు అదే ఆరోపణలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నోటి నుంచి వస్తున్నాయని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయడం సాధారణ విషయం కాదని, ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ, ఏఐసీసీకి ఏటీఎంగా మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒకవైపు దేశ ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని చెబుతున్నారని, మరోవైపు రాష్ట్రంలో అవినీతిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నలు లేవనెత్తుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారన్న ఆరోపణలు ప్రధానమంత్రి స్థాయి నుంచి వస్తున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలో లేదా రాజకీయ వేదికలపై అవినీతి ఆరోపణలు చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని, ఆరోపణల్లో వాస్తవం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై రాజకీయ విమర్శలు చేసుకోవడం కాకుండా, వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిన విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఈడీ దాడులు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో, విచారణ ఎక్కడికి చేరిందో ప్రజలకు స్పష్టత లేదని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎవరి విషయంలోనైనా ఆరోపణలు వచ్చినప్పుడు రాజకీయ అనుబంధాలను పక్కనపెట్టి చట్ట ప్రకారం విచారణ జరగాలని, దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకం కలిగేలా వాటి పనితీరు ఉండాలని అన్నారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి రూ.5–6 లక్షల వంటి చిన్న మొత్తంలో సాయం పొందాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది నిబంధనలు, షరతులు విధిస్తోందని కేటీఆర్ విమర్శించారు. పేదల సంక్షేమం కోసం రూపొందించిన పథకాల ప్రయోజనాలు పొందేందుకు సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు.

18 గంటలు పనిచేస్తున్నది రాష్ట్రం కోసం కాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని పదేపదే చెప్పుకుంటున్నారని, అయితే ఆయన 18 గంటలు పనిచేస్తున్నది రాష్ట్రం కోసం కాదన్నారు. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బావమరుదులు, అల్లుడికి భూములు, కాంట్రాక్టులు, నిధులు దోచిపెట్టేందుకే ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎనుముల తిరుపతిరెడ్డి, కొండలరెడ్డి తదితరులకు ఎలా భూములు సమకూర్చాలి, వారికి ఎలా సంపద దోచిపెట్టాలి, కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులకు ఎలా ప్రయోజనాలు కల్పించాలి అన్నదానిపైనే ముఖ్యమంత్రి దృష్టి ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకోవడం కాకుండా, ముఖ్యమంత్రి తన పాలనలో ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించాలని, అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కల్యాణలక్ష్మిరద్దుకు కుట్ర

కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని కేటీఆర్ అన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కల్యాణలక్ష్మి అంశంలో హైకోర్టు తీర్పు వెలువడిందని కేటీఆర్ అన్నారు. లక్షలాది మంది ఆడబిడ్డల జీవితాలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన కల్యాణలక్ష్మి పథకంపై స్పందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం లేకుండా పోయిందని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకం కేవలం ఆర్థిక సాయం అందించే కార్యక్రమం మాత్రమే కాదని కేటీఆర్ అన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించడంతో పాటు, బాల్య వివాహాలను అరికట్టడంలో, ఆడబిడ్డలు చదువుకు దూరం కాకుండా చూడటంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆడపిల్ల పుట్టడం కుటుంబానికి భారం కాదనే గొప్ప సందేశాన్ని కల్యాణలక్ష్మి సమాజానికి ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఒక తులం బంగారం అదనంగా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కల్యాణలక్ష్మి పథకాన్నే నిర్వీర్యం చేసే పరిస్థితికి తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.పేద తల్లిదండ్రులకు ఆడబిడ్డలు భారం కాదనే ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన కల్యాణలక్ష్మి పథకం ఎంతోమంది కుటుంబాలకు అండగా నిలిచిందని కేటీఆర్ అన్నారు.

ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలకు మంగళం

బీఆర్ ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా రద్దు చేస్తోందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్‌ను రద్దు చేశారని, కల్యాణలక్ష్మిని నిర్వీర్యం చేస్తున్నారని, షాదీ ముబారక్‌ను పక్కన పెట్టారని, రైతు బీమాను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను రద్దు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన కార్యక్రమంగా మారిందని, ప్రజలకు ఉపయోగపడే కొత్త పథకాలను కనీసం ప్రారంభించే పరిస్థితి కూడా లేదని కేటీఆర్ అన్నారు. ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించకుండా, వాటి ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేయడం వల్ల పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కేవలం రాజకీయ పథకాలు కాదని, తెలంగాణలోని పేదలు, రైతులు, మహిళలు, ఆడబిడ్డల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో అమలు చేసిన కార్యక్రమాలని కేటీఆర్ అన్నారు. అలాంటి పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

న‌ల్సార్‌ విద్యార్థుల ఆత్మగౌరవ పోరాటానికి మద్దతు

న‌ల్సార్‌ విద్యార్థులకు సంబంధించిన పరిణామాలపై కూడా కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో అవమానం లేదా ఆత్మగౌరవంపై దాడి జరిగితే యువత సహజంగానే తిరగబడుతుందని అన్నారు. తమ హక్కులు, గౌరవం కోసం ధైర్యంగా నిలబడిన న‌ల్సార్‌ విద్యార్థులకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. విద్యార్థులు, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని గుర్తించిన భారత ప్రధాన న్యాయమూర్తికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థుల గొంతుకకు, వారి హక్కులకు, న్యాయం కోసం వారు చేసే పోరాటానికి తగిన గౌరవం ఉండాలని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *